అప్పుడే ఓటీటీలోకి “అనుభవించు రాజా”

థియేటర్ రిలీజ్ కు వచ్చి రెండు వారాలు అయ్యాయో లేదో అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది రాజ్ తరుణ్ నటించిన అనుభవించు రాజా సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్ లో సుప్రియ నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు శ్రీను యార్లగడ్డ రూపొందించారు. నవంబర్ 26న థియేటర్ లలో రిలీజైన అనుభవించు రాజా సినిమా ప్రేక్షకుల తిరస్కారానికి గురైంది.

భీమ‌వ‌రంలో ఉండే బంగార్రాజు అలియాస్ బంగారం అనే యువ‌కుడి చుట్టూ తిరిగే క‌థే అనుభ‌వించు రాజా. బంగార్రాజు ఓ ప్ర‌మాదంలో త‌న కుటుంబాన్ని కోల్పోతాడు. తాత‌య్య ద‌గ్గ‌ర పెరుగుతాడు. ఆయ‌న చ‌నిపోతూ జీవితాన్ని స‌ర‌దాగా గ‌డ‌పాల‌ని చెబుతాడు. ఉన్న డ‌బ్బునంతా జ‌ల్సాల కోసం వాడేస్తుంటాడు. అయితే తన మ‌న‌సు చాలా మంచిది. కొన్ని అనుకోని ప‌రిస్థితుల్లో బంగార్రాజు జైలు కెళ్లాల్సిన ప‌రిస్థితి వస్తుంది. ఆ స‌మ‌యంలో ప‌ట్నంకు వెళ్లి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా జాయిన్ అవుతాడు. అదే కంపెనీలో ప‌ని చేసే శ్రుతి అనే అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమెకు త‌న గ‌తాన్ని తెలియ‌కుండా బంగార్రాజు జాగ్ర‌త్త ప‌డుతుంటాడు. అస‌లేం జ‌రిగింది? చివ‌ర‌కు బంగార్రాజు జీవితం ఎలాంటి మ‌లుపులు తీసుకుంద‌నేదే క‌థ‌.

ఈ కథా కథనాలు ఎక్కడా ఆకట్టుకోకపోవడంతో సినిమా టీమ్ ఎంత ప్రమోట్ చేసినా సినిమాను నిలబెట్టలేకపోయారు. దాంతో వీలైనంత త్వరగా ఓటీటీకి వస్తోంది అనుభవించు రాజా సినిమా. ఆహాలో ఈ నెల 17న స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.

Related Posts