తోడేలు మూవీ రివ్యూ

హిందీలో భేడియా పేరుతో రూపొందిన చిత్రాన్ని తెలుగులో తోడేలుగా డబ్ చేసి విడుదల చేశాడు సీనియర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. అంతకు ముందే కాంతార మూవీ డబ్బింగ్ ఓ బ్లాక్ బస్టర్ అందుకున్న అరవింద్ ఈ మూవీతోనూ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడు అనుకున్నారు. అందుకు తగ్గట్టుగా ఫర్వాలేదనిపించేలా ప్రమోషన్స్ చేసి వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లోనే విడుదల చేశారు. థియేటర్స్ ఉన్నాయి కాబట్టి నంబరింగ్ ఓకే.. మర కంటెంట్ ఎలా ఉందీ అంటే ఈ బ్రీఫ్ రివ్యూలో చూద్దాం.
కథ :
భాస్కర్(వరుణ్‌ ధావన్) ఓ పెద్ద కన్ స్ట్రక్షన్ కంపెనీకి రోడ్ అప్రూవల్ చేయిస్తానని డబ్బులు తీసుకుని హామీగా తన తాత ఇల్లు కూడా రాసి ఇస్తాడు. అతను రోడ్ వేయించాల్సింది.. అరుణాచల్ ప్రదేశ్ లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న జిరో అనే ఏరియాలో. తన ఫ్రెండ్ జనార్ధన్( అభిషేక్ బెనర్జీ)తో కలిసి అరుణాచల్ వెళతాడు. అక్కడ వారికి మరో స్నేహితుడు గైడ్ గా ఉంటాడు. అంతా కలిసి ఆ అడవి మధ్య నుంచి రోడ్ వేసేలా స్థానిక అధికారులకు లంచం ఇచ్చి ఒప్పిస్తారు. అందుకు గిరిజనులు ఒప్పుకోరు. వారిని ఒప్పించే క్రమంలో ఓ రోజు మద్యం తాగి అడవి గుండూ వెళుతుండగా.. కార్ చెడిపోతుంది. అప్పుడే భాస్కర్ ను ఓ తోడేలు తరుముతుంది. తప్పించుకునే క్రమంలో ఉండగానే అది అతన్ని కరుస్తుంది. తర్వాత ఆ విషయం చెబితే అదో వైరస్ లా భావించి ఊరి నుంచి తరిమేస్తారని.. లోకల్ గా ఉండే పశువుల డాక్టర్ అనిక(కృతి సనన్) వద్దకు వెళతాడు. తనో ఇంజెక్షన్ వేస్తే అది వికటిస్తుంది. దీంతో భాస్కర్ పగలు మంచిగా ఉన్నా.. రాత్రుళ్లు తోడేలులా మారి కొందరిని చంపుతుంటాడు. మరి ఆ తోడేలు ఇతన్ని ఎందుకు కరిచింది.. అతను ఎవరిని చంపాడు.. తోడేలు నుంచి మళ్లీ మనిషిగా మారాడా లేదా అనేది ఈ చిత్ర కథ.

