పవన్ కళ్యాణ్ కి మద్దతు ప్రకటించిన అల్లు అర్జున్

జనసేనాని పవన్ కళ్యాణ్ కి సినీ పరిశ్రమ నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కుటుంబ సభ్యులతో పాటు.. సినీ పరిశ్రమకు సంబంధించిన ఇతర వ్యక్తుల నుంచి పవర్ స్టార్ పొలిటికల్ జర్నీకి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే నాని, సీనియర్ నరేష్, సీనియర్ యాక్టర్ సురేష్ వంటి వారు పవన్ కళ్యాణ్ కి తమ మద్దతు ప్రకటిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

మెగా ఫ్యామిలీ నుంచి యువ కథానాయకులు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయిధరమ్ తేజ్ బాహటంగా పవన్ కళ్యాణ్ కి మద్దతు ప్రకటిస్తూ ప్రచారాన్ని సైతం నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఎక్స్’ వేదికగా పవన్ కళ్యాణ్ కి మద్దతు ప్రకటిస్తూ వీడియోని విడుదల చేసిన విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌ సైతం ‘భవిష్యత్‌ కోసం పాటుపడే నాయకుడు పవన్‌ కల్యాణ్‌ను గెలిపించండి’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

తాజాగా.. మెగా ఫ్యామిలీ నుంచి మిగిలిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం విశేషం. ‘పవన్‌ కళ్యాణ్‌ గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని అల్లు అర్జున్ తన పోస్ట్ లో తెలిపాడు. అలాగే.. ‘పవన్ ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న ఆయన నిబద్ధత పట్ల తాను ఎంతో గర్విస్తున్నానని.. ఒక కుటుంబ సభ్యుడిగా తన ప్రేమ, మద్దతు ఎప్పటికీ పవన్ కే ఉంటాయని’ అల్లు అర్జున్ తన పోస్ట్ లో తెలిపాడు.

మెగా ఫ్యామిలీలోని అగ్ర కథానాయకులు ఇప్పటివరకూ సోషల్ మీడియా వేదికగానే పవన్ కి మద్దతు ప్రకటించారు. మరి.. వీరు కూడా ఈ రెండు రోజుల్లో పవన్ కి మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేస్తారేమో చూడాలి.

Related Posts