‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ రివ్యూ

నటినటులు:సుహాస్, శివాని, నితిన్ ప్రసన్న. శరణ్య ప్రదీప్
దర్శకత్వం:దుష్యంత్ కటికనేని
నిర్మాత: ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి, బన్నీ వాస్ (సమర్పకుడు), వెంకటేష్ మహా (సమర్పకుడు)
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ:వాజిద్ బేగ్
విడుదల తేదీ: 02-02-2024

షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఫీచర్ ఫిల్మ్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుహాస్.. కమెడియన్ గా మంచి రోల్స్ చేశాడు. కేవలం కమెడియన్ గానే పరిమితం కాకుండా ‘హిట్: ది సెకండ్ కేస్’లో నెగటివ్ రోల్ లోనూ దుమ్మురేపాడు. ఇప్పుడు హీరోగా తన కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. ‘కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్‘ సినిమాలతో హీరోగా విజయాలందుకున్న సుహాస్ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘తో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి.. ఈ మూవీతో సుహాస్ హీరోగా హ్యాట్రిక్ కొట్టాడా? ఈ సినిమా ఆడియన్స్ ను ఏరీతిన అలరించబోతుంది? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
అంబాజీపేట అనే గ్రామంలో కథ మొదలవుతుంది. అక్కడ మల్లి (సుహాస్), పద్మ (శరణ్య ప్రదీప్) కవలలు. మల్లి.. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ట్రూప్ లో మెంబర్ అయితే.. పద్మ స్కూల్ టీచర్. ఇదే గ్రామంలో ధనవంతుడు వెంకట బాబు (నితిన్ ప్రసన్న). ఊరిలో అందరికీ అప్పులు ఇస్తూ.. అందరినీ తన మాట వినేలా చేసుకుంటాడు. వెంకట బాబు చెల్లెలు లక్ష్మీ (శివానీ), మల్లి ప్రేమించుకుంటారు. మరి.. తమకంటే తక్కువ మనుషులని భావించే మల్లి, పద్మ లతో వెంకటబాబు అతని తమ్ముడు శ్రీను బాబు (వినయ్ మహాదేవ్) లకు వివాదం ఏంటి? తమ చెల్లెలు మల్లి ప్రేమలో ఉందని తెలిసి వాళ్లేంచేశారు? అనేదే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ కథ.

విశ్లేషణ:
ఈ కథంతా 2007 నేపథ్యంలో సాగుతుంది. అప్పటి పరిస్థితులను, అప్పటి మనుషులను కళ్లకు కట్టినట్టు చూపిస్తూ కథను నడిపించిన విధానం బాగుంది. ఈ సినిమాలో కులాల పేర్లు అసలు ప్రస్తావించలేదు. కానీ.. కులాల మధ్య అంతరాన్ని మాత్రం తెరపై స్పష్టంగా చూపించాడు డైరెక్టర్ దుశ్యంత్ కటికనేని. ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్ గా మెప్పిస్తే ..సెకండ్ హాఫ్ కొంచెం స్లో గా ఉన్నా కథను బాగా చెప్పాడు దర్శకుడు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు:
‘కలర్ ఫోటో, రైటర్ పద్మ భూషణ్’ తర్వాత ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ నటుడిగా సూహస్ ను మరో మెట్టు ఎక్కించింది. సుహస్ – శరణ్య అక్కతమ్ముళ్లుగా చాలా బాగా నటించారు. తొలుత సాదాసీదా యువకుడిగా, ప్రేమికుడిగా సుహాస్ సహజంగా నటించాడు. తర్వాత అక్క కోసం ఎంత దూరమైనా వెళ్లే తమ్ముడిగా తన నటనలోని ఇంటెన్సిటీని చూపించాడు. గుండు కొట్టించుకుని తన పాత్ర కోసం ఎలాంటి సాహసం చేయడానికైనా తాను సిద్ధమని సుహాస్ నిరూపించాడు.

సెకండాఫ్‌లో పోలీస్ స్టేషన్ సీన్ లో శరణ్య నటనకు మంచి అప్లాజ్ వస్తోంది. హీరోయిన్ శివాని అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా అదరగొట్టింది. ఇక.. ప్రతినాయక పాత్రలో నటించిన నితిన్ ప్రసన్న.. వెంకట బాబు పాత్రకు ప్రాణం పోశాడు.

టెక్నికల్ గా శేఖర్ చంద్ర అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2, దర్శకుడు వెంకటేష్ మహా వంటి వారు ఈ ప్రొడక్షన్ లో భాగస్వాములయ్యారు. అయితే.. కొత్త దర్శకుడితో ,కథకు తగ్గట్టు ఎక్కువమంది తెలుగు నటులతో మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో ఒక మంచి సినిమా తీశాడు నిర్మాత ధీరజ్.

చివరగా :
‘కలర్ ఫోటో, రైటర్ పద్మ భూషణ్’ తరవాత ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ నటుడిగా సూహస్ ను మరో మెట్టు ఎక్కించిందని చెప్పొచ్చు.

TELUGU70MM Rating – 3/5

Related Posts