ఈవారం బాక్సాఫీస్.. ఇద్దరు కామెడీ హీరోల మధ్య చైల్డ్ ఆర్టిస్ట్

ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే హాస్యనటులు చాలామంది.. అప్పుడప్పుడూ వెండితెరపై హీరోయిజాన్ని కూడా ప్రదర్శించినవారే. ఈవారం కూడా ఇద్దరు హాస్య నటులు హీరోలుగా సిల్వర్ స్క్రీన్ పై మాయాజాలం చేయడానికి వచ్చేస్తున్నారు. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది హర్ష చెముడు. ‘వైవా’ వెబ్ సిరీస్ తో డిజిటల్ దునియాలో మంచి పేరు తెచ్చుకున్న హర్ష.. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్య నటుడిగా నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.

వైవా హర్ష ‘సుందరం మాస్టర్’ మూవీతో హీరోగా మారాడు. మాస్ మహారాజ రవితేజకు సంబంధించిన ఆర్.టి. టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ సంతోష్ దర్శకుడు. హర్షకి జోడీగా దివ్య శ్రీపాద నటించింది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు. ఈవారంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి ఫిబ్రవరి 23న ఆడియన్స్ ముందుకు వస్తోంది ‘సుందరం మాస్టర్’. ఓ ఆదివాసీ గ్రామం నేపథ్యంలో ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా ‘సుందరం మాస్టర్’ వస్తోంది.

‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ సినిమాతో.. ‘సేవ్ ది టైగ‌ర్స్’ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు అభినవ్ గోమటం. ఇక.. ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ సినిమాలోని అతని పాపులర్ డైలాగ్ అయిన ‘మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ టైటిల్ ‌తోనే అభిన‌వ్ హీరోగా పరిచయమవుతున్నాడు. వైశాలి రాజ్ ఈ సినిమాలో హీరోయిన్‌. తిరుప‌తి రావు ఇండ్ల ద‌ర్శ‌క‌త్వంలో భ‌వాని కాసుల‌, ఆరెమ్ రెడ్డి, ప్ర‌శాంత్‌.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో మంచి బజ్ ఏర్పరచుకున్న ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’ మూవీ ఫిబ్రవరి 23న వస్తోంది.

వైవా హర్ష, అభినవ్ గోమటం వంటి కమెడియన్స్ తో పాటు ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి ఓ బాల నటుడు కూడా రెడీ అయ్యాడు. చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్టుగా ‘ఆర్య, అతడు, పౌర్ణమి, భద్ర’ వంటి సినిమాలలో నటించిన దీపక్ సరోజ్.. హీరోగా పరిచయమవుతోన్న సినిమా ‘సిద్ధార్థ్ రాయ్’. ‘అర్జున్ రెడ్డి’ ఛాయలతో.. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. వి.యశస్వి దర్శకత్వంలో జయ అడపాక ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రంలో తన్వి నేగి, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. శ్యామ్ కె.నాయుడు, ప్రవీణ్ పూడి వంటి టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేశారు. ఫిబ్రవరి 23న ‘సిద్ధార్థ్ రాయ్’ విడుదలవుతోంది.

Related Posts