ఈ పండగ పర్వదినాన ఆ ముగ్గురునీ స్మరించుకుందాం

నేడు (జనవరి 14) ఈ పండగ పర్వదినమే.. తెలుగు చిత్ర పరిశ్రమలోని దిగ్గజ నటులైన శోభన్ బాబు, రావు గోపాల రావు జయంతి. అలాగే.. రచయితగా, దర్శకుడిగా తెలుగుదనాన్ని ఇనుమడింపజేసే చిత్రాలను అందించిన జంధ్యాల జయంతి కూడా. ఈ సందర్భంగా.. ఆ మహా నటులు, దర్శకుడిని ఓ సారి గుర్తుచేసుకుందాం.

నటభూషణుడు శోభన్ బాబు
నటభూషణుడు, ఆంధ్రా అందగాడు, సోగ్గాడు.. ఇలా ఎన్నో పేర్లతో సినీ అభిమానులు పిలుచుకునే శోభన్ బాబు కృష్ణాజిల్లా చిననందిగామాలో పుట్టారు. సినీ జీవితాన్ని తామరాకు మీద నీటి బొట్టులా గడిపిన తాత్వికుడు శోభన్. గీతలో చెప్పినట్టు దైన్యం లేని బతుకు.. కష్టం లేని మరణం.. దక్కించుకున్న అదృష్టవంతుడు శోభన్ బాబు.

ఆదివారాలు మేకప్ వేసుకోనని.. సాయంత్రం ఆరు గంటల తర్వాత షూటింగ్ చెయ్యనని కండిషన్స్ పెట్టిన తొలి హీరో శోభన్. పొగరని విమర్శించినా లెక్కచెయ్యలేదు. శోభన్ అలవర్చుకున్న తాత్విక దృక్పధం వీటన్నింటికీ అతీతంగా నిలబెట్టింది. ఎన్నటికీ ప్రేక్షకుల మనసులో అందాల హీరోగా ఉండిపోవాలని భావించిన శోభన్ బాబు 220 పైగా చిత్రాలలో నటించి 1996లో విడుదలైన ‘హలో.. గురూ’ చిత్రంతో తన 30 ఏళ్ల నటజీవితానాకి స్వస్థి చెప్పారు.

రంగస్థలం నుంచి ఎదిగిన రావు గోపాలరావు
తెలుగు సినిమా విలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు. ప్రత్యేకమైన మాడ్యూలేషన్ తో గోపాలరావు చెప్పే డైలాగ్స్.. ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. ‘ముత్యాలముగ్గు’ చిత్రం బాపు-రమణల నిర్మాణ ప్రతిభకు ఓ మైలు రాయైతే, రావు గోపాలరావుకు ఓ కలికితురాయి. ‘వేటగాడు’ సినిమాలో ప్రాసతో కూడిన పెద్దపెద్ద డైలాగులు, వింతైన విలనీతో ఆ సినిమాకే ఒక ప్రత్యేకత కట్టబెట్టారు. ‘మనవూరి పాండవులు’ సినిమాలోని గోపాలరావు విలనీ మరో రకమైన ప్రత్యేకతను సంతరించుకుంది. ‘గోపాలరావు గారి అమ్మాయి’ సినిమా ఆయన పేరుతోనే రావడం రావు గోపాలరావు కు సినిమా రంగంలో వున్న ప్రత్యేకతను తెలియజేసింది.

హాస్య బ్రహ్మ జంధ్యాల
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అంటారు జంధ్యాల. నాటక రంగంలో జంధ్యాలకి ఉన్న అసక్తి ఆయనని సినిమారంగం వైపు అడుగులు వేయించింది. అలా చిత్ర రంగంలోకి రచయితగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. దర్శకుడిగానూ పదుల సంఖ్యలో చిత్రాలను రూపొందించారు. తెలుగు సినిమా పరిశ్రమకి బ్రహ్మానందం, నరేష్, సుత్తి వీరభద్రరావు, సుత్తి వేలు వంటి గొప్ప నటులను అందించారు.

Related Posts