మెగా ప్రొడ్యూసర్ కి బర్త్ డే విషెస్

మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ అవ్వడంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రూటే సెపరేటు. దాదాపు ఐదు దశాబ్దాలుగా నిర్మాతగా కొనసాగుతోన్న అల్లు అరవింద్ పుట్టినరోజు ఈరోజు (జనవరి 10). తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేరు అల్లు అరవింద్. దిగ్గజ హాస్య నటుడు అల్లు రామలింగయ్య తనయుడిగా చిత్ర రంగంలోకి ప్రవేశించినా.. అనతి కాలంలోనే నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 1974లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘బంట్రోతు భార్య’ సినిమాతో నిర్మాతగా పరిచయమైన అరవింద్.. ఇప్పటికీ అదే స్పీడును కొనసాగిస్తున్నారు.

మెగా కాంపౌండ్ లో మెగాస్టార్ చిరంజీవికి పలు మెగా హిట్స్ అందించిన అల్లు అరవింద్.. తన కుటంబంలోని ఇతర హీరోలతోనూ సూపర్ హిట్స్ అందుకున్నారు. ఒక్క తెలుగులోనే కాకుండా పలు భాషల్లో సినిమాలు నిర్మించి.. అక్కడా ఘన విజయాలు సొంతం చేసుకున్నారు. నేటితరం హీరోలు, దర్శకులతో సినిమాలను నిర్మిస్తూ.. వరుస సక్సెస్ లు సొంతం చేసుకుంటున్న క్రెడిట్ కూడా అరవింద్ కే దక్కుతుంది. కేవలం నిర్మాతగానే కాకుండా.. పలు చిత్రాల డిస్ట్రిబ్యూషన్.. థియేటర్ల నిర్వహణ.. అల్లు అరవింద్ నేతృత్వంలో సాగుతున్నాయి. మొత్తంమీద.. తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాత అనే పదానికి నిర్వచనంగా నిలిచిన అరవింద్ ఎందరికో స్ఫూర్తిదాయకం.

Related Posts