ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రివ్యూ

రివ్యూ : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
తారాగణం : సుధీర్ బాబు, కృతిశెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, అవసరాల శ్రీనివాస్
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ : పి.జి విందా
నిర్మాతలు : మహేంద్ర బాబు, కిరణ్‌ బొల్లపల్లి
దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ

దర్శకుడుగా ఇంద్రగంటి మోహనకృష్ణకు ఓ స్టైల్ ఉంది. సెన్సిబుల్ మూవీస్ తోనే ఎక్కువగా ఎంటర్టైన్ చేయాలని చూస్తాడు.హెవీ డోస్ కనిపించదు. కొన్నిసార్లు చిన్న పాయింట్ చుట్టూనే కథనం నడిపేస్తాడు. అయినా ఆకట్టుకుంటాడు.అతని రీసెంట్ మూవీ వి ఓటిటిలోనే ఫ్లాప్ అనిపించుకుంది. ఇక తన సమ్మోహనం హీరో వి తర్వాత మళ్లీ ఆ సినిమా గుర్తొచ్చేలా ఈసారి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటూ వచ్చాడు. మరి ఆ అమ్మాయి ఎవరు.. ఆమె గురించి ఏం చెప్పారు అనేది చూద్దాం..

కథ :
నవీన్(సుధీర్ బాబు) బ్లాక్ బస్టర్ డైరెక్టర్. వరుసగా డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో జోష్ లో ఉంటాడు. అయితే అవన్నీ రొటీన్ రొడ్డకొట్టుడు కమర్షియల్ సినిమాలే. అయినా తను అలాంటివే తీస్తూ సక్సెస్ కొట్టాలనుకుంటాడు. అలేఖ్య(కృతిశెట్టి) డాక్టర్. తనకూ తన ఫ్యామిలీకి సినిమా అన్నా.. సినిమా వాళ్లన్నా ఓ రకమైన అసహ్యం. అలాంటి అలేఖ్య నటించిన ఓ ఫిల్మ్ రీల్ బాక్స్ నవీన్ కు దొరుకుతుంది. అప్పటి వరకూ కమర్షియల్ సినిమాలు తీసిన అతను ఈ అమ్మాయితో ఓ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా తీయాలనుకుంటాడు. పైగా ఆ అమ్మాయినే హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటాడు. మరి సినిమాలంటే ఇష్టం లేని తను నవీన్ డైరెక్షన్ లోనటించేందుకు ఒప్పుకుంటుందా.. అసలు తను ఆ వీడియో ఎలా చేసింది. అంతకు ముందు తనకు సినిమా బ్యాక్ డ్రాప్ ఏదైనా ఉందా..? నవీన్, అలేఖ్య మధ్య రిలేషన్ ఎంత వరకూ వెళ్లింది అనేది మిగతా కథ.

