చైత్రమాసపు కోయిల గానం.. చిత్ర బర్త్ డే స్పెషల్

పాటతో నటించడం.. పాటలో విహరించడం.. పాటతో వివశులను చేయడం.. పాటతో మంత్రం వేయడం.. చిత్రకు తెలిసినట్టు ఇంకెవరికీ తెలియదేమో అనిపిస్తుంది. పాటలో నవరసాల్నీ పోషిస్తూ.. భావాలకు అనుగుణంగా గాత్రాన్ని సవరించుకుని వినే వారి మదిలో వలపు రాగాలు జీవం పోసుకునేలా చేయడం చిత్ర గాత్రానికే ఉన్న ప్రత్యేకత. ఆ గాత్రంలో జాలువారిన ప్రతిపదం అమృతత్వాన్ని సంతరించుకుంటుంది. తెలుగు మాతృభాష కాకపోయినా.. గన గాత్రంలో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తోన్న చిత్ర పుట్టిన రోజు ఇవాళ..


ఎన్నో పాటలు.. ప్రతి పాటకూ ఓ నేపథ్యం.. ప్రతి పాటకో అనుభవం.. కొన్ని పలకరించి వెళ్లిపోతే కొన్ని పులకరింపచేస్తాయి.. ఆ పలకరింతల్నీ, ఈ పులకరింతల్నీ.. మనం అనుభూతి చెందేలా చేసి, తన గాత్రంతో మరోలోకానికి తీసుకువెళ్లే ప్రతిభావంతురాలు చిత్ర.


కొందరి పాటలు వింటే.. ఆ పాట మధురంలో ఓలలాడిపోతాం.. ఆ క్షణంలో మనం ఏంచేస్తున్నామో కూడా గుర్తు లేనంతగా ఆ గాత్రంతో మమేకమైపోతాం. అలాంటి పాటలు చిత్రగాత్రంలో ఎన్ని విని ఉంటాం.. అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అని ఆమె పాడుతోంటే.. సన్నివేశంలో నటించేవారినే కాదు ఆ ఫీలింగ్ మనల్నీ వెంటాడుతుంది.


తొలిపొద్దు పొడిచేవేళ గోరువెచ్చని నీరెండలో నించుంటే ఎంత హాయిగా ఉంటుందో చిత్ర పాడిన కొన్ని పాటలు వింటే అదే ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీలింగ్ ఆ ఉదయాన్ని మనకు నవోదయంగా చూపిస్తుంది. కావాలంటే కోకిల చిత్రంలో చిత్ర పాడిన ఈ పాట చూడండి మీకూ అర్థమౌతుంది..
చేస్తున్న పనిపై సాధికారత ఉంటే ఆ ఫలితం మనకు మరో లోకాన్ని చూపిస్తుంది. అలా చూడటం.. చూపించడం.. చిత్ర గాత్రానికున్న అరుదైన ప్రత్యేకత. ఇన్సిస్పిరేషనల్ సాంగ్ అయినా టీజింగ్ గీతమైనా.. ఆ గొంతులో పలికితే అది అజరామరమవుతుంది..


కవి భావాన్ని .. సంగీత దర్శకుడి స్వరాన్ని.. మేళవించి.. పాటగా చెప్పడం గాయకుల పని. అయితే అందులోని మాధుర్యాన్నీ, మృదుత్వాన్నీ పలికించే బాధ్యత మాత్రం గాయకులదే. అందులో ఏ తేడా వచ్చినా అర్థమే మారిపోతుంది. కానీ కవి ఫీలింగ్ ను, మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లే అతికొద్దిమంది గాయనీమణుల్లో చిత్ర పేరు ఖచ్చితంగా ఉంటుంది. అందుకు ఉదాహరణే ఈ పాట..
ఒక పాట ఆకృతి దాల్చాలంటే ఎంతో మంది ఎన్నో విధాలుగా కష్టపడతారు. సాహిత్యంతో కవి, స్వరంతో సంగీత దర్శకుడు, వాయిద్యాలతో కళాకారులు, రికార్డింగ్ ఇంజినీర్స్ … ఇలా ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రాణం పెడితే కానీ ఓ పాట ఊపిరిపోసుకోదు. కానీ ఆ రూపానికి ప్రాణం పోసేది మాత్రం గాయకులే. అలాంటి పాటతో హృదయాల్ని ద్రవింప చేయడం.. గుండెల్ని పిండేయడం అంటే ఎలా ఉంటుందో చిత్ర పాడిన ఈ పాట చూస్తే పాటకు ప్రాణం ఉండటం అంటే ఏంటో అర్థమౌతుంది.


