ఆదర్శవంతమైన జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి ..

సీనియర్ దర్శకులు అనగానే వయసురీత్యా అనుకుంటారు. కానీ వయసు అందరికీ వస్తుంది. ఆ సీనియారిటీలో వారు మిగిల్చే అనుభూతులు, పంచిన అనుభవాలే సీనియారిటీకి కొలమానాలు. ఆ విషయంలో ఎందరికో ఆదర్శవంతంగా ఉన్న జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి గారు. గత రాత్రి వయోభారంతో కన్నుమూశారాయన. ఆయన లేని లోటు పాత్రికేయ రంగానికి తీరని లోటుగా ఎంతోమంది జర్నలిస్ట్ లు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. దాదాపు యాభైయేళ్ల జర్నలిజం కెరీర్ ఆయనది. ఆలిండియా రేడియోతో వారి జర్నలిజం కెరీర్ ప్రారంభం అయింది. ఆలిండియా రేడియోలో బ్రాడ్ కాస్టర్ గా కెరీర్ ఆరంభించి తర్వాత దూరదర్శన్ కువచ్చారు. అటుపై ఈనాడు గ్రూప్స్ లో చేరారు. ప్రధానంగా సినీ జర్నలిస్ట్ గా చెప్పుకున్నా అన్ని రంగాల్లోనూ అందెవేసిన చేయి వారిది. సైన్స్ చదువుకున్నారు. స్పోర్ట్స్ లోనూ ప్రవేశం ఉంది. ఈ కారణంగానే ఆయనకు అనేక రంగాల్లో పట్టు ఉంది.

ఇది తన రచన, ఇంటర్వ్యూస్, విమర్శల్లో స్పష్టంగా కనిపించేది. గాంధీ హాస్పిటల్ నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా ఆయన బయటపెట్టిన అక్రమాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈనాడు పత్రికల్లోనే 30యేళ్ల పాటు పనిచేశారు. అక్కడే సితార పత్రికలో ఆయన రాసిన సినిమా సమీక్షలకు నేటికీ ఎంతమంది అభిమానులున్నారు. సితార పత్రిక సర్క్యులేషన్ చాలా మట్టుకు ఆయన సమీక్షల కోసమే పెరిగిందనేది నిజం.తెలుగుతో పాటు ఇంగ్లీష్ పత్రికల్లోనూ పనిచేశారు. విశేషం ఏంటంటే శ్రీహరి గారు ఎక్కువగా ఫ్రీ లాన్సర్ గానే పనిచేశారు. ఉద్యోగి అయితే సంస్థల ఒత్తిడి ఉంటుందనేది వారి అభిప్రాయం.మొత్తంగా తెలుగు సినిమా జర్నలిజం ఓ గొప్ప జర్నలిస్ట్ ను కోల్పోయింది. ఎంతోమంది ఏకలవ్య శిష్యులను సంపాదించుకున్న గుడిపూడి శ్రీహరి గారి ఆత్మకు శాంతి కలగాలని తెలుగు 70ఎమ్ఎమ్ తరఫున ప్రార్థిస్తున్నాం.

Related Posts