‘నా సామిరంగ’ రివ్యూ

నటీనటులు: నాగార్జున అక్కినేని, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మీర్నా మీనన్, రుక్సర్ ధిల్లాన్, షబీర్ కల్లరక్కల్, రవివర్మ, నాజర్, రావు రమేష్, మధుసూదన్ రావు తదితరులు
సినిమాటోగ్రఫి: శివేంద్ర దాశరధి
ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్
సంగీతం: ఎంఎం కీరవాణి
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
దర్శకత్వం: విజయ్‌ బిన్ని
విడుదల తేదీ: 14-01-2024

గత సంక్రాంతి సీజన్లలో ‘సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు‘ వంటి సూపర్ హిట్స్ అందుకున్న నాగార్జున ఈ సంక్రాంతి కానుకగా ‘నా సామిరంగ‘ సినిమాతో వచ్చాడు. సంక్రాంతి బరిలో అసలు సిసలు కలర్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా బరిలోకి దిగింది ‘నా సామిరంగ‘. నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ నటించడం.. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూర్చడం వంటి ఎన్నో అంచనాలతో ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘నా సామిరంగ‘ ఎలా ఉంది? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.

కథ
ఈ సినిమా కథంతా పీరయడ్ నేపథ్యంలో సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో కిష్టయ్య (నాగార్జున), అంజి (అల్లరి నరేష్) ఒకే తల్లికి పుట్టకపోయినా.. సొంత అన్నాదమ్ములుగా కలిసి ఉంటారు. వీరికి పెద్దయ్య (నాజర్) అంటే పరమ భక్తి. పెద్దయ్య కూడా కిష్టయ్య ను సొంత కొడుకుగా చూసుకుంటాడు. కిష్టయ్య చిన్న వయసులోనే వరాలు (ఆషికా రంగనాథ్‌)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది. కానీ వరాలు తండ్రి వరదరాజులు (రావు రమేష్) తన కూతుర్ని పెద్దయ్య కొడుకు దాసు (షబ్బీర్)కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. మరి.. కిష్టయ్య, వరాలు ప్రేమ ఫలించిందా? పెద్దయ్య ఎటువైపు ఉన్నాడు? ఈమధ్యలో అంజి ఏం చేశాడు? అసలు రాజ్ తరుణ్ పాత్రేంటి? వంటి విశేషాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
‘నా సామిరంగ‘ సినిమా మలయాళం చిత్రం ‘పొరింజు మరియమ్ జోస్‘కి రీమేక్. ఒరిజినల్ లో పొరింజు పాత్రను నాగార్జున చేస్తే.. మరియమ్ పాత్రలో ఆషిక రంగనాథ్.. జోస్ క్యారెక్టర్ లో అంజి నటించారు. ముగ్గురు మిత్రుల కథాంశమైన ఈ సినిమాని డైరెక్టర్ విజయ్ బిన్ని అచ్చమైన తెలుగు కథగా మార్చాడు. మలయాళం సినిమా చూసిన వారికి తప్పితే.. ఈ చిత్రం ఓ రీమేక్ మూవీ అని అనిపించదు. అంతలా ఈ సినిమాకి నేటివిటీ టచ్ ఇచ్చాడు డైరెక్టర్ విజయ్ బిన్ని.

స్నేహం, ప్రేమ, వినోదం, విరోదం వంటి అన్ని అంశాలతో వండిన ఫక్తు కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. కిష్టయ్య, అంజి పాత్రల మధ్య వచ్చే స్నేహ మాధుర్యాన్ని తెలిపే సన్నివేశాలు.. కిష్టయ్య, వరాలు మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. యాక్షన్ ఎపిసోడ్స్, పాటలు కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అయితే.. కొత్తదనం లేని కథ, నెమ్మదిగా సాగే కథనం అక్కడక్కడా కాస్త ఇబ్బంది పెడతాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
‘సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు‘ సినిమాలతో ఈతరంలో పల్లెటూరి పాత్రలకు కేరాఫ్ గా నిలిచాడు కింగ్. ‘నా సామిరంగ‘ చిత్రంలోనూ అదే తరహా లుక్ తో అదరగొట్టాడు. నాగార్జున స్నేహితుడిగా నటించిన అల్లరి నరేష్ కి.. కాస్త గ్యాప్ తర్వాత దక్కిన హుషారైన పాత్ర ఇది. అయితే.. ఈ క్యారెక్టర్ లో కేవలం ఫన్ మాత్రమే కాదు.. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి.

కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలుగులో డెబ్యూ మూవీ ‘అమిగోస్‘తోనే అందరినీ ఆకర్షించిన ఆషిక.. ఈ సినిమాలో తన మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంటుంది. నాజర్, రాజ్ తరుణ్, మీర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ తమ పాత్రల పరిధి మేరకు మెప్పిస్తారు.

Related Posts