భాగ్ సాలే

రివ్యూ : భాగ్ సాలే
తారాగణం : శ్రీ సింహా, నేహా సోలంకి, జాన్ విజయ్, రాజీవ్ కనకాల, నందిని రాయ్, సత్య, వైవా హర్ష, సుదర్శన్, వర్షిణి తదితరులు
ఎడిటింగ్ : కార్తీక్ శ్రీనివాస్
సంగీతం : కాలభైరవ
సినిమాటోగ్రఫీ : కుషేందర్ రమేష్‌ రెడ్డి
నిర్మాత : అర్జున్ దాస్యం, యశ్ రంగినేని, సింగనమల కళ్యాణ్
దర్శకత్వం : ప్రణీత్ బ్రహ్మాండపల్లి

వారసత్వ కార్డ్ తో ఇండస్ట్రీలోకి హీరోలుగా అడుగుపెడుతన్నవాళ్లు అనేక మంది ఉన్నారు. కానీ కంటెంట్ లోపంతో పెద్దగా రాణించలేక కనుమరుగవుతున్నవాళ్లే ఎక్కువ. ఎమ్ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహా కూడా ఆ కార్డ్ తోనే హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమా మత్తు వదలరా ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత మరే సినిమా కూడా మెప్పించలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడులా ఇప్పుడు భాగ్ సాలే అంటూ వచ్చాడు. మరి ఈ మూవీ ఆడియన్స్ కు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇచ్చిందో చూద్దాం.

కథ :
అర్జున్(శ్రీ సింహా) ఓ స్టార్ హోటెల్ లో చెఫ్‌. కానీ తనో రిచ్ మేన్ అని చెప్పి అత్యంత సంపన్నురాలైన మాయ(నేహా సోలంకి)ని ప్రేమలో పడేస్తాడు. వీరి ప్రేమకు ఆమె తండ్రి కూడా ఒప్పుకుంటాడు. అదే టైమ్ లో ఆమె తండ్రి వద్ద ఉన్న వారసత్వంగా వచ్చిన ఓ ఉంగరం కోసం సామ్యేల్ అనే రౌడీ అతన్ని కిడ్నాప్ చేస్తాడు. కానీ ఆ ఉంగరాన్ని అప్పటికే ఓ సేట్ దగ్గర కుదువ పెడతాడు హీరోయిన్ తండ్రి. ప్రేయసి కోసం మోసం చేసి ఆ ఉంగరాన్ని తెచ్చి కాబోయే మామను విడిపిస్తాడు. కానీ ఆ ఉంగరం వచ్చిన తర్వాత అతని లైఫ్‌ లో అనేక మార్పులు మొదలవుతాయి. లైఫ్ అంతా రచ్చ అవుతుంది. తను రిచ్ కాదు అనే విషయం కూడా తెలుస్తుంది. మరి ఈ ఉంగరం వల్ల అర్జున్ జీవితంలో వచ్చిన తిప్పలు ఎన్ని.. ఆ ఉంగరం వెనక ఉన్న కథేంటీ..? ఆ ఉంగరం కోసం ఆ రౌడీ ఎందుకు అంతలా వెంపర్లాడుతుంటాడు అనేది మిగతా కథ.

విశ్లేషణ :
భాగ్ సాలే.. ఇదో సాధారణ కథ. దీనికి కథనమే ప్రధానం. ఈ విషయంలోనే తడబడ్డాడు దర్శకుడు. ఉంగరం చుట్టూ తిరిగే కథ. హీరోయిన్ తో పాటు విలన్ కూ ముడిపడి ఉన్న ఆ ఉంగరం కోసం హీరో రిస్క్ చేయడం.. తద్వారా అతని కుటుంబం ఇబ్బందుల్లో పడటం.. దీని చుట్టూ అనేక ఉపకథలు ఉండటం అనే పాయింట్ అంతా క్లమ్జీగా మారింది. దీంతో అటు కామెడీ పండటలేదు. ఇటు క్రైమ్ పండలేదు. డార్క్ క్రైమ్ కామెడీ అని వాళ్లు చెప్పుకున్నారు కానీ.. ఈ మూడు అంశాల్లోనూ ఫెయిల్ అందీ చిత్రం. కితకితలు పెట్టుకున్నా నవ్వు రాని సన్నివేశాలు. అత్యంత పేలవంగా.. ఎప్పుడో 90ల నాటి ట్రెండ్ లో సాగే కథనంతో.. నెక్ట్స్ ఏంటనేది ఆడియన్స్ ఊహలకు సులువుగా అందేస్తూ.. సాగుతుంది కథనం. ఇక విలన్స్ గా నటించిన జాన్ విజయ్, వైవా హర్షల అతి అస్సలు భరించలేం. ఉంగరంతో పాటు ఉన్న ఉపకథల్లో ఒక్కటి కూడా ఆకట్టుకోదు.

