స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల అన్నాడో కవి. నిజమే.. ఎన్ని బంధాలున్నా.. ఎందరు బంధువులున్నా.. ఎవ్వరికీ సాటి రానిది స్నేహం. ఏదో ఒక దశలో స్నేహాన్ని అనుభవించని మనిషీ, స్నేహాన్ని వర్ణించని కవీ ఉండరేమో.. ఎవరి అనుభవాలకు వారుగా తమ స్పందనలను తెలియజేస్తారు. అందుకే ఈ లోకంలో డబ్బుల్లేనోడు కాదు, స్నేహితులు లేనోడే అసలైన పేదోడు అంటారు.. ఇవాళ స్నేహితుల దినోత్సవం.
ఆపదలో ఉంటే అడక్కుండానే సాయం చేస్తుంది స్నేహం.. చేసిన సాయానికి ప్రతిఫలాన్ని ఎన్నడూ కోరదు. స్నేహముంటే చాలూ.. అది పంచే మాధుర్యం ఉంటే చాలు అనుకునే స్నేహితులుంటే ఆ జన్మధన్యం అనకుండా ఉండగలమా.. ప్రేమైనా.. పెళ్లైనా.. మరే బంధమైనా వెదుక్కుంటేనే వస్తుంది. కానీ స్నేహం అలా కాదు.. అది మన కంటే ముందే పుట్టి ఉంటుంది.
ఓ రెండు ఆత్మలు కలసి బ్రహ్మదేవుణ్ని ఓ వరం అడిగాయట. రూపురేఖలు వేరైనా ఒకే ఊపిరిగా ఉండే బంధాన్ని సృష్టించమని.. అప్పుడు వచ్చిన ఆ సృష్టే ఈ స్నేహం.. అంటే కాదనేదెవరు. పసికందులుగా పుట్టిన తర్వాత.. ఊహ తెలిసే టైమ్ కే మనకు స్నేహితులెవరో తెలిసిపోతుంది. ముందుగా అమ్మానాన్నా స్నేహితులుగా ఉంటారు. కానీ ఆ బంధాన్ని కూడా మరిపించేలా మరో స్నేహం మనకు తోడయ్యేది మనకు ఓ వయసు వచ్చిన తర్వాతే.. అప్పుడు ఏర్పడ్డ స్నేహం ఎన్ని అవాంతారాలొచ్చినా.. ఆగదు.. ఎంత వయసుకు వచ్చినా వాడిపోదు.. అసలా బంధాన్ని వర్ణించాలంటే అనుభవం తప్ప మాటలు చాలవు..
మనలో చాలామంది స్నేహాలు పాఠశాల స్థాయి నుంచే పెరుగుతాయి. ఆ వయసులోనే మనకు స్నేహితుడూ.. అతని విలువా తెలుస్తుంటాయి.. అలా మొదలైన స్నేహం ఎంత ఎదిగినా విడిపోదు.. సరికదా.. మరింత బలపడుతుంది. ఆటపాటలు, చదువుల నుంచి కెరీర్ వరకూ కలిసే నడుస్తుంది. అప్పటి వరకూ మనతో ఉన్న నేస్తాలు తాత్కాలికంగా విడిపోతున్నా.. ఎప్పటికీ ఫేర్ వెల్ లేని ఏకైక బంధం స్నేహం మాత్రమే.
స్నేహానికి క్వాలిఫికేషన్ అవసరం లేదు.. కానీ కాలేజ్ డేస్ లో స్నేహాన్ని అనుభవించడం జీవితంలో ఒక స్వచ్ఛమైన బహుమతి.. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోని స్నేహితులు కాలేజ్ డేస్ లో మనకెప్పుడూ ఉంటారు. కాకపోతే అలాంటి స్నేహితుల్ని మనం సంపాదించుకోవాలంటే మనసు, మనమూ నిజాయితీగా ఉండాలంతే.. అప్పుడు ఆ స్నేహితుడే కాదు.. అతనితో గడిపే కాలం కూడా మన నేస్తమవుతుంది. లోకమే మనంగా గడిపిన స్నేహాలు ఎక్కడో ఓ చోట తాత్కాలికంగా విడిపోవాల్సి వస్తుంది. అది తాత్కాలికమే అయినా.. అలాంటప్పుడు, అప్పటి వరకూ వారు పంచుకున్న కబుర్లు.. చేసిన అల్లరి పనులు గుర్తుకు వచ్చిన ఆ క్షణం కన్నీటి నివాళిగా మారుతుంది. అయినా ఆ అల్లరిని ఈ కన్నీటితో కలిపి పంచుకుంటారు. అలాంటి ఈ స్నేహ బంధం ఎంత మధురమో కదా..
ఎన్ని తరాలైనా అంతరాలు లేని బంధం స్నేహం.. అలాంటి బంధానికి ఎవరైనా అడ్డు తగిలినా.. ఒక్కసారి మనసులు కలిసిన స్నేహాలకు ఆస్తులు అంతస్తులు మేటర్ కానే కావు. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఆ స్నేహితులు కలకాలం నిలిచే ఉంటారు.. దానికి రాజు పేద భేదాలుండవు. వర్ణ, వర్గ తారతమ్యాలు ఉండవు.
నిజానికి మన పురాణాల్లో అత్యంత గొప్ప స్నేహంగా దుర్యోధనుడు, కర్ణుడు అని చెబుతారు. అలాంటి నేపథ్యంలో ఉన్న వాళ్లెవరైనా ఇప్పటికీ అలాంటి స్నేహాన్ని నిలుపుకుంటారు. నేస్తం కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు ఎన్నడూ వెనకాడరు. ఇక్కడ స్నేహితుడు.. అతని మంచి తప్ప మరొకటి కనిపించదు.. జీవితంలో ఏ బంధానికైనా విడిపోవడాలుంటాయోమో కానీ స్నేహానికి ఉండవు.. కారణం.. అది అన్ని బంధాలకు అతీతమైనది.. హృదయ స్పందనలంత స్వచ్ఛమైనది. అందులో తేడాలు వచ్చి ఆ స్పందన ఆగిపోతే పోయేవి ప్రాణాలే తప్ప స్నేహం కాదు.. అందుకే చిన్నారి స్నేహాలెన్ని తాత్కాలికంగా విడిపోయినా.. ఆ చిరునామాను కథగా రాసుకోమంటారు..
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అని ఆ కవి ఏ అనుభవంతో రాశాడో కానీ.. ఆ అనుభవంలో తడిసిపోని మనిషి ఉండడు.. ఒకవేళ ఉన్నా అలాంటి వారంతా స్వచ్ఛమైన మనసుతో అచ్చమైన స్నేహితుణ్ని వెదుక్కోవాలి.
- బాబురావు. కామళ్ల