మెగాస్టార్ కు చెక్ పెడుతున్న దిల్ రాజు

మెగాస్టార్ కు చెక్ పెట్టేంత సీన్ దిల్ రాజుకు ఉందా అంటే చెప్పలేం. వెండితెరపై అయితే లేదు కానీ.. ఆ తెరలు దొరికేలా చేయడంలో ఉండే అవకాశం ఉంది కదా..? దిల్ రాజు ముందు నుంచీ డిస్ట్రిబ్యూటర్. తనకు లాభం వచ్చేలా ఏ సినిమాను ఎలా లేపాలో.. ఏ సినిమాను ఎలా ఆపాలో బాగా తెలిసినవాడు. అందుకే ఇప్పుడు మెగాస్టార్ చెక్ పెట్టేందుకు పక్కా వ్యూహంతో ఉన్నాడు. ఆగస్ట్ నెలలో రెండు భారీ చిత్రాలున్నాయి.

11న మెగాస్టార్ భోళా శంకర్ తో పాటు.. రజినీకాంత్ జైలర్ కూడా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఈ రెండు సినిమాల రైట్స్ కోసం ప్రయత్నించాడు దిల్ రాజు. కానీ రేట్ ఎక్కువగా ఉంది భోళా శంకర్ ను వదిలేశాడు. జైలర్ మాత్రం అతనే తీసుకున్నాడు. ఇక ఈ నెల 29న వస్తోన్న స్పై మూవీపై మంచి బజ్ ఉంది. దీంతో చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకున్నాడు.

అయితే స్పై మూవీ కావాలంటే దీంతో పాటు జైలర్ రైట్స్ తీసుకోవాలనే కండీషన్ పెట్టాడు. చూస్తూ చూస్తూ హిట్ కళ ఉన్న సినిమాను వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు కాబట్టి.. స్పై కోసం జైలర్ రైట్స్ ను కూడా తీసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు భోళా శంకర్ కు ప్రాబ్లమ్ గా మారబోతోంది అనేది ట్రేడ్ అంచనా.


భోళా శంకర్ మూవీ ఉత్తరాంధ్ర రైట్స్ తీసుకున్నవాళ్లు ఇంకా టైమ్ ఉంది కదా అని ఆగుతారు. ఆలోగానే ఆ ప్రాంతంలోని బెస్ట్ థియేటర్స్ అన్నీ దిల్ రాజు చేతిలోకి వస్తాయి. ఇప్పటికే ఆయా థియేటర్స్ కు సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా పూర్తవుతున్నాయని టాక్. అంటే ఆ థియేటర్స్ లో జైలర్ పడుతుంది. సాదా సీదా థియేటర్స్ మాత్రమే భోళా శంకర్ కు వెళతాయి.

ఎలా చూసినా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ఎక్కడైనా చూస్తారు. బట్ కొందరు ఆడియన్స్ పాత థియేటర్స్ లో సినిమాలు చూడాలనుకోరు కదా..? అందువల్ల ఇన్ డైరెక్ట్ గా అది భోళా శంకర్ కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు. అంటే ఓ డబ్బింగ్ సినిమా కోసం.. మెగాస్టార్ మూవీని కూడా వెనక్కి నెట్టేందుకు దిల్ రాజు సిద్ధపడ్డాడు. అంటే దూకుడు సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు ఇది యాపారం అంతే.

Related Posts