బీట్ ను బట్టే పాట. అందుకు తగ్గట్టుగా బ్రీత్ ను తీసుకుంటూ ఆ బీట్ ను ఉరకలెత్తించాలా.. ఊహల్లో విహరించేలా చేయాలా అనేదే సింగర్స్ కు పెద్ద టాస్క్. అయితే బీట్ వెంట పరుగులు పెడుతూ తన గాత్రంతో మనసుల్ని ఉరకలెత్తించడం చిత్రకు తెలుసు.. కాదు చిత్రకే తెలుసేమో..
వయసులో ఉన్న కన్నెపిల్ల మనసు ఓ చోట కుదురుగా ఉండదు. ఇక కోరుకున్న కుర్రాడు కళ్లెదురుగానే ఉంటే.. చెప్పనేలేం.. ఆ సమయంలో వారి మాటైనా పాటైనా .. తడబడుతుంది.. లేదంటే తమకమైపోతుంది. మరి ఈ ఫీలింగ్ ను పాటలో పలికించడం కాదు.. గాత్రంతో నటించాలి.. ఇందులో చిత్రకు మించిన నటస్వరం ఏముంటుందీ.. డ్యూయొట్టూ.. స్టేజ్ సాంగ్ కాకుండా కొన్ని పాటలుంటాయి.

సన్నివేశంతో పాటే పాటా సాగుతుంది. ఒక్కోసారి పాటను సీన్ డామినేట్ చేస్తుంది. అప్పుడు సన్నివేశాన్ని చూడటానికే ప్రేక్షకులు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఆ స్వరం అపస్వరం పలుకుతున్నట్టే. కానీ ఓ మంచి సంగీత దర్శకుడి స్వరకల్పనను తన గాత్రంతో పాటనే కాదు.. సన్నివేశాల్నీ ఉరకలెత్తిస్తూ పాడేసింది చిత్ర. మనసంతా నువ్వే సినిమాలో ఈ చిత్ర పాట చూస్తే సీనా, సాంగా అంటే సాంగే బెస్ట్ అని సింగుతూ చెప్పేస్తారు.. కదా..?


చిత్ర సినిమా పరిశ్రమలోకి వచ్చి మూడుదశాబ్ధాలు దాటింది. కానీ అప్పుడు తన గాత్రం ఎంత మధురంగా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. అందుకే అప్పటి యువ నటీ మణులకు.. ఎంత పర్ఫెక్ట్ గా సూట్ అయిందో.. ఇప్పటి యంగ్ హీరోయిన్స్ కూ అంతే పర్ఫెక్ట్ గా సూట్ అవుతోందామె గాత్రం..


ఎంతో మంది గాయనీమణులు వస్తోన్నా.. ఇప్పటికీ చిత్ర కోసం కొన్ని పాటలు ఎందుకు ఎదురుచూస్తాయి. చిత్ర పాడితేనే కొన్ని పాటలకు నిండుదనం ఎందుకు వస్తుంది.. చిత్ర కోసమే ఆ పాటలు ఎందుకు రూపుదాల్చుకుంటాయి అంటే సమాధానం చెప్పలేం కానీ, ఆమె పాడితే మాత్రం కొన్ని పాటలు అజరామరమవుతాయి.. ఆమె పాడితే అదో శాసనంగా అనిపిస్తుంది.. ఆమె పాడితేనే అవి పరిపూర్ణతను సంతరించుకుంటాయి. అలాంటి చిత్రమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

                                    - బాబురావు. కామళ్ల

Related Posts