Unstoppable review : అన్ స్టాపబుల్ బోరింగ్

డైమండ్ రత్నబాబు.. మాటల రచయితగా తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత దర్శకుడుగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ క్రమంల ప్రతి సినిమాతోనూ ప్రేక్షకుల సహనానికీ పరీక్ష పెడుతున్నాడు. బుర్రకథ, సన్ ఆఫ్ ఇండియా.. ఇంతకు ముందు దర్శకుడుగా అతన్నుంచి వచ్చిన సినిమాలు. ఈ రెండు ఉదాహరణలుచాలు. దర్శకుడుగా అతనెంత తోపో తెలియడానికి. మినిమం నాలెడ్జ్ లేని కథ, కథనాలతో వచ్చిన చిత్రాలు ఇవి.

ఇక ఇప్పుడు మరోసారి ”అన్ స్టాపబుల్” అంటూ వచ్చాడు. బిగ్ బాస్ విన్నర్ సన్నీ విజే, సప్తగిరి, నక్షత్ర, అక్సా ఖాన్, పోసాని, పృథ్వీరాజ్, షకలక శంకర్, ఛమ్మక్ చంద్ర, బిత్తిరి సత్తి, రాజా రవీంద్ర అబ్బో.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్టిస్టుల లిస్ట్ చాంతాడంత ఉంది. ఇంతమంది కమెడియన్స్ ఉన్నారు అని ఆ మధ్య ట్రైలర్ రిలీజ్ కు బ్రహ్మానందం కూడా వచ్చాడు. కానీ సినిమాలో గుంపులు గుంపులుగా మనుషులు కాదు ఉండాల్సింది. ఆ గుంపులకు తగ్గ కథనం. ఆ పాత్రలకు కొంత స్పేస్. ఈ విషయంలో దర్శకుడు ఏ మాత్రం వర్కవుట్ చేయలేదని మాత్రం చెప్పొచ్చు.


ఓ బేవార్స్ కుర్రాడు(సన్ని). అతని లాంటి మరో స్నేహితుడు(సప్తగిరి) స్నేహితురాలు( అక్సాఖాన్). ఈ ముగ్గురూ కలిసి ఆవారాగా తిరుగుతుంటారు. క్రికెట్ బెట్టింగ్ కోసం సప్తగిరి ఇంట్లో నుంచి అతని చెల్లి పెళ్లికి దాచిన పదిలక్షలు తెచ్చి పోగొట్టుకుంటారు. ఆ డబ్బు సంపాదించేందుకు స్నేహితుడిని సాయం అడుగుతారు. అతను మద్యం మత్తులో 20 లక్షలు వేస్తాడు. కానీ అది వేరే అకౌంట్ కు వెళుతుంది. అతన్ని వెదుక్కుంటూ వెళితే.. అతనో పెద్ద డాన్ అని తెలుస్తుంది. వీరి గురించి తెలిసి డెన్ లో బంధిస్తారు. ఈ బంధనంలో వీరికి ముందే హీరోయిన్ కూడా ఉంటుంది. మొత్తం నలుగురూ అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ డాన్ లో ఉన్న 20 కోట్ల కొకైన్ తో పాటు 500 కోట్ల హవాలా డబ్బుకు సంబంధించిన నోట్ ను ఎత్తుకుని వస్తారు. వీరిని వెదుకుతూ దుబాయ్ నుంచి డాన్ దిగుతాడు. చివర్లో ఆ డాన్ వల్ల మేం ఇబ్బంది పడ్డా అంటూ చిన్న ఉపదేశం.


ఇదీ కథ. నిజానికి ఇలాంటి కథలు 90ల్లోనే ఇవివి సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి వాళ్లు వాడేశారు. ఆ తర్వాత కూడా ఇ సత్తిబాబు, జి నాగేశ్వర్ రెడ్డి లాంటి దర్శకులు.. ఇంక చాలు బాబోయ్ అని ప్రేక్షకులు మొత్తుకునేంత వరకూ రుద్ది పడేశారు. ఆ కథ, కథనాన్నే మరోసారి జనం నెత్తిన రుద్దే ప్రయత్నం చేశాడు ఈ డైమండ్ రత్నబాబు. కానీ ఇది ఏ మాత్రం ఆకట్టుకోకపోగా.. చక్కిలిగింతలు పెట్టుకున్నా నవ్వుకంటే చిరాకు ఎక్కువ వచ్చేలా ఉంది. అసలు ప్రేక్షకులను అత్యంత చులకనగా చూస్తే తప్ప ఇలాంటి సినిమాలు తీసే సాహసం చేయరు ఎవరు..? ఓ వైపు ఓటిటిల కాలంలో కొత్త కొత్త కథలు, సిరీస్ లు చూస్తోంటే ఇతను మాత్రం కాల చక్రంలో వెనక్కి వెళ్లి 25 యేళ్ల క్రితం లాంటి కథతో వచ్చాడు. అందుకే మినిమం ఓపెనింగ్స్ రాలేదు. వచ్చిన జనం టాక్ చూస్తే ఇంక వస్తాయన్న నమ్మకమూ లేదు. ఏదేమైనా ఇదంతా అన్ స్టాపబుల్ రొటీన్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు.

Related Posts