ది వారియర్ మూవీ రివ్యూ…

రివ్యూ :- ది వారియర్
తారాగణం :- రామ్, ఆది పినిశెట్టి, కృతిశెట్టి, నదియా, బ్రహ్మాజీ, జయ ప్రకాష్‌ తదితరులు
సంగీతం :- దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ :- సుజిత్ వాసుదేవ్
ఎడిటింగ్ :- నవీన్ నూలి
నిర్మాత :- శ్రీనివాస్ చిట్టూరి
దర్శకత్వం :- ఎన్. లింగుస్వామి
రిలీజ్:- 04.07.2022

కొన్ని సినిమాలపై అంచనాలు అనుకోకుండా పెరుగుతాయి. అందుకు కారణం కాంబినేషన్ కావొచ్చు.. లేదా ఏదైనా ఎక్స్ పర్మెంట్ చేస్తున్నారనేది ముందే తెలియడం వల్ల కావొచ్చు. ఇవీ కాకపోతే కంటెంట్ గురించి ముందే అందరికీ తెలియడమూ ఉంటుంది. ఇలాంటి విషయంతోనే ముందు నుంచీ కాస్త అంచనాలు పెంచిన సినిమా
ది వారియర్. ఈ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ పెరగడానికి కారణం.. కాంబినేషన్. తమిళ్ లో ఒకప్పుడు టాప్ డైరెక్టర్ అనిపించుకున్న లింగుస్వామి.. రామ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కావడమే.. మరి పాటలు, ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో వారియర్ బాక్సాఫీర్ బరిలో విన్నర్ అవుతారనుకున్నారు చాలామంది. సో ఇవాళ విడుదలైన ఈ మూవీ అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం..

కథ:-
రామ్ ఎనర్జిటిక్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో. లింగుస్వామి మాస్ మూవీస్ తీయడంలో ఎక్స్ పర్ట్. ఇలాంటి కాంబోలో సినిమా అంటే కంటెంట్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది కదా.. ? ఆ కంటెంట్ గురించి చూస్తే.. సత్య(రామ్) అనే ఓ యంగ్ డాక్టర్. కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ అవుతాడు. తన కళ్ల ముందే ఓ వ్యక్తిని కొందరు రౌడీలు పొడిచి వెళ్లిపోతారు. తను వెళ్లి ఆ వ్యక్తిని హాస్పిటల్ కు తీసుకువెళ్లి కాపాడతాడు. విషయం తెలిసిన రౌడీలు హాస్పిటల్ కు వచ్చి మరీ చంపేస్తారు. దీంతో సత్య పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. కంప్లైంట్ తీసుకున్న పోలీస్ లు విషయాన్ని ఆ కర్నూలును శాసిస్తున్న రౌడీ గురు(ఆది పినిశెట్టి)కి చెబుతారు. గురు సత్యను చావకొడతాడు. ప్రాణాపాయం నుంచి బయటపడిన సత్య రెండేళ్ల తర్వాత తిరిగి కర్నూలుకు వస్తాడు. అతను ఎలా వచ్చాడు.. వచ్చిన తర్వాత గురు అనే రౌడీని ఎలా అంతం చేశాడు అనేది మిగతా కథ.

