చిరంజీవి లైనప్ మామూలుగా లేదు

ఏడు పదుల వయసుకి దగ్గరపడుతోన్నా కుర్ర హీరోలకు మించిన రీతిలో దూకుడు చూపిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. రీఎంట్రీలో అస్సలు ఖాళీ లేకుండా వరుసగా షూటింగ్స్ తో బిజీ అయిన మెగాస్టార్ ఇటీవలే కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అందుకే కాస్త రెస్ట్ దొరికింది. మళ్లీ నవంబర్ నుంచి షూటింగ్స్ తో బిజీ అవ్వబోతున్నాడట. ఇక ఆగస్టులో తన బర్త్ డే స్పెషల్ గా రెండు సినిమాలను అధికారికంగా ప్రకటించిన చిరు.. తాజాగా మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

‘భోళా శంకర్‘ తర్వాత చిరంజీవి కమిటైన సినిమాల్లో కళ్యాణ్ కృష్ణ, వశిష్ట సినిమాలకు కమిటయ్యాడు. వీటిలో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మించే కళ్యాణ్ కృష్ణ చిత్రమే ముందుగా సెట్స్ పైకి వెళ్లాలి. అయితే ఈ సినిమాని మలయాళం చిత్రం ‘బ్రో డాడీ‘ని రీమేక్ చేద్దామనుకున్నారట. కానీ రీమేక్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉండడంతో ‘బ్రో డాడీ‘ రీమేక్ ను విరమించుకున్నాడట మెగాస్టార్. అందుకే కళ్యాణ్ కృష్ణ చిత్రం కాస్త ఆలస్యంగా మొదలయ్యే అవకాశాలున్నాయి.ఈలోపులో వశిష్ట్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ నిర్మించే సినిమాని పట్టాలెక్కించనున్నారట. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘ తరహాలో సోషియో పాంటసీ కాన్సెప్ట్ తో వశిష్ట సినిమా తెరకెక్కనుంది. ఈ రెండు సినిమాలతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక చిత్రం.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో చిత్రానికి కమిట్ అయ్యాడట చిరు.

తన మార్క్ కామెడీతో కమర్షియల్ మూవీస్ తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి. ఈ యంగ్ డైరెక్టర్ చెప్పిన స్టోరీ నచ్చడంతో వెంటనే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మెగాస్టార్. త్వరలోనే చిరు-అనిల్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవ్వనున్నాయట.

మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనూ చిరంజీవి సినిమా చేయబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది. గతంలో చిరంజీవి నటించిన ‘జై చిరంజీవి‘ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు త్రివిక్రమ్. ఇక చిరంజీవిని స్టార్ గా మార్చిన ‘ఖైదీ‘ చిత్రానికి సీక్వెల్ గా త్రివిక్రమ్ ఓ కథ రాశాడని.. ఆ కథతోనే చిరంజీవి సినిమా రూపొందనుందనే ప్రచారం జరుగుతోంది. ‘ఖైదీ‘ వచ్చి 40 ఏళ్లవుతోంది. ఇప్పుడు చిరంజీవితో ఆ సినిమా సీక్వెల్ తెరకెక్కిస్తే బాగుంటుందనేది త్రివిక్రమ్ ప్లాన్. చూడాలి మరి.. మెగాస్టార్ లైనప్ లో మరెంతమంది దర్శకులు వస్తారో.

Related Posts