అడ్డంగా బుక్ అయిన అర్జున్ రెడ్డి దర్శకుడు

అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ తెలుగులో పాపులర్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రాన్ని కొందరు కల్ట్ క్లాసిక్ అన్నారు. మరికొందరు బూతు చిత్రం అని కూడా అన్నారు. ఎవరేమనుకున్నా.. యూత్ మాత్రం బాగా కనెక్ట్ అయిపోయారు. ఇండస్ట్రీలో కూడా చాలామంది అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ చిత్రాన్నే బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడా బ్లాక్ బస్టర్ కొట్టాడు సందీప్. దీంతో బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యాడు.కంటెంట్ తో పాటు అతని టేకింగ్, మేకింగ్ కు మెస్మరైజ్ అయ్యారు బాలీవుడ్ హీరోలు.

అందులో రణ్‌బీర్ కపూర్ కూడా ఉన్నాడు. దీంతో సందీప్ థర్డ్ మూవీ బాలీవుడ్ లోనే రణ్‌బీర్ తో సెట్ అయింది. యానిమల్ పేరుతో రూపొందిస్తోన్న ఈ మూవీ ఆగస్ట్ 11న విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీ టీజర్ ప్రోమో అంటూ రిలీజ్ చేసిన ఓ గ్లింప్స్ తో సందీప్ రెడ్డి వంగా అడ్డంగా బుక్ అయిపోయాడు. దీంతో సోషల్ మీడియాలో మనోడిపై ఓ రేంజ్ లో సెటైర్స్, కామెంట్స్ పడుతున్నాయి.


రీసెంట్ గా వచ్చిన టీజర్ చూసిన వెంటనే చాలామంది బావుందన్నారు. ఇంకొందరు ఇది ఎక్కడోకొట్టేశాడే అంటూ ఆరాలు తీశారు. కట్ చేస్తే ఇది 2003లోనే వచ్చిన సౌత్ కొరియన్ మూవీ ఓల్డ్ బాయ్ లోని యాక్షన్ సీన్ గా తేల్చారు. మరీ ఇంత ఓపెన్ గా ఆ సీన్ ను మక్కీకి మక్కీ కాపీ కొట్టిన సందీప్ ను ఓ ఆటాడుకుంటున్నారు నెటిజన్స్. ఆ టీజర్ లో రణ్‌ బీర్ కపూర్ గొడ్డలి పట్టుకుని ఓ హెటెల్ లో ఉన్న విలన్స్ ముందుకు వెళతాడు. మాస్క్ లు వేసుకున్నవాళ్లంతా అతన్ని చూసి పక్కకు తప్పుకుంటుంటే మనోడు సంహారం మొదలుపెడతాడు. ఇదే టీజర్. ఈ టీజర్ నే ఓల్డ్ బాయ్ నుంచి కాపీ కొట్టాడని తేల్చారు నెటిజన్స్.

మరికొందరేమో స్క్విడ్ గేమ్ అనే వెబ్ సిరీస్ నుంచి లేపేశాడు అన్నారు. వీరిలో ఒకరిద్దరు మాత్రమే రణ్‌బీర్ కాపీ కొట్టాడు అన్నారు. మిగతా వారంతా సందీప్ ను విమర్శిస్తున్నారు. కేవలం ఒక్క కథే చేసిన అతను రెండో సినిమాకే కాపీ క్యాట్ అయ్యాడంటూ కౌంటర్స్ వేస్తున్నారు. ఏదేమైనా ఇవాళా రేపు ఏం చేసినా ఆడియన్స్ ఇట్టే పట్టేస్తున్నారు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం కుగ్రామం అయిందంటే ఇదే కాబోలు.

Related Posts