పిఠాపురం వాస్తవ్యులకు చిరంజీవి విన్నపం

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆమధ్య జనసేన కోసం రూ.5 కోట్లు విరాళాన్నందించారు చిరంజీవి. తాజాగా.. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా పోటీచేస్తున్న పిఠాపురం నియోజకవర్గం వాస్తవ్యులకు తన విన్నపంగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

పవన్ కల్యాణ్‌ తన తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని.. తన సొంత సంపాదనను కౌలు రైతులకు ఖర్చు పెట్టాడని.. సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడు కానీ.. రాజకీయాల్లోకి ఇష్టంతోనే వచ్చాడని చిరంజీవి తన వీడియో సందేశంలో తెలిపారు.

ఏ తల్లికైనా తన కుమారుడు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుందని, ఏ అన్నకైనా తన తమ్ముడు అవస్థలు పడుతుంటే బాధేస్తుందని చిరంజీవి అన్నారు. పవన్ కల్యాణ్​ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎందాక అయినా పోరాడతాడని.. తన జీవితాన్ని రాజకీయాల కోసం అంకితం చేసిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని చిరు అన్నారు.

ప్రజాసేవ చేయాలన్న పవన్ లక్ష్యం ఉన్నతమైనదని.. మీలో ఒకడిగా ఉంటూ.. మీకోసం పోరాడే జనసైనికుడిని పిఠాపురం ప్రజలు గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. పవన్ కల్యాణ్​ మీకు సేవకుడిగా.. సైనికుడిగా.. ఒక అన్నయ్యగా నిలబడతాడని.. పిఠాపురం ప్రజలు పవన్ కల్యాణ్​ని గెలిపించి.. నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేసుకోవాలని చిరంజీవి తన వీడియోలో పిలుపునిచ్చారు.

Related Posts