‘గుంటూరు కారం‘ సెట్ లో ‘విశ్వంభర‘ సాంగ్

ఒక సినిమాకోసం వేసిన సెట్ ను మరో చిత్రానికి ఉపయోగించుకునే సందర్భాలు చాలానే జరిగాయి. ఈకోవలోనే మహేష్ బాబు ‘గుంటూరు కారం‘ కోసం వేసిన ఇంటి సెట్ ను చిరంజీవి ‘విశ్వంభర‘లో ఉపయోగిస్తున్నారట. ‘గుంటూరు కారం‘ సినిమాలో మహేష్ బాబు కుటుంబానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించడానికి పెద్ద ఇంటి సెట్ ను నిర్మించారు. ఇప్పుడు అదే సెట్ లో ‘విశ్వంభర‘ పాట చిత్రీకరణ సాగుతోందట.

‘విశ్వంభర‘ కోసం ఓ ఫ్యామిలీ సాంగ్ ను కంపోజ్ చేశాడట కీరవాణి. ఆ పాటనే ఈ ఇంటి సెట్ లో చిత్రీకరిస్తున్నారట. ఈ పాటలో హీరోహీరోయిన్లు చిరంజీవి, త్రిష లతో పాటు.. చిరు చెల్లెళ్లు పాత్రల్లో కనిపించబోతున్న ఆషిక రంగనాథ్, ఇషా చావ్లా, సురభి వంటి వారు పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఇక.. ఈ మూవీలో మీనాక్షి చౌదరి మరో నాయికగా కనిపించనుందట. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తోంది. సోషియో ఫాంటసీగా రూపొందుతోన్న ఈ సినిమాలో మెగాస్టార్ డ్యూయల్ రోల్ లో మురిపించబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న ‘విశ్వంభర‘ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts