టాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకున్న బాలీవుడ్

బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది ఫామ్ లోకి వచ్చింది. పోయినేడాది విడుదలైన షారుక్ ఖాన్ చిత్రాలు ‘పఠాన్, జవాన్‘ ఘన విజయాలు సాధించాయి. ఇంకా.. ‘యానిమల్, గద్దర్ 2‘ వంటివి కూడా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో ఉన్నాయి. అయితే.. ఈ ఏడాది పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘ఫైటర్, బడే మియా చోటే మియా, మైదాన్‘ వంటి సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ‘మైదాన్‘కి మంచి రివ్యూస్ వచ్చినా.. అవి కలెక్షన్ల రూపంలో తర్జుమా కాలేదు.

దీంతో.. బాలీవుడ్ మళ్లీ సౌత్ కంటెంట్ నే నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా.. తెలుగు నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి‘, అల్లు అర్జున్ ‘పుష్ప 2‘ సినిమాలపై ఎంతో ఆసక్తిని కనబరుస్తోంది హిందీ చిత్ర పరిశ్రమ. ప్రభాస్, అల్లు అర్జున్ లకు.. నార్త్ లో మంచి పాపులారిటీ ఉంది.

‘బాహుబలి, సాహో, సలార్‘ వంటి విజయాల తర్వాత ప్రభాస్ ‘కల్కి‘తో నార్త్ ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు. ఇక.. సూపర్ డూపర్ హిట్ ‘పుష్ప‘ ఫ్రాంచైజ్ లో వస్తోన్న రెండో చిత్రం ‘పుష్ప 2‘. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో ‘పుష్ప 2‘పై ఉత్తరాదిన కూడా మంచి బజ్ ఏర్పడింది. మొత్తంమీద.. జూన్ 27న రాబోతున్న ‘కల్కి‘, ఆగస్టు 15న విడుదలవుతోన్న ‘పుష్ప 2‘ చిత్రాలు.. పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.

Related Posts