ఒకే తేదీన పుట్టిన ఇద్దరు లెజెండ్స్

అక్టోబర్ 1.. ఒక విధంగా తెలుగు సినిమా హాస్యానికి పుట్టినరోజు అనొచ్చేమో. ఎందుకంటే.. ఈ తేదీనే మన స్వర్ణయుగపు లెజెండరీ హాస్య చక్రవర్తులు రమణారెడ్డి, అల్లు రామలింగయ్య లు పుట్టారు. రమణారెడ్డి 60, 70లలో అగ్ర హాస్యనటుడిగా కొనసాగితే.. ఆ సంవత్సరాలతో పాటు ఆ తర్వాత మరో రెండు, మూడు దశాబ్దాలపాటు తెలుగు చలనచిత్ర సీమను తన హాస్యపు జల్లులతో సుసంపన్నం చేశారు అల్లు రామలింగయ్య.

రమణారెడ్డి 1921వ సంవత్సరం అక్టోబర్ 1న నెల్లూరు జిల్లా జగదేవి పేటలో జన్మించారు. రమణారెడ్డి పూర్తిపేరు తిక్కవరపు వెంకట రమణారెడ్డి. సినిమాలలోకి రాకముందు నెల్లూరులో శానిటరీ ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేశారు. రమణారెడ్డి తొలిసారిగా జానపద చిత్రం ‘మాయపిల్ల’లో వేషం వేశారు. ఆ చిత్రానికి రఘుపతి వెంకయ్య కుమారుడు రఘుపతి సూర్యప్రకాశ్ దర్శకుడు. ఆ తర్వాత ‘బంగారుపాప’, ‘మిస్సమ్మ’ చిత్రాలతో రమణారెడ్డి పాపులరయ్యారు.

తెలుగు సినిమా స్వర్ణయుగంలో హాస్యనటుడిగా అగ్రపథాన దూసుకెళ్లిన రమణారెడ్డిది విలక్షణమైన హాస్యం. నెల్లూరు మాండలికంలో రమణారెడ్డి పండించిన హాస్యం తరతరాలు గుర్తుండిపోతుంది. రమణారెడ్డి పలుకులో విశేషం ఉంది. అతను ఏ పాత్ర ధరించినా ఆ పాత్ర సగభాగం నెల్లూరుమాండలికంలోనే ఉంటుంది. చివరికి ‘మాయాబజార్‌’ లోని చిన్నమయ పాత్ర కూడా ఆ భాష నుంచి తప్పించుకోలేదు. దర్శకులు కూడా అందుకు ప్రోత్సహించేవారు. ఇక.. తెలుగు సినిమా స్వర్ణయుగమైన 60, 70లలో రమణారెడ్డి అగ్ర హాస్యనటుడిగా కొనసాగారు. రేలంగి, సూర్యకాంతం, పద్మనాభం కాంబినేషన్స్ లో రమణారెడ్డి నటించిన చాలా చిత్రాలు ఘన విజయాలు సాధించాయి.

రమణారెడ్డి గురించి చాలామందికి తెలియని ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. ఆయన ఒక గొప్ప మెజీషియన్. సినిమాలు ఉన్న సమయమైనా లేని సమయమైనా కొద్దిగా చిన్న పాటి ఖాళీ సమయం దొరికితే చాలు.. మ్యాజిక్ నేర్చుకోవాలని తెగ ఆరాటపడేవారు. అలాగే ఆ తర్వాత ప్రొఫెషనల్ మెజీషియన్ గా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు.

వ్యక్తిగా రమణారెడ్డి సౌమ్యుడు. తెరమీద ఎంత అల్లరీ, ఆర్భాటం చేసి నవ్వించేవారో బయట అంత సీరియస్‌. మనసుకూడా అంత నెమ్మదైనదే. ఏనాడూ ఎవరి గురించీ చెడుమాట్లాడ్డమో, విమర్శించడమో చేసేవారు కాదు. తన పనేదో తనది, ఒకరి సంగతి తనకక్కరల్లేదు. వెండితెర హాస్యచక్రవర్తి రమణారెడ్డికి ఆరోగ్యం సహకరించేది కాదు. అల్సర్ తో బాధపడుతూ 1974 నవంబర్ 11 రమణారెడ్డి కన్నుమూశారు.

రమణారెడ్డి పుట్టిన అక్టోబర్ 1నే అల్లు రామలింగయ్య జన్మించారు. 1922, అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య పుట్టినరోజు. నటుడిగా వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు అల్లు. తొలి సినిమా ‘పుట్టిల్లు’నుంచి చివరి సినిమా ‘జై‘ వరకూ జైత్రయాత్ర కొనసాగించారు. అలాగే అల్లు నుంచి అన్ని తరాల నటులూ నేర్చుకోవాల్సిన ప్రథమ లక్షణం ప్లానింగ్, డిసిప్లిన్. అది కెరీర్ పరంగా అయినా కుటుంబ పరంగా అయినా వర్తిస్తుంది. అందుకే అల్లు సృష్టించిన సామ్రాజ్యం ఇప్పుడు సినిమా పరిశ్రమలో అప్రతిహతంగా సాగుతోంది. ఎంత డిసిప్లిన్ గా ప్లాన్ చేస్తే ఇలాంటి పరిశ్రమలో అలా సాధ్యమౌతుంది.

