ఏపీ టికెట్ రేట్లపై చివరి నిర్ణయం తేలేది ఆ రోజే

క‌రోనా మ‌హ‌మ్మారి టాలీవుడ్ ని కుదిపేసింది. క‌రోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అనుకుంటుంటే.. ఏపీలో టిక్కెట్ల రేట్లు త‌గ్గించ‌డంతో టాలీవుడ్ పై మ‌రో పిడుగు ప‌ట్టిన‌ట్టు అయ్యింది. సినిమా టిక్కెట్ల రేట్ల‌ను త‌గ్గిస్తూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం జీవో 35 జారీ చేసింది. ఈ జీవోనే పెద్ద వివాద‌స్ప‌దం అయ్యింది. ఈ జీవోను సమర్థించే ఒక వర్గం జగన్ వెంట నడుస్తుంటే.. ప్రత్యర్థి వర్గం కోర్టులకు వెళ్లింది. అయితే.. సవరించిన ధరలు సరికాదని పాత ధరలు కొనసాగించుకోమని సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చింది.

ఆత‌ర్వాత ఈ పంచాయితీ డివిజన్ బెంచ్ కు వెళ్లింది. అక్కడ రకరకాల మలుపుల అనంతరం టికెట్ ధరల అంశం పై జాయింట్ కలెక్టర్ ముందు ప్రతిపాదనలు ఉంచాలని కోరడం తెలిసిందే. అనంతరం ఒక కమిటీని వేసి దీని పై పరిశీలిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కమిటీ వేసినట్టు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వెల్లడించారు. ఈ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది.
అయితే అంతిమంగా టికెట్ ధరల పై ఈ కమిటీ ఏదో ఒకటి తేల్చాల్సి ఉండగా.. కీలక సమావేశాన్ని ఫిబ్రవరి 10 నాటికి వాయిదా వేసింది. ప్రస్తుతానికి బంతి ఈ కమిటీ చేతిలోనే ఉంది.

హీరోల రెమ్యూన‌రేష‌న్స్ భారీ స్థాయిలో ఉంటున్నాయి. వాటిని త‌గ్గించుకుంటే.. బ‌డ్జెట్ త‌గ్గుతుంది. అప్పుడు త‌క్కువ ధ‌ర‌కే టిక్కెట్లు అమ్మ‌చ్చు.. జ‌నాల్ని బాగా థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌వ‌చ్చు అనేది ప్ర‌భుత్వం వాద‌న‌. దీనికి ప‌రిశ్ర‌మ పెద్ద‌లు స‌సేమీరా అంటున్నారు. మొత్తానికి ఫిబ్ర‌వ‌రి 10 ఏం తేల్చ‌నున్నారు అనేది టెన్ష‌న్ గా మారింది. పాత ధ‌ర‌ల‌నే తీసుకువ‌స్తారా..? లేక టిక్కెట్ల రేట్లు త‌గ్గిస్తారా..? ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి.

Related Posts