కళాత్మక దర్శకుడు బి.ఎన్.రెడ్డి

సినిమాతో సమాజాన్ని ఏస్థాయిలో జాగృతం చేయొచ్చో, సమాజం పై ఎంత ప్రభావం చూపించవచ్చో నిరూపించిన దర్శక దిగ్గజం బి.ఎన్.రెడ్డి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్న తొలి దక్షిణభారతీయుడు కూడా ఈయనే. తెలుగు సినిమాపై ఎప్పటికీ తరగని ముద్ర వేసిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి జయంతి ఈరోజు (నవంబర్ 16).

హెచ్.ఎమ్.రెడ్డి, నటి కన్నాంబ లతో కలిసి 1938లో రోహిణి పిక్చర్స్ స్థాపించారు బి.ఎన్. రెడ్డి. ఆ బ్యానర్ పైనే ‘గృహలక్ష్మి’ చిత్రాన్ని ప్రారంభించినా.. ఆ చిత్రానికి హెచ్.ఎం.రెడ్డి దర్శక, నిర్మాత, బి.ఎన్. సహాయ దర్శకుడు, సహ నిర్మాతగా పనిచేశారు.

అయితే.. ఒక సన్నివేశ చిత్రీకరణలో హెచ్.ఎమ్.రెడ్డి తో విభేదించి బయటకు వచ్చారు. తర్వాత మూలా లక్ష్మినారాయణ స్వామి, కె.వి.రెడ్డి, చిత్తూరు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి వంటి మిత్రులతో కలిసి వాహినీ పిక్చర్స్ స్థాపించారు. తెలుగు చలన చిత్ర చరిత్రలో అదో సువర్ణాధ్యాయం.

తన వాహినీ పిక్చర్స్ పై దర్శకుడిగా బి.ఎన్.రెడ్డి తొలి చిత్రం 1939లో విడుదలైన ‘వందేమాతరం’. నిరుద్యోగ, వరకట్న సమస్యలను తీసుకొని, వాటికి చక్కటి పరిష్కారాన్ని చూపిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత 1940లో బాల్యవివాహాలను నిరసిస్తూ, వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహిస్తూ ‘సుమంగళి‘ తీశారు. ఈ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. ఆ తర్వాత బి.ఎన్. డైరెక్షన్ లో వచ్చిన ‘దేవత‘ దక్షిణ భారతదేశమంతటా సంచలనం సృష్టించింది.

వేశ్యావ్యామోహం వల్ల వచ్చే ఇబ్బందులను తెలుపుతూ ‘స్వర్గసీమ‘ తీశారు బి.ఎన్. 1945లో తీసిన ‘స్వర్గసీమ‘ తొలిసారిగా భారతదేశపు ఎల్లలు దాటి వియత్నామ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైంది. ఒక విదేశీ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న తొలి తెలుగు సినిమాగా రికార్డులకెక్కింది. ఈ చిత్రంతో ఘంటసాల గాయకుడుగానూ, సంగీత దర్శకుడుగానూ, చక్రపాణి రచయితగానూ పరిచయమయ్యారు. ‘స్వర్గసీమ’లో భానుమతి వాంప్ గా నటించడం విశేషం.

వాహిని వారి చిత్రాలలో తలమానికంగా నిలవడమే కాదు… ఎవర్ గ్రీన్ క్లాసిక్ అనదగ్గ చిత్రాలలో ఒకటి ‘మల్లీశ్వరి’. తెలుగు చలనచిత్ర చరిత్రలో సాటిలేని మేటి కళాఖండంగా, అపురూప దృశ్యకావ్యంగా మల్లీశ్వరి ఖ్యాతిగాంచింది. ఆ సినిమా ఎన్నిదేశాలు తిరిగిందో లెక్క లేదు.

‘మల్లీశ్వరి’ తర్వాత మళ్లీ ఆ రేంజ్ విజయాన్నందుకోలేకపోయారు బి.ఎన్. ఆ తర్వాత వచ్చిన ‘బంగారు పాప, భాగ్యరేఖ, పూజాఫలం, రంగులరాట్నం, బంగారుపంజరం’ వంటివి కళాత్మక చిత్రాలుగా నిలిచాయి. ఇక.. షేక్స్పియర్ హామ్లెట్ నాటకం ఆధారంగా తీసిన ‘రాజమకుటం’ మంచి విజయాన్ని సాధించింది. మొత్తంమీద.. తెలుగు సినిమా స్వర్ణయుగానికి ఒక ప్రతినిధిలా నిలిచారు బి.ఎన్.రెడ్డి.

Related Posts