‘ప్రేమలు’ చిత్రానికి అనిల్ రావిపూడి ప్రశంసలు

తెలుగు చిత్ర పరిశ్రమలో సంక్రాంతి తర్వాత మళ్లీ అలాంటి సినిమాల జాతర ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా జరిగింది. తెలుగు నుంచి ‘భీమా, గామి’ చిత్రాలతో పాటు మలయాళం నుంచి ‘ప్రేమలు’ సినిమా విడుదలైంది. మలయాళంలో ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమాని అదే పేరుతో తెలుగులో విడుదల చేశాడు రాజమౌళి తనయుడు కార్తికేయ.

ఈ సినిమా అనువాదంలో ఎక్కడా మలయాళ వాసనలు కనిపించకుండా.. అచ్చమైన తెలుగు సినిమాలా ఉండడానికి ప్రధాన కారణాలు ఈ చిత్రం బ్యాక్ డ్రాప్ హైదరాబాద్ ఒకటి అయితే.. మరొకటి ఈ సినిమాకి డైలాగ్స్ సమకూర్చిన ఆదిత్య హాసన్. ఫేమస్ కుమారి ఆంటీ, బిగ్‌బాస్ ఫేమ్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ లతో పాటు.. ‘ఆర్.ఆర్.ఆర్‘ చిత్రంలోని ‘తొక్కుకుంటూ పోవాలే‘ వంటి డైలాగ్స్ ను సందర్భానుసారం ఈ చిత్రంలో చొప్పించాడు ’90s’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్. ఆ డైలాగ్స్ ‘ప్రేమలు’ చిత్రానికి తెలుగు ఫీల్ ను కట్టబెట్టాయి.

కామన్ ఆడియన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీల కూడా ‘ప్రేమలు’ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. విడుదలకు ముందే ప్రివ్యూ చూసిన నాగచైతన్య మీ గ్యాంగ్ తో కలిసి థియేటర్ కు వెళ్లి ఎంజాయ్ చేయండి అంటూ తన రివ్యూ చెప్పేశాడు. ఆ తర్వాత రాజమౌళి కూడా ‘ప్రేమలు’ చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమా ట్రైలర్ చూసినప్పుడే హీరోయిన్ పాత్ర నచ్చేసిందని.. సినిమా చూసిన తర్వాత హీరో కూడా నచ్చాడని రాజమౌళి ట్వీట్ చేశాడు.

ఇక.. లేటెస్ట్ గా అపజయమెరుగని దర్శకుడు అనిల్ రావిపూడి ‘ప్రేమలు’ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తాడు. సూపర్బ్ క్యారెక్టర్స్, డైలాగ్స్ తో ‘ప్రేమలు’ చిత్రాన్ని చాలా బాగా తీర్చిదిద్దారని.. ఈ సినిమాలో సింపుల్ రైటింగ్, ట్రెండీ ఎగ్జిక్యూషన్ తనకెంతో నచ్చాయని అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. ఇక.. ఎంటైర్ టీమ్ తో పాటు తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేసిన కార్తికేయకు కాంప్లిమెంట్స్ అందించాడు అనిల్ రావిపూడి.

Related Posts