రామలింగయ్య నటనకు పునాది నాటకరంగం. ప్రజానాట్యమండలి కళాకారుడైన రామలింగయ్య ‘కూడు గుడ్డ’, ‘ఆడది’, ‘పల్లెపడుచు’, ‘పశ్చాత్తాపం’ వంటి నాటకాలు ప్రదర్శిస్తూ ఊరూరు, వాడవాడ తిరిగేవారు. వీటిల్లో ‘పశ్చాత్తాపం’ నాటకంలోని పేరయ్య శాస్త్రి పాత్ర ఆయనకు పేరు తేవడమే కాదు ఎన్నో బహుమతులను సంపాదించి పెట్టింది. అంతేకాదు రామలింగయ్య సినీరంగ ప్రవేశానికి ఈ పాత్రే దారి చూపించింది.

ప్రజానాట్యమండలి సభ్యుడైన డా.గరికపాటి రాజారావు ఆ నాటి మద్రాసు చేరి ‘పుట్టిల్లు’ పేరుతో చిత్రనిర్మాణం ప్రారంభిస్తూ , ఇతర సభ్యులకు కూడా ఇందులో అవకాశాలు కల్పించారు. ‘పశ్చాత్తాపం’ నాటకంలో పేరయ్య శాస్త్రి పాత్ర బాగా పేరు తేవడంతో ‘పుట్టిల్లు’ చిత్రంలో అదే పాత్రను ‘శాస్త్రులు’ పేరుతో అల్లు రామలింగయ్యతో పోషింపచేశారు రాజారావు. ఆ పాత్రను ఆయన పోషించిన వేళావిశేషం ఏమిటో కానీ ఆ తరువాతి కాలంలో శాస్త్రి పాత్ర అనగానే దర్శకనిర్మాతలకు రామలింగయ్యే గుర్తుకు వచ్చేవారు.

1957లో వచ్చిన ‘మాయాబజార్’ చిత్రంలో ‘తానా శాస్త్రి.. తందానా శర్మ’ పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండే పాత్రలు. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన ‘దొంగరాముడు’ సినిమాలో హాస్టల్ వార్డెన్ వేషం వేశారు రామలింగయ్య. ఆ పాత్రతో కె.వి. దృష్టిల పడటంతో ఆయన ‘మాయాబజార్’ చిత్రంలో శర్మ వేషం రామలింగయ్యకు ఇచ్చారు. అంతే. ఈ చిత్రంలో ఆయన పోషించిన ‘తందానా శర్మ’ పాత్ర దాదాపు 20 ఏళ్ల సినీ జీవితాన్నిచ్చింది.

నటుడు కావాలన్న కోరికతో సొంత డబ్బులతో స్టేజ్ ఆర్టిస్ట్ గా మారి, అటు పై సినిమా నటుడిగా మారిన అల్లు రామలింగయ్య తనకంటూ ఓ శైలిని అతి తక్కువ సమయంలో క్రియేట్ చేసుకున్నారు. తర్వాత ప్రతి పాత్రతోనూ ప్రేక్షకులకు ఏ మాత్రం మొనాటనీ లేకుండా చూసుకున్నారు. ఇక రాజబాబు తర్వాత అల్లు, రమాప్రభల కాంబినేషన్ కు ఉండే క్రేజ్ ఆ రోజుల్లో చాలానే ఉండేది. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకొనేందుకు ఈ జంట కోసం పాటలు పెట్టిన సందర్భాలూ.. అవి సూపర్ హిట్ అయిన సిట్యుయేషన్స్ ను ప్రేక్షకులెవరూ అంత ఈజీగా మర్చిపోలేరు..

ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో నిలదొక్కుకున్నారు అల్లు రామలింగయ్య. అల్లు హాస్యపు జల్లునేకాదు కామెడీ విలనిజాన్ని కూడా బాగా రక్తికట్టించారు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి ‘మూగమనసులు, దొంగరాముడు, మాయా బజార్, ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం‘ మొదలైనవి వున్నాయి.

50యేళ్ల పాటు నటుడిగా కొనసాగిన అల్లు రామలింగయ్య 1990లో భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’అందుకున్నారు. తెలుగు సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఓ తపాలా బిళ్ల విడుదల చేశారు. తెలుగువారికి కోట్ల నవ్వుల్ని పంచి అందరి హృదయ కోటల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అల్లు తన ఎనభైరెండో యేట 2004 జూలై 31న కన్నుమూశారు.

Related Posts