‘ఉస్తాద్..‘ కోసం పవన్ షూటింగ్ ప్లాన్

రీఎంట్రీ ఇచ్చిన మూడేళ్లలో మూడు సినిమాలను విడుదల చేశాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కిట్టీలో మరో మూడు చిత్రాలున్నాయి. వీటిలో భారీ చిత్రం ‘హరి హర వీరమల్లు‘ని పక్కనపెడితే వీలైనంత తొందరగా పూర్తయ్యే మరో రెండు చిత్రాలు ‘ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ‘. ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ ను వీలైనంత తొందరగా పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్.

రీఎంట్రీలో ఇప్పటివరకూ రీమేక్స్ కే పరిమితమైన పవన్ కళ్యాణ్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ని కూడా రీమేక్ సబ్జెక్ట్ తోనే చేయబోతున్నాడు. తమిళంలో హిట్టైన ‘తేరి‘ రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుందనే ప్రచారం జరుగుతుంది. పవర్ స్టార్ కి ‘గబ్బర్ సింగ్‘ వంటి ఇండస్ట్రీ హిట్ అందించిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. పేరుకి రీమేక్ అయినా కేవలం అక్కడ కథలోని పాయింట్ ను మాత్రమే తీసుకుని తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నాడట హరీష్ శంకర్. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ కొత్త షెడ్యూల్ అక్టోబర్ 20 నుంచి మొదలవ్వనుందట.

కేవలం ఒక వారం పాటు ఈ షెడ్యూల్ ని ప్లాన్ చేశారట. ఆ తర్వాత పవన్ మళ్లీ వరుణ్ తేజ్ వివాహం కోసం ఇటలీ వెళ్లాల్సి ఉంది. ఇక.. ‘ఉస్తాద్..‘ కోసం తమిళ నటుడు, దర్శకుడైన పార్థిబన్ ను విలన్ పాత్రకోసం తీసుకుంటున్నారట. ఈ మూవీలో పవన్ కి జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఇక.. ‘ఉస్తాద్..‘తో పాటు మరో మూవీ ‘ఓజీ‘ని కూడా ఎన్నికల లోపే పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట పవర్ స్టార్.

Related Posts