విశ్లేషణ :-
హీరోను విలన్ పిచ్చి కొట్టుడు కొడతాడు. అప్పుడు బలహీనుడుగా ఉన్న హీరో కొంత టైమ్ తీసుకుని వచ్చిన విలన్ పై పగ తీర్చుకుంటాడు.. ఇది చదువుతుంటే ఎన్నో సినిమాలు కళ్ల ముందు కదలాడుతున్నాయి కదూ.. యస్.. వారియర్ చూస్తున్నప్పుడు కూడా అదే ఫీలింగ్. ఆ ఫీలింగ్ కూడా నిరాశపడేలాంటి కథ, కథనాలు ఈచిత్రంలో కనిపిస్తాయి. అసలు ది వారియర్ అనే టైటిల్ వినగానే.. ఒక వ్యక్తి వల్ల హింసిచబడుతోన్న జనం.. ఏదో ఒక శక్తి వచ్చి తమనుకాపాడకపోతుందా అని ఎదురుచూస్తుంటే.. వారికోసం వచ్చిన ఒక వ్యక్తి యోధుడులా మారి అందరినీ కాపాడతాడు అని ఊహించుకుంటాం.. టైటిల్ కు నిజంగా జస్టిఫికేషన్ ఇవ్వాలనుకుంటే ఇంచుమించు ఇలాంటి సెటప్పే ఉంటుంది. ఇది రొటీనే అయినా.. కథనంలో జాగ్రత్తలు తీసుకుంటే పనైపోతుంది. ఆ మనిమం జాగ్రత్తలు కూడ ఈ చిత్రంలో కనిపించలేదు. కేవలం విలన్ తనను కొట్టాడన్న కక్షతోనే అతను తిరిగి వచ్చి.. అతనిపై పగ తీర్చుకుంటాడు. దీనికి వారియర్ అన్న టైటిల్ ఎలా సరిపోతుందా అనేది వారికే తెలియాలి. పోనీ ఈ కథైనా బావుందా అంటే లేదు. ఒక డాక్టర్.. విలన్ చేత తన్నులు తిని పోలీస్ అయి వచ్చి చట్ట పరంగా అతన్ని ఎదుర్కోవడం.. ఇంతే. మరి ఒకవేళ హీరో అపోనెంట్ ఏ డాక్టరో లేక లాయరో లేదా ఇంకేదైనా రియల్ ఎస్టేట్ బ్రోకరో అయితే అప్పుడు ఏం చేస్తాడో కానీ.. ఇదో పిచ్చి కథ. అస్సలు ఆకట్టుకోని కథనంతో నడిచే సినిమా.

ఇది రామ్ ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమా. దీంతో ఈ కథపై చాలా అంచనాలున్నాయి. పోలీస్ అంటే ఓ స్ట్రాంగ్ కంటెంట్ కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో రామ్ సగమే పోలీస్. మిగతా సగం డాక్టర్. దీంతో ఈ టైటిల్ లో కనిపించే ఫోర్స్ కథ, కథనంలో కనిపించదు.. కర్నూలు ను శాసిస్తోన్న గురు అనే రౌడీ వల్ల అక్కడి ప్రజలంతా నానా ఇబ్బందులు పడుతుంటారు(అనడమే కానీ ఒక్క బలమైన సీన్ లేదు ఈ విషయంలో). షరా మామూలుగానే పోలీస్ లు, పొలిటీషియన్స్ ఆ రౌడీకి కొమ్ము కాస్తుంటారు. దీంతో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా వారిని ఖతం చేస్తాడు గురు. అలాంటి నగరంలోకి డాక్టర్ గా వచ్చిన సత్య పాత్ర మొదట క్లాస్ గా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌ లో అసలు కథంటూ ఏం కనిపించదు. డాక్టర్ సత్యగా రామ్ ఎప్పట్లానే ఎనర్జిటిక్ గా కనిపించాడు. ఆర్జే విజిల్ మహాలక్ష్మితో పరిచయం, ప్రేమ, వారి మధ్య కెమిస్ట్రీ అన్నీ ఓ మంచి లవ్ స్టోరీ చూస్తోన్న ఫీలింగ్ ఇస్తాయి. తన కళ్ల ముందే జరిగిన హత్యా ప్రయత్నాన్ని ఓ డాక్టర్ గా, బాధ్యత గల యువకుడుగా అడ్డుకుని కాపాడతాడు. అది అతని కుటుంబం పైనా ప్రభావం చూపిస్తుంది. గురు బయపెడతాడు. సత్య భయపడడు. దీంతో గురు సత్యను డైరెక్ట్ గానే అటాక్ చేసి కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద విపరీతంగా కొడతాడు. కనీసం ప్రతిఘటించలేని డాక్టర్ సత్య ఆల్మోస్ట్ చావు దగ్గరకు వెళ్లి ఊరి నుంచే పారిపోతాడు.
గురును ఎదిరించాలంటే చట్ట పరంగానే సాధ్యం అని డాక్టర్ కోట్ తీసి సివిల్స్ చదివి పోలీస్ అవుతాడు. రెండేళ్ల తర్వాత డిఎస్పీగా కర్నూల్ కే వస్తాడు. ఓ డాక్టర్ లాగా పేషెంట్ కు ఆపరేషన్ చేసేముందు బిపి, షుగర్ ను కంట్రోల్ చేయాలి అన్నట్టుగా గురు బలాన్ని తగ్గిస్తుంటాడు. కానీ ఈ సీన్స్ అంత గొప్పగా అనిపించవు. హీరో కోసమే ఇక సినిమా అంతా అన్నట్టుగా నడుస్తుంటుంది తప్ప. ఇద్దరి మధ్య రేస్ అంటూ ఏం ఉండదు. అయితే ఫస్ట్ హాఫ్‌ లో రామ్ తో అతని సిస్టర్(శరణ్య ప్రదీప్)ను బెదిరించే లారీల సీన్ అదిరిపోయింది. అలాగే సెకండ్ హాఫ్ లో కృతిశెట్టిన కిడ్నాప్ చేసినప్పుడు సీన్ చాలా బావుంది.

