క్రిస్మస్ బరిలో ముక్కోణపు పోరు

బాక్సాఫీస్ వద్ద దసరా సందడి దాదాపు ముగిసినట్టే. ఈ దసరా కానుకగా విడుదలైన చిత్రాలలో ‘భగవంత్ కేసరి’ మినహా మరే చిత్రమూ అంతగా ప్రభావం చూపించలేకపోయింది. మూడు రోజులకే 70 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిన ‘భగవంత్ కేసరి’.. సోమవారం వరకూ 100 కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

దసరా సీజన్ తర్వాత సినీ లవర్స్ అందరి ఫోకస్ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ పైనే ఉంది. క్రిస్మస్ బరిలో ముచ్చటగా మూడు సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. వీటిలో సౌత్ నుంచి వస్తోన్న ‘సలార్’ ఒకటి కాగా.. బాలీవుడ్ నుంచి ‘డంకి’, హాలీవుడ్ నుంచి ‘ఆక్వామేన్’ సినిమాలు పోటీలో ఉన్నాయి.

అసలు క్రిస్మస్ బరిలోనే లేని ‘సలార్’ ఒక్కసారిగా డిసెంబర్ 22న రాబోతుందని ప్రకటించారు మేకర్స్. దీంతో ప్రభాస్ ‘సలార్’, షారుఖ్ ఖాన్ ‘డంకి’ సినిమాల మధ్య బాక్సాఫీస్ క్లాష్ కన్ఫమ్ అయ్యింది. అయితే.. ‘డంకి’ పోస్ట్ పోన్ అవ్వబోతుందనే వార్తలు వచ్చినా.. లేదు తాము ఎట్టిపరిస్థితుల్లోనూ క్రిస్మస్ కే వచ్చేస్తాం అంటూ మరోసారి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. అయితే.. ఈసారి డిసెంబర్ 22 కంటే ముందే డిసెంబర్ 21న ‘డంకి’ని తీసుకొస్తున్నట్టు ప్రకటించారు.

‘సలార్, డంకి’ సినిమాల కోసమే థియేటర్లను సర్దలేని పరిస్థితి ఉంటే.. హాలీవుడ్ నుంచి డిసెంబర్ 21నే రిలీజ్ కు రెడీ అవుతోంది ‘ఆక్వామేన్ అండ్ ది లాస్ట్ కింగ్ డమ్’. సూపర్ హిట్ మూవీ ‘ఆక్వామేన్’కి సీక్వెల్ గా ఈ డి.సి. సూపర్ హీరో మూవీ వస్తోంది. హాలీవుడ్ సూపర్ హీరోస్ మూవీస్ కి ఇండియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక్కడ స్ట్రెయిట్ మూవీస్ కి దీటుగా హాలీవుడ్ మూవీస్ వందల కోట్లు కొల్లగొడుతుంటాయి. మొత్తంమీద.. ఈ ఏడాది క్రిస్మస్ సీజన్ ఏ రీతిన సాగుతుందో చూడాలి.

Related Posts