‘సైంధవ్’ రివ్యూ

నటీనటులు: వెంకటేష్, బేబి సారా, నవజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరీమియా తదితరులు
సినిమాటోగ్రఫి: ఎస్.మణికందన్
ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్.
మ్యూజిక్: సంతోష్ నారాయణన్
నిర్మాత: వెంకట్ బోయినపల్లి
దర్శకత్వం: శైలేష్ కొలను
విడుదల తేదీ: 13-01-2024

టాలీవుడ్ లో అన్ని రకాల ఎమోషన్స్ పండించగల అరుదైన నటుల్లో వెంకటేష్ ముందు వరుసలో నిలుస్తాడు. ఈసారి వెంకీ ఫుల్ లెన్త్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ‘సైంధవ్‘ సినిమా చేశాడు. ‘హిట్‘ సిరీస్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్ టైన్ మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించింది. భారీ తారాగణంతో రూపొందిన వెంకటేష్ ప్రెస్టేజియస్ 75వ సినిమా ‘సైంధవ్‘ ఎలా ఉంది? ఈ రివ్యూలో చూద్దాం.

కథ
సైంధ‌వ్ కోనేరు అలియాస్ సైకో (వెంక‌టేష్) త‌న ప్రాణానికి ప్రాణ‌మైన కూతురు గాయ‌త్రి (బేబి సారా)తో క‌లిసి చంద్రప్రస్థ అనే సిటీలో నివసిస్తుంటాడు. సైంధవ్ ని ఇష్టపడుతూ వారికి తోడుగా మనో (శ్రద్ధా శ్రీనాథ్) వారి ఇంటి పక్కనే ఉంటుంది. తన కూతురే సర్వస్వంగా బ్రతుకుతున్న సైంధవ్ కి.. ఆ కూతురు ఆరోగ్యం ప్రమాదంలో ఉందని తెలుస్తోంది. రూ.17 కోట్లు ఖర్చు అయ్యే ఓ ఇంజెక్షన్ చేస్తేనే కానీ ఆమె బ్రతకదు. మరి.. ఆ డబ్బు కోసం ‘సైంధవ్‘ ఏం చేశాడు? చిన్న పిల్లల అక్రమ రవాణా, ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేసే గ్యాంగ్ తో ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
డైరెక్టర్ శైలేష్ కొలను అనగానే ‘హిట్‘ సిరీస్ ముందుగా గుర్తుకొస్తుంది. తెలుగులో రెండు ఇన్ స్టాల్ మెంట్స్ గా ఈ సిరీస్ ను తీసిన శైలేష్.. బాలీవుడ్ లోనూ ‘హిట్‘ను రీమేక్ చేశాడు. అయితే.. ఇప్పుడు ‘హిట్‘ ఫ్రాంచైస్ నుంచి బయటకు వచ్చి తొలిసారి శైలేష్ చేసిన మూవీ ‘సైంధవ్‘. ‘హిట్‘ సిరీస్ లో ఆద్యంతం సస్పెన్స్ ను మెయిన్ టెయిన్ చేస్తూ ఆడియన్స్ కు థ్రిల్ కలిగించడమే మెయిన్ మోటో. కానీ.. ‘సైంధవ్‘ విషయం వేరు. ఈ సినిమాని ఎమోషన్ తో కూడిన ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మొదలుపెట్టాడు. అయితే.. ‘హిట్‘ సిరీస్ తో మర్డర్ మిస్టరీలను చేధించడంలో సక్సెస్ అయిన శైలేష్.. ‘సైంధవ్‘ వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ ను సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు.

వెంకటేష్ ను ఊర మాస్ అవతార్ లో ప్రెజెంట్ చేద్దామనుకున్నా.. ఎలివేషన్స్, మాస్ డైలాగ్స్ పెట్టినా.. అంతగా వర్కవుట్ అవ్వలేదు. అరుదైన వ్యాధి నయం కావాలంటే రూ.17 కోట్ల ఇంజెక్షన్‌ చేయాలన్న కాన్సెప్ట్‌ కొత్తగా వున్నా.. ఆ పెయిన్ ను ఆన్ స్క్రీన్ పై ఆవిష్కరించడంలో పూర్తిస్థాయిలో సఫలీకృతుడు కాలేకపోయాడని చెప్పొచ్చు.

ఫస్టాఫ్ స్లోగా ఉంది. అయితే.. టువార్డ్స్ ఇంటర్వెల్ కొంచెం పికప్ అయినా.. సెకండ్ హాఫ్ లో మళ్లీ నిరాశే ఎదురవుతోంది. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నా.. కొన్ని సందర్భాల్లో అవి ఓవర్ డోస్ అయ్యాయనిపిస్తుంది. సినిమాలో ఎక్కువ పాత్రలు ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ అన్నీ ఆడియన్స్ కు పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తాయి. చాలా పాత్రలు అసంపూర్ణంగా కనిపిస్తాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
వెండితెరపై ఎలాంటి పాత్రనైనా పోషించగల నటుడు వెంకటేష్. ఈ సినిమాలో కూతురు ప్రాణం కోసం తల్లడిల్లే పాత్రలో వెంకీ ఒదిగిపోయాడు. అలాగే.. యాక్షన్ సీక్వెన్సెస్ లోనూ ఇరగదీశాడు. అయితే.. సరైన కథ లేకపోవడంతో ఆయన ఎంత చేసినా.. ఆడియన్స్ కు అంతగా కనెక్ట్ అవ్వదు. వెంకటేష్ తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సిన పాత్రల్లో నవజుద్దీన్ సిద్ధిఖీ పోషించిన రోల్ ఒకటి. ఈ మూవీలోని వికాస్ క్యారెక్టర్ లో నవజుద్దీన్ ఒదిగిపోయిన తీరు బాగుంది. ఇంకా.. బేబి సారా, శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా, రుహానీ, ఆర్య వారి పాత్రల పరిధి మేరకు నటించారు.

డైరెక్టర్ కాకుండా మిగతా టెక్నికల్ పార్ట్ విషయానికొస్తే.. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. పాటల విషయంలో పెద్దగా అతని ప్రతిభ కనిపించకపోయినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాత్రం కొన్ని సన్నివేశాల్లో సంతోష్ నారాయణన్ మ్యాజిక్ చేశాడు. మణికందన్ సినిమాటోగ్రఫీ ఓ.కె.. నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ వేల్యూస్ ఫర్వాలేదనిపిస్తాయి. మొత్తంగా.. వెంకటేష్ ను యాక్షన్ అవతార్ లో చూపించాలనుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను ప్రయత్నం బాగున్నా.. ఆకట్టుకోని కథనం, కొరవడిన భావోద్వేగాలతో అది పూర్తిస్థాయిలో ఫలించలేదు.

Related Posts