నటీనటులు: విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ, మహమ్మద్ సమద్, హారిక పెడదా, శాంతి రావు, మయాంక్ పరాక్ తదితరులు
సినిమాటోగ్రఫి: విశ్వనాథ్ రెడ్డి సి.హెచ్
సంగీతం: నరేష్
ఎడిటింగ్: రాఘవేంద్ర తిరున్
నిర్మాత: కార్తీక్ శబరీష్
దర్శకత్వం: విద్యాధర్ కాగిత
విడుదల తేదీ: 08-03-2024
మహాశివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో ‘గామి‘ ఒకటి. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం రూపొందింది. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ శబరీష్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి యు.వి.క్రియేషన్స్ సమర్పకులుగా వ్యవహరించింది. ప్రచార చిత్రాలతో ఓ విభిన్న కథా చిత్రంగా ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పరచుకున్న ‘గామి‘ ఎలా ఉంది? ఆడియన్స్ అంచాలను అందుకోవడంలో సఫలమైందా? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
మానవ స్పర్శని తట్టుకోలేని విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటాడు అఘోర శంకర్ (విశ్వక్ సేన్). అతను హరిద్వార్‌లో ఓ అఘోరా ఆశ్రమంలో ఉంటాడు. అయితే.. శంకర్ సమస్య వల్ల తమకు ఇబ్బందిగా మారడంతో ఆశ్రమం నుంచి అఘోరాలు అతణ్ని వెళ్లగొడతారు. తనకి ఉన్న ఈ లోపం కారణంగా శంకర్ ఈ ప్రపంచంలో ఇమడ లేకపోతాడు. ఈ క్రమంలో తన లోపాన్ని నయం చేసే మాలిపత్రాలు హిమాలయాల్లో ప్రతి 36ఏళ్ళకి ఒకసారి మాత్రమే దొరుకుతాయని తెలుసుకుంటాడు. అక్కడకు ప్రయాణమైన శంకర్ కి డాక్టర్ జాహ్నవి (చాందిని చౌదరి) తోడవుతుంది. ఈ కథ ఇలా సాగుతుంటే.. మరోవైపు దుర్గ (అభినయ), ఉమ (హారిక పెద్ద), సీటీ-333(మహమ్మద్ సమాద్) అతని ఆలోచనల్లో కనిపిస్తుంటారు. వాళ్లు ఎవరు? శంకర్ గతం ఏంటి? అతను తన గమ్యాన్ని చేరుకున్నాడా? అనేవి తెలియాలంటే ‘గామి‘ చిత్రం చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇప్పటివరకూ యూత్ ఫుల్ సబ్జెక్ట్స్ ఎక్కువ చేసిన విశ్వక్ సేన్ ఇలాంటి ఓ ప్రయోగాత్మక సినిమా చేశాడంటేనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తక్కువ బడ్జెట్ లో క్రౌడ్ ఫండింగ్ తో ఇంత పెద్ద కాన్వాస్ మూవీ చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఏళ్ల తరబడి ఆ ప్రయత్నాన్ని వెండితెరపైకి తీసుకొచ్చిన దర్శకుడు విద్యాధర్ కాగిత ను మెచ్చుకోవాలి. హాలీవుడ్ తరహా విజువల్స్ తో ఈ సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా మలిచిన తీరు ఆకట్టుకుంటుంది.
ఎవరైనా ముట్టుకుంటే తట్టుకోలేని విచిత్రమైన బాధతో బాధపడే అఘోరా అనే విభిన్నమైన కాన్సెప్ట్ తో సినిమా అంటేనే ఓ కొత్తదనం ఉంది. దానికి తోడు విశ్వక్ ట్రాక్ కి సమాంతరంగా ఇండో-చైనీస్ బోర్డర్‌లో ఓ రీసెర్చ్ ల్యాబ్‌లో ఉండే అబ్బాయి.. దక్షిణ భారతదేశంలో దేవదాసి అనే ఊరిలో ఉమ అనే అమ్మాయి కథ సమాంతరంగా చూపిస్తుంటారు. దీంతో విశ్వక్ సేన్ కథకి.. ఆ రెండు కథలకు సంబంధం ఏంటా? అనే క్యూరియాసిటీని కలగజేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఈ క్రమంలో కొన్ని చోట్ల కథనం స్లోగా సాగుతోంది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు:
అఘోర పాత్రలో విశ్వక్ సేన్ నటన అద్భుతంగా అనిపిస్తుంది. అతను శంకర్ పాత్రలో నటించలేదు.. జీవించాడని చెప్పొచ్చు. ఈ సినిమాతో పాత్ర ఏదైనా సరే.. తనను సరిగా ఉపయోగించుకోవాలి కానీ ఆ రోల్ లో అదరగొడతాను అని విశ్వక్ సేన్ నిరూపించుకున్నాడు. చాందిని చౌదరి చిన్న పాత్రే అయినా.. విశ్వక్ కి డీసెంట్ సపోర్టింగ్ రోల్ లో కనువిందు చేస్తుంది. సీటీ-333 పాత్ర చేసి మహమ్మద్ సమాద్, దుర్గ పాత్ర చేసిన హారిక అనే చైల్డ్ ఆర్టిస్టు వాళ్లకిచ్చిన పాత్రల్లో ఆకట్టుకున్నారు. అభినయ రోల్ కూడా ఇంప్రెస్సివ్ గా ఉంది.
‘గామి’ చిత్రంలోని విజువల్స్ చూస్తుంటే.. అడుగడుగునా ఓ హాలీవుడ్ మూవీ చూస్తున్న భావన కలుగుతుంది. హిమాలయాల్లాంటి లొకేషన్లలో తీసిన సీన్లు మాత్రమే కాదు.. ల్యాబొరేటరీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అత్యున్నత ప్రమాణాలు కనిపిస్తాయి. దర్శకుడు తన విజన్ ను పర్ఫెక్ట్ గా స్క్రీన్ పైకి తీసుకొచ్చాడు. హియాలయాల్లో వచ్చే షాట్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ టాప్ లెవెల్ లో ఉంది. విజువల్స్ ఆద్యంతం వావ్ అనిపించేలా సాగుతాయి. ఇక ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వందల కోట్లు పెట్టే సినిమాల స్థాయిలో కనిపిస్తాయి కొన్ని సన్నివేశాలు.
చివరగా:
‘గామి’ ఓ డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన అనుభూతి కలిగిస్తుంది.