రంగబలి

రివ్యూ : రంగబలి
తారాగణం : నాగ శౌర్య, యుక్తి తరేజా, సత్య, మురళీశర్మ, షైన్ టామ్ చాకో, శుభలేఖ సుధాకర్, నోయల్, తదితరులు
ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్
సంగీతం : పవన్ సిహెచ్
సినిమాటోగ్రఫీ : వంశీ పచ్చిపులుసు, దివాకర్ మణి
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం : పవన్ బాసంశెట్టి

2018లో వచ్చిన ఛలో తర్వాత ఇప్పటి వరకూ హిట్టే లేని హీరో నాగశౌర్య. హిట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కొత్త కథలు ప్రయత్నించాడు. తన ఇమేజ్ ను దాటి చూశాడు.ఫలితం రాలేదు. అలాగని మరీ దారుణమైన సినిమాలైతే కావు. కాకపోతే కోరుకున్న విజయాన్ని ఇవ్వనప్పుడు ఆ సినిమాలు అతనికి ఉపయోగపడనట్టే కదా..? బట్ చాలా రోజుల తర్వాత శౌర్య ష్యూర్ గా హిట్ కొట్టబోతున్నాడు అనే కలర్ తో కనిపించిన సినిమా రంగబలి. పైగా శౌర్య ఈ మూవీ బ్లాక్ బస్టర్ మాత్రమే అవుతుందని చాలా నమ్మకంతో చెప్పాడు. టీజర్, ట్రైలర్ విపరీతమైన నవ్వులు పంచాయి. మరి ఆ నవ్వులు సినిమా చూసిన వారికి కూడా కలిగాయా అనేది చూద్దాం..

కథ :
రాయవరం అనే ఊరులో.. శౌర్య(నాగశౌర్య) చిన్నప్పటి నుంచి ప్రత్యేకంగా కనిపించాలని తాపత్రయపడే కుర్రాడు ఉంటాడు. అందుకే అతన్ని అందరూ షో గాడూ షో అని పిలుస్తుంటారు. దాన్ని ఓ బిరుదులా భావిస్తూ.. స్నేహితులతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. అతనికి సొంత ఊరంటే పిచ్చి. బతికినా, చచ్చినా అక్కడే అని ఫిక్స్ అవుతాడు. పైగా లోకల్ ఎమ్మెల్యేతో మంచి రాపో కూడా ఉంటుంది. బీ ఫార్మసీ చదివినా పెద్దగా నాలెడ్జ్ ఉండదు. ఆ ఊరిలో రంగబలి సెంటర్ పక్కనే శౌర్య తండ్రి మెడికల్ షాప్ నిర్వహిస్తుంటాడు. ఎప్పుడు చూసినా స్నేహితులతో రౌడీ వేషాలేసే శౌర్యను వైజాగ్ పంపించి మెడిసిన్ లో పట్టుతెచ్చుకోమని చెబుతాడు. అక్కడ కాలేజ్ లో సహజ(యుక్తి తరేజా) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడి ఆమె దగ్గరే మెడికల్ షాప్ నాలెడ్జ్ తెలుసుకుంటాడు. వీరి ప్రేమ గురించి సహజ తండ్రికి తెలుస్తుంది. అతను ఒప్పుకుంటాడు. కానీ ఆ ఊరు వదిలి రావాలంటాడు. అందుకు కారణం.. ఆ ఊరిలో ఉన్న రంగబలి అనే సెంటరే అంటాడు. ఊరు వదిలి రావడం ఇష్టం శౌర్య.. ఆ సెంటర్ పేరు మారుస్తా అంటాడు. మరి ఆ సెంటర్ కు ఉన్న ప్రత్యేకత ఏంటీ..? రంగబలి అనే పేరు ఆ సెంటర్ కు ఎలా వచ్చింది..? దీనికి సహజ తండ్రికి సంబంధం ఏంటీ..? ఆ పేరు మార్చడానికి శౌర్య ఏం చేశాడు అనేది మిగతా కథ.