డాక్టర్ లో కనిపించే సాఫ్ట్ నెస్, పోలీస్ లో కనిపించాల్సని రఫ్ నెస్ ను బాగా ప్రెజెంట్ చేశాడు రామ్. విజిల్ మహాలక్ష్మిగా కృతిశెట్టి బాగా నటించింది. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలాబావుంది. రామ్ మదర్ పాత్రలో నదియా కనిపించింది. తనకు ఇది రెగ్యులర్ పాత్రే. అయితే సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గురుగా నటించిన ఆది పినిశెట్టి గురించి. పాత్రలోని క్రూరత్వాన్ని బాగా పలికించాడు. సినిమాలో ఫస్ట్ ఫైట్ అతనిదే. ఓ రకంగా కొన్ని సన్నివేశాల్లో రామ్ కూడా ఆది ముందు తేలిపోయాడనే చెప్పాలి. ఆది నటన చూస్తే రంగస్థలంలో కుమార్ గా అంత సాఫ్ట్ గా నటించింది ఇతనేనా అనిపిస్తుంది. బ్రహ్మాజీకి ఇది రొటీన్ రోల్.

టెక్నికల్ గా సినిమా హై స్టాండర్డ్స్ లో ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంలోని పాటలన్నీ చాలా బావున్నాయి. నేపథ్య సంగీతం ఎక్స్ లెంట్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా కనిపిస్తుంది. ఎడిటింగ్ బావుంది. కాస్ట్యూమ్స్, సెట్స్, ఆర్ట్ వర్క్ అన్నీ బాగా కుదిరాయి. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ లో మెరుపులేం లేవు. దర్శకుడుగా లింగుస్వామి ఎంచుకున్న కథ మరీ కొత్తదేం కాదు. కథనంపైనా కాస్త ఎక్కువ దృష్టి పెట్టి ఉండాల్సింది అనిపిస్తుంది. వారియర్ టైటిల్ ను జస్టిఫై చేసినట్టుగా కాక కేవలం వ్యక్తిగత కక్షలతోనే కథనం నడిచినట్టుగా ఉంది. చాలా డ్రా బ్యాక్స్ ఉన్నాయి. అయినా ఈ వారం మాస్ మూవీస్ పెద్దగా లేవు కాబట్టి.. కమర్షియల్ గా ఈ వారియర్ ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

ఫైనల్ :- ది వారియర్ వల్ల నిర్మాతలకు వర్రీనే

రేటింగ్ :- 2.5/5

యశ్వంత్ బాబు.

Related Posts