డిసెంబర్ 15పై కరణ్‌ జోహార్ కామ్ అయ్యాడా

ఇండస్ట్రీలో సీనియర్స్ అనో లేకపోతే తమదే ఆధిపత్యం అనో కొంతమంది దాన్ని బాహాటంగా ప్రదర్శిస్తుంటారు. తాము చెప్పిందే జరగాలంటారు. నిజంగా కొన్ని పరిశ్రమల్లో జరుగుతుంది కూడా. వాళ్లు చెప్పిన మాట వినకపోతే అవతలి వారి అంతం చూసినవాళ్లూ ఉన్నారు. అలాంటి వారిలో కరణ్‌ జోహార్ ముందుంటాడు అని కంగనా రనౌత్ కెరీర్ లో సక్సెస్ అయిన దగ్గర్నుంచీ చెబుతూ వస్తోంది.

అది నిజమా కాదా అనేది పక్కన బెడితే బాలీవుడ్ ను శాసించే వారిలో మాత్రం కరణ్‌ జోహార్ ముందే ఉంటాడు అనేది నిజం. తన మాటే చెల్లాలి అనే నైజం అతనిది. తన చుట్టూ ఇండస్ట్రీని తిప్పుకోవడంలోనూ సూపర్ సక్సెస్ అయ్యాడు. నెపోటిజంను ఎక్కువగా ప్రోత్సహించే నిర్మాతల్లో అతనిదే ఫస్ట్ ప్లేస్. సరే అవన్నీ ఎలా ఉన్నా.. రీసెంట్ గా తన ఆధిపత్యాన్ని సౌత్ సినిమాలపై చూపించాలనే ప్రయత్నం చేశాడు కరణ్ జోహార్. అందుకు డిసెంబర్ 15 అనే డేట్ ఒక వేదిక అయింది.


కరణ్ జోహార్ నిర్మించిన యోధ అనే సినిమా డిసెంబర్ 15న విడుదల చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించాడు కరణ్ జోహార్. కొన్ని రోజుల తర్వాత అదే డేట్ కు తామూ వస్తున్నట్టు మెర్రీ క్రిస్మస్ టీమ్ ప్రకటించింది. ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకుడు. విజయ్ సేతుపతి హీరో. కత్రినా కైఫ్‌ హీరోయిన్. అంతే.. తన సినిమా రోజు మీ సినిమా ఎలా రిలీజ్ చేస్తారు. అనౌన్స్ చేసే ముందు నాకు చెప్పాలి కదా.. నాకు చెప్పకుండా ఎలా రిలీజ్ చేస్తారు.. అంటూ ఇన్ డైరెక్ట్ గా ఆ సినిమా మేకర్స్ పై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డాడు. అఫ్‌ కోర్స్ అతని కమెంట్స్ పై నెటిజన్స్ బ్రూటల్ గా ట్రోల్ చేశారనుకోండి. అయితే విజయ్ సేతుపతికి అక్కడ పెద్దగా ఇమేజ్ లేదు. అతని సినిమాకే అంత మండిపడితే ఇప్పుడు అదే డేట్ కు ఏకంగా ధనుష్‌ వస్తున్నాడు.


ధనుష్‌ లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్ డిసెంబర్ 15నే విడుదల కాబోతోంది. ఎలా చూసినా ఇది పెద్ద సినిమా. కాస్టింగ్ నుంచి మేకింగ్ వరకూ నెక్ట్స్ లెవెల్ మూవీ. పైగా భారత స్వాతంత్ర్య సమరం నేపథ్యంలో రూపొందిన కథ. అంటే యూనివర్సల్ కంటెంట్. ఈ కంటెంట్ ను కాదని నార్త్ ఆడియన్స్ మరో సినిమాకు ప్రాధాన్యం ఇస్తారు అనుకోలేం. అసలే దేశ భక్తి సినిమాల ట్రెండ్ నడుస్తోందిప్పుడు.

మరోవైపు ధనుష్‌ కు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అక్కడ రాంఝనా అనే ఫస్ట్ మూవీతోనే బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్నాడు.ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ కూడా స్టార్ట్ అయింది. సో.. మరి ఇప్పుడు కరణ్‌ జోహార్ ధనుష్ పై కమెంట్ చేస్తాడా అని ఈ మూవీ టీజర్ విడుదలై డేట్ అనౌన్స్ అయిన దగ్గర్నుంచీ చూస్తున్నారు ఆడియన్స్. బట్ మెర్రీ క్రిస్మస్ టైమ్ లో నెటిజన్స్ ఇచ్చిన షాక్ కు భయపడ్డాడో లేక ధనుష్ పెద్ద హీరో కాబట్టి ఎందుకు అనుకున్నాడో.. ఈ మూవీ విషయంలో మాత్రం సైలెంట్ అయిపోయాడు. ఏ ఆధిపత్యం అయినా ఎక్కువ రోజులు నడవదు. ఎదురించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే ఇండస్ట్రీ అనే మాట ఎప్పటికీ సాగదు అని అర్థం అవుతోంది కదా..?

Related Posts