Prabhas : భద్రాద్రి రాముడిపై ప్రభాస్ ప్రేమ

ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ దాతృత్వం గురించి అందరికీ తెలుసు. కానీ ఆ స్థాయిలో ప్రమోషన్స్ చేసుకోడు. సాయం కోసం ప్రభాస్ వద్దకు వెళితే కాదు అనడం ఉండదు అంటారు. అలాంటిది ఎవరూ అడగకుండా తనే స్వయంగా సాయం చేయడం అతని పెద్ద మనసుకు నిదర్శనం. జూన్ 16న విడుదల కాబోతోన్న ఆదిపురుష్ లో శ్రీరాముడుగా నటించాడు ప్రభాస్.

ప్రభాస్ ఈ తరహా పాత్ర చేయడం ఫస్ట్ టైమ్. అయితే ఇది పూర్తిగా నార్త్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమా అనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే మనం రాముడు అంటే వాళ్లు రాఘవ అంటున్నారు. సీతారాములు అనే కోణంలో కూడా అక్కడి నుంచి కొన్ని మార్పులు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తెలుగువారికి పెద్దగా కనెక్ట్ కాలేదు అనేది నిజం. అందుకు కారణాలేవైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ నిరాదరణకు గురవుతున్న భద్రాచల రాముడిని మాత్రం గుర్తు పెట్టుకున్నాడు ప్రభాస్.


తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడి ప్రభుత్వం భద్రాచల అభివృద్ధి గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే తను శ్రీ రాముడుగా నటించాడని.. దక్షిణాది అయోధ్యగా భావించే భద్రాచల రాముడి ఆలయానికి పదిలక్షలు విరాళంగా ఇచ్చాడు ప్రభాస్. ఈ విరాళాన్ని తన సన్నిహితుల ద్వారా ఆలయ ఈవోకు అందజేశారు.

నిజంగా ప్రభాస్ నుంచి ఇది ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు అనే చెప్పాలి. ఇప్పటి వరకూ మన తెలుగు హీరోలు ఎంతోమంది రాముడు పాత్రల్లో కనిపించారు కానీ.. ఇలా భద్రాద్రి రామయ్య కోసం విరాళం అందించిన మొదటి వెండితెర రాముడు ప్రభాసే అని చెప్పాలి. ఏదేమైనా ప్రభాస్ చూపిన దాతృత్వానికి ప్రజలతో పాటు రామ భక్తుల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి.

Related Posts