మామూలుగా తోడేలు కథ అనగానే మనకు 2008లో వచ్చిన ట్విలైట్ మూవీ సిరీస్ గుర్తొస్తుంది. అయితే అది పూర్తిగా రొమాంటిక్ జానర్ లో సాగే సినిమా. ఇది అందుకు భిన్నమైన కథ, కథనాలతో వచ్చిన సినిమా. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఉంటూనే.. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యతను.. మనిషి పట్ల మరో మనిషి చూపించే వివక్షతను ఎండగడుతుంది. ఈ తరహా సినిమాల్లో సీరియస్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కానీ పగలు కామెడీగా ఉన్నా.. రాత్రి తోడేలుగా మారిన హీరో చుట్టూ అతని ఫ్రెండ్స్ తో కామెడీ క్రియేట్ చేశాడు దర్శకుడు. దీంతో సీరియస్ ఇష్యూ సాఫ్ట్ గా వెళుతుంది. కామెడీ డామినేట్ చేస్తుంది. చివరికి అడవిని కాపాడుకోవడానికి జంతువులే ముందుకు వస్తాయి. అందుకోసం ఎంతమందినైనా హతమారుస్తాయి అనే సందేశాన్ని అందిస్తుంది. అయితే చివర్లో వచ్చే మరో తోడేలు ట్విస్ట్ ఆడియన్స్ కు షాక్ ఇస్తుంది. ఎవరూ ఊహించలేని ట్విస్ట్ అది.
ఈ సినిమాలో ప్రకృతి, అడవి ప్రాధాన్యాన్ని చెబుతూనే.. కార్పోరేట్ల కుట్ర వల్ల ప్రకృతి విధ్వంసం ఎలా జరుగుతుందీ అనే పాయింట్ ను ఇన్ డైరెక్ట్ గా చూపించారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మన దగ్గర కనిపిస్తే వారిని చైనీయులు అనో, నేపాలీలు అనో మనం డిస్క్రిమినేట్ చేస్తుంటాం. ఆ విషయంలో వారు పడే ఆవేదనను ఒకే సీన్ తో అద్భుతంగా కన్వే చేశాడు. మీరే మమ్మల్ని చైనీయులు అంటే మేం ఈ దేశ వాసులం అని ఎలా చెప్పుకుంటాం అని హీరో ఫ్రెండ్ తో చెప్పించిన డైలాగ్ ఆలోచింప చేస్తుంది.
ఆర్టిస్టుల పరంగా ఈ పాత్రను పూర్తిగా ఓన్ చేసుకున్నాడు వరుణ్‌ ధావన్. ముఖ్యంగా తను తోడేలుగా మారే క్రమంలో చూపిన నటన అద్భుతం. కామెడీ టైమింగ్ లోనూ అదరగొడతాడు. తర్వాతి ఎక్కువ మార్కులు అతని కజిన్ గా నటించిన అభిషేక్ బెనర్జీకి పడతాయి. మంచి టైమింగ్ తో సినిమా ఆసాంతం సీరియస్ సీన్స్ లో కూడా నవ్వించాడు. కృతి సనన్ ది పరమితమైన పాత్ర. రెగ్యులర్ హీరోయిన్ కాకుండా.. డ్యూయొట్స్ లేకుండా కనిపించే పాత్ర ఇది. ఇతర పాత్రలన్నీ పెద్దగా తెలిసిన మొహాలు కావు. అయినా ఆయా పాత్రల్లో ఆకట్టుకున్నారు.
అరుణాచల్ అంటేనే అందమైన ప్రకృతికి ఆలవాలం. ఈ మూవీ నేపథ్యంగా ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడంతో సినిమా ఆసాంతం ఆ ప్రకృతి సోయగాలు కనువిందు చేస్తుంటాయి. సంగీతం బావుంది. పాటల్లోని పదాలు గజిబిజీగా ఉండటంతో పెద్దగా కనెక్ట్ కావు. ఎడిటింగ్ బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా కనిపిస్తాయి. ముఖ్యంగా త్రీడీలో చూస్తే అనుభూతి పెరుగుతుంది. విజువల్ ట్రీట్ గా ఉంటుంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కూడా సింపుల్ గా నేచులర్ గా ఉన్నాయి. దర్శకుడుగా అమర్ కౌశిక్ కొత్త నేపథ్యం ఎంచుకోకపోయినా.. కొత్తగా చెప్పే ప్రయత్నంలో సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ తరహా కథలను మరీ సీరియస్ గా చెప్పినా డాక్యుమెంటరీ అవుతాయి. దానికి మంచి ఎంటర్టైనింగ్ కోటింగ్ చేసి వదలడంతో అన్ని వర్గాల ఆడియన్స్ కు నచ్చేలా వచ్చిందీ చిత్రం.

చివరగా.. అడవి అనగానే రాజు సింహం అని అదే అడవిని కాపాడుతుంది అనే పాత మాటను తిరగరాశాడు దర్శకుడు. దర్పం వెలగబెట్టే రాజుకన్నా.. కాస్త కరుకుగా ఉన్న తోడేలు వంటివే అడవిని కాపాడుకుంటాయి అనే కోణంలో ఆలోచించాడు. ఇది ఓ రకంగా సంప్రదాయ వాదనను బద్ధలు కొట్టే ప్రయత్నం కూడా అనుకోవచ్చు.

ఫైనల్ గా తోడేలు… మెసేజ్ విత్ ఎంటర్టైన్మెంట్

రేటింగ్ : 2.5/5
– యశ్వంత్ బాబు. కె

Related Posts