రణ్‌వీర్ కూడా టాలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు..!

బాలీవుడ్ హీరోలు సౌత్ ని చిన్న చూపు చూసిన మాట వాస్తవమే. అయితే.. అది ఒకప్పుడు. కానీ.. ఇప్పుడు వారు ఏరికోరి సౌత్ లో నటించడానికి.. సౌత్ టాలెంట్ తో పనిచేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. సౌత్ డైరెక్టర్స్ తో ఒక్క సినిమా చేస్తే చాలు తమ కెరీర్ మళ్లీ గాడినపడ్డట్టే అనే ఆలోచన చేస్తున్నారు.

బాలీవుడ్ బడా హీరోలలో ఇప్పటికే చాలామంది దక్షిణాది దర్శకులతో పనిచేశారు. సల్మాన్, అమీర్, షారుక్ ఖాన్ వంటి వారు గతంలో సౌత్ కంటెంట్ తో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారు. అంతెందుకు.. ‘జవాన్’తో షారుక్, ‘యానిమల్’తో రణ్‌బీర్ అందుకున్న బ్లాక్ బస్టర్స్ లేటెస్ట్ ఉదాహరణలు. ‘జవాన్’లో షారుక్ ఖాన్ ని నెవర్ బిఫోర్ అన్నట్టు చూపించి అద్భుతమైన విజయాన్నందించాడు డైరెక్టర్ అట్లీ. ఇప్పటివరకూ యాక్షన్ ఇమేజ్ అస్సలు లేని రణ్‌బీర్ ని ‘యానిమల్’తో ఊరమాస్ హీరోగా మార్చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.

ఇప్పుడు మరో స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కూడా సౌత్ డైరెక్టర్స్ తో వర్క్ చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాడట. అది కూడా మన తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మతో. ‘హనుమాన్’తో ఎక్కడికో వెళ్లిపోయిన ప్రశాంత్ వర్మ కూడా బాలీవుడ్ క్రేజీ స్టార్ రణ్‌వీర్ తో పనిచేయడానికి ఆసక్తిగానే ఉన్నట్టు ఇండస్ట్రీ టాక్. దేశవ్యాప్తంగా ఉన్న బడా ప్రొడక్షన్ హౌజెస్ రణ్‌వీర్ సింగ్-ప్రశాంత్ వర్మ కాంబోలో ఓ సూపర్ హీరో మూవీని సెట్ చేసే ఆలోచనలో ఉన్నాయట. త్వరలోనే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్టు తెలుస్తోంది.

Related Posts