వ్యక్తిగత విమర్శలు చేసే నేతలకు ప్రజలే బుద్దిచెప్పాలి : పద్మవిభూషణ్‌ చిరు

కళకు రాజకీయాలతో సంబంధం లేదు. కళను రాజకీయ చట్రంలో ఇరికించకుండా.. కళాకారులను గౌరవించే సంస్కృతి, ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నమే జరిగింది తెలంగాణాలో. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన పద్మ పురస్కారాలు అందుకున్న తెలుగు వారిని సత్కరించుకున్నారు.
పద్మ విభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిలతో పాటు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్ సోమ్ లాల్, కూరెళ్ల విఠలాచార్యలకు సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు.


ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక నంది అవార్డుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధకలిగించిందన్నారు. ఇప్పుడు తెలంగాణలో నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇవ్వబోతున్నట్టు సీఎం ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు చిరంజీవి. వాస్తవానికి పద్మభూషణ్‌ అవార్డ్ వచ్చినపుడు కలిగిన ఆనందం పద్మవిభూషణ్‌ వచ్చినపుడు అంతగా కలగలేదన్నారు. అయితే ప్రజలు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, ప్రభుత్వాలు అభినందనలు తెలిపినపుడు మాత్రం ఎంతో ఉద్వేగానికి గురయ్యానన్నారు మెగాస్టార్.


రాజకీయాల గురించి కూడా ప్రస్తావించారు చిరు. శ్రీ వెంకయ్యనాయుడు గారి హయాంలో రాజకీయాలు చాలా హుందాగా ఉండేవని, మాజీ ప్రధాని వాజ్‌పేయి గారికున్నంత హుందాతనం వెంకయ్యనాయుడుగారిలో చూసానని తెలిపారు చిరు. ప్రస్తుత రాజకీయాల్లో దుర్భాషలు పెరిగిపోయానని, వ్యక్తిగత విమర్శలతో కలుషితం అయ్యాయని అలాంటి వాతావరణానికి తట్టుకోలేకే తాను వెనుదిరిగినట్టు చెప్పారు చిరంజీవి. దుర్భాషలతో , వ్యక్తిగత విమర్శలు చేసే నాయకులకు ప్రజలే ఓటు ద్వారా బుద్ది చెప్పాలని కూడా పిలుపునిచ్చారు చిరు.
అన్నయ్యా మీకోసం ప్రాణమిస్తామనే అభిమానులు కోట్లాది మంది ఉన్నారు. ప్రాణం వద్దు ఆపదలో ఉన్నవారికి మీ రక్తం ఇవ్వండనీ.. ఆపన్నులను కాపాడే సదుద్దేశ్యంలో బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసి ఆ సేవలో అభిమానులను భాగస్వాములను చేసానని చెప్పారు చిరంజీవి. యువకుల శక్తి కటౌట్లు, పాలాభిషేకాలతో దుర్వినియోగం కాకూడదని సేవాభావంతో పునీతులవ్వాలనీ ఈ విషయంలో తన అభిమానుల పట్ల గర్వంగా ఉన్నానన్నారు చిరు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు, కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంకు లాంటి సేవా కార్యక్రమంలు చేయడానికి తనకు అభిమానులు చాలా సహకరించారని చిరు గుర్తుచేసుకున్నారు.


శనివారం రాత్రి మెగాస్టార్ ఇంట్లో సినీ, రాజకీయ ప్రముఖులకు ఉపాసన సమక్షంలో చిరంజీవికి సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related Posts