విశ్లేషణ :
కొన్ని కథలను ముందే ఊహించేయొచ్చు. అయినా ఊహలను దాటుకుని కాస్త వినోదం పంచే అవకాశం దర్శకులకు ఉంటుంది. ఆ అవకాశాన్ని ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాలో బానే వాడుకున్నాడు. కానీ ప్రధాన కథ విషయంలోనే పక్కాగా వర్క్ చేయలేదు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తరహా కథలకు ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎలాగూ సినిమాలోనే సినిమా గురించి చెబుతున్నాడు కాబట్టి.. కొంత స్వేచ్ఛ తీసుకోవచ్చు. కానీ దాన్ని లైటర్ వే లో మాత్రమే ప్రెజెంట్ చేసినా హుందాగా తనదైన కామెంట్ చేశాడు. ఒక డైరెక్టర్, డాక్టర్ కు మధ్య కథ నడుస్తున్నప్పుడు అది కేవలం “సినిమా కోసం” అనే కోణంలో మాత్రమే కాక.. వారి మధ్య బలమైన ఎమోషన్ లేదా ప్రేమకథ లాంటిది బిల్డ్ చేసి ఉంటే ఈ రిలేషన్ ఆడియన్స్ కు రిలేట్ అయ్యి ఉండేది. అలా చేయకపోవడంతో ఎవరిక గోల వారిదే అన్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా అలేఖ్య పేరెంట్స్ కేవలం తమది “సంప్రదాయ”కుటుంబం అన్న కోణంలో మాత్రమే సినిమాను అసహ్యించుకోవడం.. అది డైలీ సీరియల్ ను మించిన ఓవరాక్షన్ తో ప్రదర్శించడం అస్సలు బాలేదు. ఆ ఒక్క పాయింట్ చుట్టే ప్రధాన సంఘర్షణ ఉన్నప్పుడు వారి వాదనలో కొంత ప్రాక్టికాలిటీ ఉంటే బావుండేది అనిపిస్తుంది.
హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీకి ఆస్కారం లేని కథ ఇది. హీరోది కేవలం ఒన్ సైడ్ లవ్. ఆ విషయం ఆమె వీడియోను పదే పదే చూసిన అతని భావనలో కనిపిస్తుంది. అంటే సినిమా పేరుతో తనను ఎలాగైనా ప్రేమలోకి దించాలన్న మరో ఆలోచన కూడా కనిపిస్తుందీ పాత్రలో. ఎప్పుడైతే ఇంటర్వెల్ లో కొత్త విషయం తెలిసిందో తర్వాత ఆ విషయానికి తన కెరీర్ ఆరంభాన్ని జోడించి.. ఈ కథ తను ఖచ్చితంగా చెప్పాల్సిందే అన్న నిర్ణయం తీసుకుంటాడో.. అప్పుడైనా కథలో వేగం పెరుగుతుందీ అనుకుంటాం. కానీ స్లో నెరేషన్ తో పాటు బలమైన కథ లేకపోవడం సినిమాకు మైనస్ గా మారుతుంది. బట్ వెన్నెల కిశోర్ కనిపించిన ప్రతిసారీ వినిపించే డైలాగ్స్ (చాలామంది వీటిపై కాన్ సెంట్రేట్ చేయలేదు) నవ్విస్తాయి.
నిజానికి ఇది సినిమా పరిశ్రమలో ఔత్సాహి యువతకు సంబంధించిన కథ. ఏదైనా సాధించలేకపోతే చావు పరిష్కారం కాదు అని ఇన్ డైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం ఈ సినిమాలో తీసిన మరో సినిమా చెప్పే ప్రయత్నం చేస్తుంది. అలాగే పిల్లల ఇష్టాలను దాటి ప్రవర్తించే సంప్రదాయం ఏ మాత్రం మంచిది కాదు అన్న సెటైర్ ఉంది. అలాగే సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ మాత్రమే కాదు.. అవకాశాల కోసం “అన్నిటికీ” తెగించే అమ్మాయిలూ ఉంటారన్న విషయమూ ఉంది. వీటిని దాటి గొప్ప నిర్మాతలూ ఉన్నారనే సందేశమూ కనిపిస్తుంది. ఎటొచ్చీ.. ఇవన్నీ సినిమాటిక్ ఆర్డర్ లో కాక సిల్లీ ఆర్డర్ లో కనిపించడంతోనే ఆడియన్స్ కు కావాల్సినట్టుగా కనెక్ట్ కావు.
ఇంటర్వెల్ ట్విస్ట్ నిజంగానే బావుంది. బట్ ఆ తర్వాత కథంతా ఊహించేదే. సెకండ్ హాఫ్ లో ఒకే పాటలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమను బాగా ఎలివేట్ చేశాడు దర్శకుడు. హీరో ఫేస్ లో చిన్న మార్పును కూడా గమనించడం అంటే ఆ అమ్మాయి అతన్ని ఎంత ఇష్టపడిందో చెప్పడమే. అలాగే హీరోయిన్ కోపంతో ఓనిర్మాత వద్దకు వెళ్లిన వెంటనే హీరో వెళ్లడం.. ఆమె కోసం అతను తీసుకునే జాగ్రత్తే. ఇది ఇంద్రగంటి శైలిలో కనిపించే కథనం. రెగ్యులర్ లవ్ ట్రాక్స్ లా ఇది కనిపించదు. కానీ సమ్మోహనం రేంజ్ లో ఎఫెక్టివ్ గా లేకపోవడంతో అసలు ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీయే లేదా అనే డౌట్ ఎక్కువగా వస్తుంది. బట్.. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత వీరి మధ్య మంచి కెమిస్ట్రీనే పండించాడు దర్శకుడు.
ఓవరాల్ గా ఆ అమ్మాయి గురించి చెప్పిన ఈ కథలో డెప్త్ లేదు. కథనంలో వేగం లేదు. సన్నివేశాల్లో బలం లేదు. ఓవరాల్ గా ఓ ఐదారు సీన్స్ మాత్రం చాలా చాలా బావున్నాయి అనిపిస్తుంది. కానీ విజయానికి అవి చాలవు కదా..?
విశేషం ఏంటంటే.. మెలో డ్రామా అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పే ఇంద్రగంటి .. శ్రీకాంత్ అయ్యంగార్, కళావతి ప్రియదర్శిని పాత్రలతో అంత ఓవరాక్షన్ చేయించడం ఆశ్చర్యమే.
టెక్నికల్ గా వివేక్ సాగర్ పెద్ద మైనస్. పాటలు బాలేదు. నేపథ్య సంగీతం నీరసంగా ఉంది. పిజి విందా సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ పరంగా ఓ పది నిమిషాల వరకూ తీసేసినా నష్టం లేదు. కాస్ట్యూమ్స్ బావున్నాయి. ఆర్ట్ వర్క్ తో పాటు ఇతర టెక్నికల్ ఎసెట్స్ బావున్నాయి. నిర్మాణ విలువలు రిచ్ గా కనిపిస్తాయి. ఎటొచ్చీ.. దర్శకుడుగా ఇంద్రగంటి స్టైల్ మిస్ అయింది. రైటింగ్ మిస్ అయింది. అతని తరహా హ్యూమర్ కనిపించలేదు.

ఫైనల్ గా : ఈ అమ్మాయి నీరసంగా ఉంది

రేటింగ్ : 2.5/5

                                    - యశ్వంత్ బాబు..

Related Posts