విశ్లేషణ :
ట్రైలర్ చూపించినట్టుగానే రంగబలి ఫస్ట్ హాఫ్‌ హిలేరియస్ గా స్టార్ట్ అవుతుంది. ప్రతి సీన్ నేచులర్ గా ఉంటూనే సినిమాటిక్ లిబర్టీస్ తో నవ్వించే ప్రయత్నంలో సక్సెస్ అవుతూ ఉంటుంది. శౌర్య ఫ్రెండ్స్ అయిన సత్య, రాజ్ కుమార్ చేసే కామెడీకి పడిపడి నవ్వుకుంటారు. అలాగే అతని తండ్రి పాత్ర చేసిన గోపరాజు రమణ ఫస్ట్ హాఫ్‌ లో అదరగొట్టాడు. ఉన్న ఊరు నుంచి శౌర్య వైజాగ్ కు షిఫ్ట్ అయిన తర్వాత లవ్ స్టోరీ కూడా ఊహించేదే. కానీ సత్యతో ఆ కాలేజ్ లో చేయించిన కామెడీ సినిమాకే హైలెట్. కాస్త అడల్ట్ డైలాగ్స్ పడ్డా.. అవన్నీ బూతులా కాక నేచురల్ గానే ఉండటంతో వల్గర్ గా అనిపించవు. లవ్ స్టోరీలో హీరోయిన్ ఫాదర్ వైపు నుంచి అబ్జెక్షన్ వచ్చిన తర్వాత తిరిగి ఊరికి వచ్చిన శౌర్య.. స్నేహితుడి మాటలు నమ్మి రంగబలి సెంటర్ లో బాంబ్ పెడతాడు. అది కాస్తా బూమరాంగ్ అవుతుంది. కానీ ఎమ్మెల్యే అది పెద్ద ఇష్యూ కాకుండా ఆపుతాడు. అలా ఆ సెంటర్ పేరు మార్చేందుకు నానా తంటాలు పడుతున్న అతను అసలు ఆ రంగా అనే వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడి నుంచి సినిమా పూర్తిగా గాడి తప్పింది.. ఆ తర్వాతి ప్రతి సీన్ చిన్న పిల్లాడు కూడా ఎక్స్ పెక్ట్ చేసేలా సాగుతుంది. పోనీ అందులోనూ ఏదైనా కొత్తదనం ఉందా అంటే… రంగారెడ్డి అనే పాత్ర చేసిన శరత్‌ కుమారే ఈ పాత్రను ఇప్పటికే ఓ పది పదిహేను సినిమాల్లో చేసి ఉంటాడు. అతన్ని ఆ సెంటర్ లో చంపేస్తారు. దీంతో అప్పటి వరకూ గుర్రంబొమ్మ సెంటర్ లా ఉన్న పేరు రంగను చంపేశారు కాబట్టి రంగబలి సెంటర్ అవుతుంది. ఆ పేరు తీస్తేనే తన ప్రేమ సక్సెస్ అవుతుంది కాబట్టి.. ఆ ప్రయత్నంలో రంగా గురించి తెలుసుకునేదంతా పాత కంటెంట్. ఎమ్మెల్యే హీరోకు ఝలక్ ఇవ్వడం.. తర్వాత శౌర్య ఎమ్మెల్యేను ఏం చేయలేక పబ్లిక్ లో అందరూ చూస్తుండగా కత్తితో పొడవడం.. ఒక్కసారిగా మీడియా రావడం.. అతను జైల్లో ఓ పేద్ద స్పీచ్ ఇవ్వగానే.. వెంటనే సెంటర్ పేరు మారిపోవడం.. ఇవన్నీ చాలా అంటే చాలా సిల్లీగా సాగే సీన్స్. దర్శకుడు సెకండ్ హాఫ్‌ మొత్తం చాలా ఇమెచ్యూర్ గా కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పాతికేళ్ల క్రితం నాటి హత్య విషయం.. ఆ చనిపోయిన వ్యక్తి విషయం.. ఒక్క స్పీచ్ తో మారిపోయి సెంటర్ పేరు మార్చడం అనే పాయింట్ అర్థ రహితం..