దీన్నే కామెడీ అనుకోమని చెప్పారు. బట్ అందులో అలాంటి పదార్థం ఏమీ కనిపించదు. హీరోయిన్ కు నిజం తెలిసిన తర్వాత కథ కాస్త చిక్కబడుతుంది అనుకుంటే మళ్లీ అదే రొటీన్ సీన్స్. దీనికి తోడు హీరో తండ్రి(రాజీవ్ కనకాల)తో కలిసి సినిమా నటి( నందిని రాయ్)ని కిడ్నాప్ ఏసే ఎపిసోడ్ చీప్ గా ఉంది. ఆ తర్వాత ఆమె ప్లేస్ లో మరో లేడీ పాత్ర(వర్షిణి)తో విలన్ డెన్ లోకి అడుగుపెట్టడం.. ప్రిడిక్టబుల్ గానే ఉటుంది. హీరోతో పాటు కనిపించే సుదర్శన్, సెకండ్ హాఫ్ సగంలో వచ్చే సత్య పాత్ర ఇవేవీ నవ్వించలేకపోయాయి. దీంతో టైటిల్ కు తగ్గట్టుగా సినిమా అంతా హీరో ఉరుకులు పరుగులు మీద ఉన్నట్టుగానే.. మొదటి అరగంటే ఆడియన్స్ కూడా బయటికి పరుగులు తీసేలా సినిమా తీశాడు దర్శకుడు.


నటన పరంగా శ్రీ సింహా చాలా వరకూ బెటర్ అయ్యాడు. గత సినిమాలతో పోలిస్తే ఇంప్రూవ్ అయినట్టే కనిపిస్తోంది. నేహా సోలంకికి సింగిల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. అంత వరకూ చేసింది. సుదర్శన్ కామెడీ పేలలేదు. జాన్ విజయ్ విలనీ, అతని అసిస్టెంట్ గా వైవా హర్షల పాత్రలు రొటీన్. నందిని రాయ్ వ్యాంప్ తరహా పాత్రతో పాటు ఓ పాటలో ఓకే అనిపించింది. సత్య కామెడీ ట్రాక్ నిడివి చాలా తక్కువ. కొంచెం బెటర్ అనిపిస్తుంది. అతని భార్య పాత్రలో వర్షిణి, రాజీవ్ కనకాల పాత్రలు రొటీన్ గానే కనిపిస్తాయి.

టెక్నికల్ గా కాలభైరవ సంగీతం అస్సలు బాలేదు. రీ రికార్డింగ్ ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. ఈ తరహా డార్క్ కామెడీ సినిమాలకు ఒక సిగ్నేచరల్ సౌండింగ్ ఉంటే బావుంటుంది. ఇందులో మిస్ అయింది. పాటలు కూడా బాలేదు. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ ఓకే. మాటలు పేలలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడుగా అతను ఎంచుకున్న పాయింట్ బానే ఉన్నా.. దాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడంలో విఫలమయ్యాడు అనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్
శ్రీ సింహా

మైనస్ పాయింట్స్

కథనం
సంగీతం
కామెడీ
విలనీ
క్లైమాక్స్

ఫైనల్ గా : భాగ్ ఆడియన్స్ భాగ్

రేటింగ్ : 1.5/5

                - బాబురావు. కామళ్ల

Related Posts