Teddy : అల్లు శిరీష్‌ భలే కథతో వస్తున్నాడుగా

అల్లు ఫ్యామిలీలో అర్జున్ తర్వాత శిరీష్‌ కూడా హీరోగా నిలబడే ప్రయత్నం చేశాడు. బట్ అన్నను ఆదరించినట్టుగా ఆడియన్స్ తమ్ముడిని ఆదరించలేదు. అంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. అరవింద్ కూడా చిన్నోడిని స్టార్ ను చేయలేకపోయాడు. 2013లో గౌరవం అనే వైవిధ్యమైన కథతో హీరోగా పరిచయం అయిన శిరీష్‌ .. ఇప్పటి వరకూ ఏడు సినిమాలు చేశాడు. వీటిలో ఒకటి మళయాల చిత్రం కూడా ఉంది. చివరగా ఊర్వశివో రాక్షసివో అనే చిత్రంతో ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాడు.

బట్ ఆ ఊపును కంటిన్యూ చేయడంలో మాత్రం ఫెయిల్అయ్యాడు. కొన్నాళ్లుగా అసలు ఏ సడీ చప్పుడూ లేకుండా ఉన్న ఈ అల్లువారి అబ్బాయ్ సడెన్ గా తన ” బడ్డీ” తో కలిసి ప్రత్యక్షమయ్యాడు. బడ్డీ అనేది అతని కొత్త సినిమా పేరు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి వీడియో గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ఎవరూ ఊహించకుండా ఉండటం విశేషం.


” ఓ డాన్ లాంటి మనిషి. ఎదురుగా చాలామంది రౌడీస్ ఉంటారు. వారికి ఓ టెడ్డీ బేర్ ను చంపే బాధ్యత ఇస్తాడు. ముందు వాళ్లంతా ఆ టెడ్డీ బేర్ బొమ్మను చూసిన నవ్వుకుంటారు. కానీ అతను ఆఫర్ చేసిన అమౌంట్ చూసి ఆశ్చర్యపోయి ఆ బొమ్మను చంపేందుకు ఒప్పుకుంటారు. ఓ లోకల్ ట్రైన్ లో వెళుతున్న టెడ్డీని చంపే ప్రయత్నం చేస్తుండగా.. ఆ టెడ్డీకి బెస్ట్ బడ్డీ అయిన కుర్రాడు వచ్చి వాళ్లందరినీ చితక్కొడతాడు. కట్ చేస్తే.. ఆ డాన్ లాంటి పర్సన్ ఇంకెవరికో ఫోన్ చేసి సిటీలో ఉన్న మనవాళ్లందరినీ రమ్మని కబురు చేస్తాడు. ఓ బొమ్మను చంపడానికి అంతమంది ఎందుకు అంటే దాని వెనక ఒకడున్నాడు అంటాడు.. ” అదే శిరీష్‌.


ముందు ఈ మూవీ పోస్టర్ చూసిన కోలీవుడ్ లో వచ్చిన టెడ్డీకి రీమేక్ అనుకున్నారు. కానీ అలా కనిపించడం లేదు. ఇంకా విశేషం ఏంటంటే.. ఈ చిత్రం తీస్తున్నది మొత్తం కోలీవుడ్ వాళ్లే.
తమిళ్ లో భారీ చిత్రాలు తీస్తారనే పేరున్న స్టూడియో గ్రీన్ సంస్థ వాళ్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకుడు. శిరీష్‌ తో పాటు అజ్మల్ ఆమిర్, ప్రిషా రాజేశ్ సింగ్, ముఖేష్ కుమార్, అలీ తదితరులు నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలు త్వరలోనే రానున్నాయి.

Related Posts