ఆదిపురుష్‌ కు అద్భుతమైన అవకాశం

భారతీయ ఇతిహాసాల నేపథ్యంలో వచ్చిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణే ఉంటుంది. కాకపోతే ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండా కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఒకప్పుడు ఏ గ్రాఫిక్స్ లేకపోయినా అద్భుతమైన ఇతిహాస కథలను వెండితెరపై చూపించారు మేకర్స్. ఇప్పుడు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో అదనపు సౌకర్యాలు కూడా రావడంతో మరింత జనరంజకంగా మారుతున్నాయి. అలా వస్తోన్న చిత్రమే ఆదిపురుష్‌.

రామాయణంలోని కొన్ని కీలక ఘట్టాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడుగా కృతి సనన్ సీతగా నటించింది. ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.


మొదట ఆదిపురుష్ పై నెగెటివ్ ప్రచారం సాగింది. దాన్ని దాటుకుని ట్రైలర్ తో పాటు పాటలు విడుదల చేసిన తర్వాత ఒక్కసారిగా అంచనాలు మారాయి. ఇక తిరుపతి ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాకు భారీ హైప్ వచ్చింది. దాన్ని అందుకునేందుకు ఆదిపురుష్‌ కు ఇప్పుడు అద్భుతమైన అవకాశాలున్నాయి.

కొన్నాళ్లుగా ఇండియాలోని ఏ పరిశ్రమలో కూడా సరైన బ్లాక్ బస్టర్స్ లేవు. ఇక ఈ సమ్మర్ లో కూడా పెద్ద హీరోల సినిమాలేవీ రాఏలదు. ప్రేక్షకులు ఓ సరైన సినిమా కోసం మొహం వాచిపోయి ఉన్నారనే చెప్పాలి. ఈ టైమ్ లో వస్తోన్న ప్రభాస్ సినిమా ఫీస్ట్ లా ఉంటుందని చెప్పొచ్చు.

మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్ కు, కాలేజెస్ కు శెలవులు కూడా పొడిగించారు. దీంతో పాటు ప్రస్తుతం దేశంలో ఈ తరహా చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఆ ట్రెండ్ కే ఆదిపురుష్‌ పీక్స్ లో కనిపిస్తుంది. అందువల్ల దేశవ్యాప్తంగా ఉన్న కోట్లమంది సినిమా టాక్ తో సంబంధం లేకుండా వెండితెరపై సీతారాముల కథను వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇదే కాక ఈ తరహా చిత్రాలకు వయో భేదం కనిపించదు. అంటే ప్రభాస్ కోసం కుర్రకారు తరలి వచ్చినట్టే ప్రభాస్ లో రాముడిని చూసుకోవడానికి వృద్ధులు కూడా కుటుంబాలతో సహా కదలి వస్తారు.

ఓ రకంగా ఇది పూర్తిగా ఫ్యామిలీ పిక్చర్. ఈ పిక్చర్ కు భక్తి తోడవుతుంది కాబట్టి ఆదిపురుష్ కలెక్షన్స్ పరంగానూ, రికార్డుల పరంగానూ చరిత్ర సృష్టించేందుకు అద్భుతమైన అవకాశం సంపాదించినట్టే. ఓ రకంగా లేట్ అయినా లేటెస్ట్ గా అంటాం కదా అలా ఇక ఆదిపురుష్ కు అన్నీ మంచి శకునములే అన్నమాట.

Related Posts