మహానటి సావిత్రి జయంతి నేడు

మహానటి సావిత్రి జయంతి నేడు

‘మహానటి’ అన్న పదానికి నిలువెత్తు రూపం సావిత్రి. ఆమె పేరు తలవగానే అందరికీ అప్రయత్నంగా ‘మహానటి’ సావిత్రి అనే గుర్తుకు వస్తుంది. తెలుగునాట ఇంతటి ఖ్యాతిని మరెవరూ సంపాదించలేదు. నేడు (డిసెంబర్ 6) సావిత్రి జయంతి. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో సావిత్రి అభినయవైభవం తెలుగువారిని విశేషంగా అలరించింది. తెలుగు సినిమాల వెలుగులో సావిత్రి ప్రతిభాపాటవాల పాత్ర కూడా ఎంతో ఉందని అంగీకరించక తప్పదు. సహ నటీనటులు సైతం సావిత్రి నటనానైపుణ్యాన్ని అభిమానించారు.. ఆరాధించారు.

తెలుగు చిత్రసీమకు రెండు కళ్ళు యన్టీఆర్, ఏయన్నార్ అని ప్రసిద్ధి. ఇక తెలుగు సినిమాకు నుదుట సిందూరంగా భాసిల్లారు సావిత్రి. అదే రీతిన ఆ మహానటులిద్దరితోనూ సావిత్రి నటించి మెప్పించారు. తెలుగు సినిమా స్వర్ణయుగంలో యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాల విజయాలే సింహభాగం ఆక్రమిస్తాయి. వాటిలో సావిత్రి అభినయానికీ భాగముందని చెప్పక తప్పదు.

కొన్ని నిర్మాణ సంస్థలకు విజయనాయికగా విజయకేతనం ఎగురవేశారు సావిత్రి. తెలుగునాట నిర్మాణ సంస్థలు అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది విజయా సంస్థనే. ఈ సంస్థ నిర్మించిన చిత్రాలు తెలుగువారిపై చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ సంస్థ నిర్మించిన ‘చంద్రహారం, మిస్సమ్మ, అప్పుచేసిపప్పుకూడు, మాయాబజార్, గుండమ్మకథ‘ చిత్రాల్లో సావిత్రి ప్రధాన పాత్రలు పోషించారు.

తెలుగునాట అభిరుచిని చాటుకుంటూ పలు ఉత్తమ కుటుంబకథా చిత్రాలను అందించిన సంస్థ అన్నపూర్ణ సంస్థ. ఈ సంస్థ నిర్మించిన తొలి చిత్రం ‘దొంగరాముడు’లో నాయిక సావిత్రి. ‘దొంగరాముడు’ తరువాత అన్నపూర్ణ సంస్థలో సావిత్రి నటించిన ‘తోడికోడళ్ళు, వెలుగునీడలు, సుమంగళి, డాక్టర్ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు‘ వంటివి ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.

నటనలో సహజత్వానికి పెద్ద పీట వేస్తూ సావిత్రి అభినయవైభవం సాగింది. అందుకే సావిత్రి నటనంటే ఈ తరం వారికీ ఎంతో అభిమానం. తరాలు మారినా సావిత్రి ప్రతిభాపాటవాలకు తెలుగు జనం జేజేలు పలుకుతూనే ఉన్నారు. తమ హృదయపు కోవెలలో సావిత్రిని ఓ దేవతలా ఆరాధిస్తూనే ఉన్నారు. అదీ సావిత్రి తన నటనతో సాధించుకున్న అసలైన సంపద.

Related Posts