‘ది గోట్ లైఫ్.. ఆడు జీవితం‘ రివ్యూ

నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్, జిమ్మీ జీన్-లూయిస్, KR గోకుల్, తాలిబ్ అల్ బలూషి మరియు రిక్ అబీ తదితరులు
తదితరులు
సినిమాటోగ్రఫి: సునీల్ కె.ఎస్‌
సంగీతం: ఏ ఆర్ రెహమాన్
ఎడిటింగ్‌: శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు: బ్లెస్సీ, జిమ్మీ జీన్-లూయిస్, స్టీవెన్ ఆడమ్స్
దర్శకత్వం: బ్లెస్సీ
విడుదల తేది: మార్చి 28, 2024

నేటితరం మలయాళీ స్టార్స్ లో అగ్రపథాన దూసుకెళ్తున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. హీరోగా విభిన్నమైన కథాంశాలలో నటించే పృథ్వీరాజ్ ‘సలార్‘తో తెలుగు ప్రేక్షకులకూ బాగా సుపరిచితుడు. ఈ వెర్సటైల్ యాక్టర్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ది గోట్ లైఫ్’. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. ‘ది గోట్ లైఫ్.. ఆడు జీవితం’ పేరుతో ఈ చిత్రం పలు భాషల్లో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. పృథ్వీరాజ్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
బ్రతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన నజీబ్ అనే యువకుడు ఎలాంటి కష్టాలు పడ్డాడు అనేదే ‘ది గోట్ లైఫ్‘ కథాంశం. ఈ సినిమా కథ విషయానికొస్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్), తన భార్య సైను (అమలా పాల్)తో కేరళలోని ఒక కుగ్రామంలో జీవిస్తుంటాడు. డబ్బుల కోసం బాగా ఇబ్బంది పడుతున్న నజీబ్.. తన మిత్రుల సలహాతో గల్ఫ్ వెళతాడు. దొంగ వీసాతో గల్ఫ్ వెళ్లిన నజీబ్ ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారిలో పడేస్తారు. అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఫలితం ఉండదు. మరి.. ఆ ఎడారి నుంచి తప్పించుకుని నజీబ్ బయటపడ్డాడా? ఆ క్రమంలో అతను ఎదుర్కొన్న కష్టాలు ఏంటి? అనేదే మిగతా కథ.

విశ్లేషణ:
డైరెక్టర్ బ్లెస్సీ ‘ది గోట్ లైఫ్‘ మూవీపై 16 ఏళ్లు పని చేశాడు. 2008లో అనుకొని మొదలు పెడదామనుకునే సమయానికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. మొత్తానికి 2018లో అనౌన్స్ చేశారు. అయితే ఆ తర్వాత కొవిడ్ కారణంగా మళ్లీ అడ్డంకులు ఏర్పడ్డాయి. మలయాళంలో బెస్ట్ సెల్లింగ్ నవల అయిన ‘ఆడుజీవితం‘ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

ఎలాంటి అవగాహన లేకుండా చెప్పుడు మాటలు విని దొంగ వీసాలపై విదేశాలకు వెళ్లే వాళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది? అనేదే ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్ బ్లెస్సీ. నిడివి ఎక్కువగా ఉండడంతో సినిమాలోని ఎమోషన్ ని ఆద్యంతం క్యారీ చేయడంలో డైరెక్టర్ విఫలమయ్యాడని చెప్పొచ్చు.

దాదాపు మూడు గంటల నిడివితో ఉండే ఈ సినిమా మొదట్లో స్లోగా సాగుతున్న అనుభూతి కలుగుతుంది. లీడ్ క్యారెక్టర్స్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను ఎస్టాబ్లిష్ చేయడం వంటి సన్నివేశాలతో కాస్త బోరింగ్ అనిపిస్తుంది. అందుకు ముఖ్య కారణం
‘ది గోట్ లైఫ్‘ నవల 43 ఛాప్టర్స్ గా ఉంటుంది. అంత పెద్ద నవలను మూడు గంటల సినిమాలో చూపించడం కష్టమే.

పృథ్వీరాజ్ సుకుమారన్ ఎడారి సన్నివేశాలు, అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి. ఇక ఎడారి నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్.. అదే విధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్ గా బాగానే కనెక్ట్ అవుతాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణులు:
నటీనటుల విషయానికొస్తే నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ జీవించాడని చెప్పొచ్చు. ఈ పాత్రకోసమే పృథ్వీరాజ్ ఏకంగా 31 కిలోల బరువు తగ్గాడట. సౌదీ అరేబియాలోకి ప్రవేశించే ముందు క్లీన్ షేవ్ తో హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తాడు పృథ్వీరాజ్. ఆ తర్వాత ఎడారిలో చిక్కుకున్నాక.. బాగా పెరిగిన జుట్టుతో.. ఎముకుల గూడులాంటి శరీరంతో పీలగా కనిపిస్తాడు. ఓవరాల్ గా ‘ది గోట్ లైఫ్‘ పృథ్వీరాజ్ ఒన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు.

అమలా పాల్.. సైను పాత్రలో కనిపించింది. కనిపించేది తక్కువ సేపే అయినా.. ఆమె రోల్ ఇంప్రెస్సివ్ గా ఉంటుంది. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్ పోషించిన ఇబ్రహీం ఖాద్రి పాత్ర కూడా బాగుంది. హకీం పాత్రలో గోకుల్ ఆకట్టుకున్నాడు.

సాంకేతికంగా ‘ది గోట్ లైఫ్‘ మూవీకి అత్యద్భుతమైన టెక్నీషియన్స్ పనిచేశారు. తన పాటలతో పాటు.. కొన్ని సన్నివేశాల్లో తన నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు ఏ.ఆర్.రెహమాన్. ఇలాంటి సినిమాకి సినిమాటోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోని విలేజ్ లో చిత్రీకరించిన విజువల్స్.. సౌదీలోని ఎడారి సన్నివేశాలు కానీ.. సినిమాటోగ్రాఫర్ సునీల్ కె.ఎస్‌ చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది.

చివరగా:
మొత్తంగా.. ‘ది గోట్ లైఫ్.. ఆడు జీవితం‘ ఓ ప్రయోగాత్మక చిత్రం. వాస్తవ సంఘటల ఆధారంగా తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ చూడడానికి కాస్త ఓపిక కావాలి.

రేటింగ్ : 3.5 / 5

Related Posts