ఇక బాంబ్ పెట్టడం అనేది ఎంత పెద్ద క్రైమ్. దాన్ని ఏదో టపాస్ లు పేల్చినంత సిల్లీ సీన్ గా మార్చాడు. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ తో గొడవ.. ఆమెను ఇగ్నోర్ చేయడం.. ఇవన్నీ ఎప్పుడో ఇరవైయేళ్ల క్రితమే వచ్చిపోయిన సీన్స్. ఇప్పటికీ అవే అంటే ఆడియన్స్ తట్టుకోలేరు కదా..?


ఇక శౌర్య అలియాస్ షో పాత్రలో వైట్ షర్ట్ వేస్టే ఫైట్ కుదిగిపోయే పాత్రలో శౌర్య బాగా నటించాడు. ఈ పాత్ర కోసం హానెస్ట్ గా కష్టపడ్డాడు కూడా. బట్ సెకండ్ హాఫ్ వల్ల అతని కష్టం వృథా అయినా ఆశ్చర్యం లేదు. చాలా రోజుల తర్వాత హీరోయిన్ పాత్రకు ఓ మంచి క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌ లో వచ్చే ఇమాజినేషన్ సాంగ్ తో ఆ పాత్ర ఔన్నత్యాన్ని దిగజార్చాడు దర్శకుడు. బట్ యుక్తి మాత్రం బాగా నటించింది. చాలా సీన్స్ లో తనకు డైలాగ్స్ కంటే ఎక్స్ ప్రెషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అయినా బాగా చేసింది. ఓవరాల్ గా సత్య కామెడీ సినిమాకు హైలెట్. మురళీశర్మ ఓకే. శరత్ కుమార్ గురించి చెప్పడానికి ఏం లేదు. శుభలేఖ సుధాకర్ రొటీన్ రోల్. గోపరాజు రమణ ఫస్ట్ హాఫ్ లో నవ్వించి సెకండ్ హాఫ్‌ లో ఓ ఎమోషనల్ సీన్ తో మెప్పించాడు. మిగతా పాత్రలన్నీ ఓకే.


టెక్నికల్ గా మ్యూజిక్ గొప్పగా ఏం లేదు. ఒక్క పాటా రిజిస్టర్ కాదు. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. ఎడిటింగ్ ఓకే. డైలాగ్స్ బావున్నాయి. సెట్స్, ఆర్ట్ వర్క్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడుగా పవన్ ఫస్ట్ హాఫ్ లో కమాండింగ్ గా ఉన్నా.. సెకండ్ హాఫ్‌ కు వచ్చేసరికి సడెన్ గా డౌన్ ఫాల్ అయ్యాడు. ఎప్పుడైతే శరత్ కుమార్ ఎపిసోడ్ అన్నారో.. అప్పుడే సినిమా ఖతం అని తేలిపోతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ను సడెన్ గా ముగించేశారు. ఇంత అర్థాంతరపు క్లైమాక్స్ ను ఈ మధ్య కాలంలో చూడలేదంటే అతిశయోక్తి కాదు. ఈ దర్శకుడు దర్శకత్వం కంటే మాటల రచయితగా ఎక్కువ ఫేమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్‌
కామెడీ
శౌర్య, యుక్తి తరేజా

మైనస్ పాయింట్స్

సెకండ్ హాఫ్
ఫ్లాస్ బ్యాక్ ఎపిసోడ్
మ్యూజిక్
క్లైమాక్స్

ఫైనల్ గా : ఫస్ట్ హాఫ్ హిలేరియస్.. సెకండ్ హాఫ్ డల్

రేటింగ్ : 2.5/5

            - బాబురావు. కామళ్ల

Related Posts