నాగ చైతన్య.. శ్రీకాకుళం నుంచి పాకిస్తాన్ వరకూ

నాగ చైతన్య కొత్త సినిమా దాదాపు కన్ఫార్మ్ అయింది. కార్తికేయ2తో ప్యాన్ ఇండియన్ ఇమేజ్ తెచ్చుకున్న చందు మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో రూపొందబోతోన్న ఈ చిత్రం కూడా ప్యాన్ ఇండియన్ స్పాన్ ఉన్న కథే కావడం విశేషం.

ఈ కథకు చాలా పెద్ద స్పాన్ ఉందని ముందు నుంచీ చెబుతున్నాడు చందు. అందుకే స్క్రీన్ ప్లే రాసుకోవడానికి చాలా చాలా టైమ్ తీసుకున్నాడట. ఇది ఎప్పుడో నాలుగైదేళ్ల క్రితం అనుకున్న కథట. దాన్ని సినిమాగా మార్చడానికి ఇన్నాళ్లు పట్టింది. తాండేల్ అనే వర్కింగ్ టైటిల్ తో మొదలు కాబోతోన్న ఈ మూవీ సముద్రంపై వేటకు వెళ్లే జాలరుల కథ. జాలరి అనగానే వేటకు వెళ్లడం.. సముద్రంలో ఆటుపోట్లు, తుఫాన్ లు.. ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ చాలానే ఉంటాయి. దీనికి తోడు మాస్ ను మెప్పించేందుకూ మంచి స్కోప్ ఉంటుంది.


తాండేల్ అంటే ఇలా సముద్రంలో వేటకు తీసుకువెళ్లే షిప్ లను నడిపించేవారిని ఆ పేరుతో పిలుస్తారట. అందుకే ఈ చిత్రానికి ఆ టైటిల్ పెట్టబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది. కథగా ఇది శ్రీకాకుళంలో మొదలవుతుంది. అక్కడి నుంచి వారి జీవితాలు ఎలా ఉంటాయి. సముద్రంలో ఎన్ని సమస్యలు ఫేస్ చేస్తారు. వేటాడే క్రమంలో సముద్ర జలాలకు సంబంధించిన విశేషాలు ఎలా ఉంటాయి అనే ఆసక్తికరమైన అంశాలెన్నో ఈ కథలో ఉంటాయంటున్నారు.

అలా వేటకు వెళ్లిన ఈ శ్రీకాకుళం జిల్లా వాళ్లు ఓ అనుకోని తుఫాన్ లో చిక్కుకుని పాకిస్తాన్ బోర్డర్ కు చేరతారు. మరి పాక్ నేవీ అధికారులు వీరిని పట్టుకున్నారా..? తర్వాత ఏమైంది అనే పాయింట్.. ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అవుతుంది. పైగా సముద్రం, జాలరి అనే మాటలకు ప్రాంతీయత ఉండదు కదా..? అందుకే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలోనే చిత్రీకరించబోతున్నారు.

కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తను ఒప్పుకుంటే వెంటనే అనౌన్స్ మెంట్ వస్తుంది. దాంతో పాటు సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అనేది కూడా అప్డేట్ చేస్తారు. విశేషం ఏంటంటే.. ఈ కథపై అందరికంటే ఎక్కువగా అల్లు అరవింద్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అంటే నాగ చైతన్యకు బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోవచ్చు.

Related Posts