ఆర్జీవీ వ్యూహం.. పక్కా రాజకీయం

రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. కొన్నాళ్లుగా సినిమాల పరంగా దారుణమైన ఫలితాలు చూస్తున్నాడు. అయినా తనదైన శైలిలో రకరకాల సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే రియల్ స్టోరీస్ ను తీస్తున్నప్పుడు అతను ఎంచుకునే ఆర్టిస్టులు మాత్రం చాలా కరెక్ట్ గా సూట్ అవుతుంటారు. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన కథతో ”వ్యూహం” అనే సినిమాతో వస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ విడుదల చేశాడు రామ్ గోపాల్ వర్మ.


ఈ టీజర్ చూస్తే పూర్తిగా జగన్ కు అనుకూలమైన కథ, కథనాలతో రూపొందించినట్టుగా అర్థం అవుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం నుంచి మొదలైన టీజర్.. ఆయన మరణం తర్వాత జరిగిన అనేక సంఘటనలను టచ్ చేస్తూ.. జగన్ ను రాజకీయంగా దెబ్బతీసిన జైలుకు పంపించిన వైనం.. రోజుల తరబడి కుటుంబం అంతా మానసిక వేదన అనుభవించారని చెప్పడం.. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక వందలమంది ప్రాణాలు కోల్పోవడం నుంచి అధికారంలోకి రావడం వరకూ అన్ని సంఘటనలను డాక్యుమెంట్ చేసినట్టుగా ఈ టీజర్ చూస్తే అర్థం అవుతుంది.

టీజర్ చివర్లో ఒకే ఒక్క డైలాగ్ ఉంది. ”అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు” అనేదే ఆ డైలాగ్. మరి ఇది ఏ సందర్భంలో వస్తుందో కానీ.. ఈ డైలాగ్ ను బట్టి పొలిటికల్ గా ఈ మూవీ ఏపి రాజకీయాలను వేడెక్కించేలా కనిపిస్తోంది.


వ్యూహం టీజర్ మొత్తం ప్రధానంగా చంద్రబాబుపై అటాకే ధ్యేయగా ఈ వ్యూహం రచించారని అర్థం అవుతోంది. చంద్రబాబు వల్ల జగన్ ఎంత ఇబ్బంది పడ్డాడు. అతన్ని కేస్ ల్లో ఎలా ఇరికించారు అనే పాయింట్స్ ను టచ్ చేస్తూ కొన్ని అవాస్తవాలు కూడా కల్పించారని తెలుస్తోంది.

ఆర్జీవీని అవుట్ డేటెడ్ అని, వైసీపీ మనిషి అని ఎంత చెప్పుకున్నా.. ఈ వ్యూహం టీజర్ తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కౌంటర్ మూవీ తీయాల్సిందే అనేలా కనిపిస్తోంది. మరి దీనికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి ప్రతి వ్యూహం ఉంటుందో చూడాలి.

Related Posts