మైమరపిస్తోన్న ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’సాంగ్

పది పేజీల సన్నివేశం చెప్పలేని భావాన్ని ఒక్క పేజ్ లో ఉండే పాట చెబుతుంది. కథను నడిపించే పాటలైతే.. ప్రేక్షకులను ఆ సన్నివేశాలతో పాటు తీసుకువెళతాయి. ఇక అవి ప్రేమ పాటలైతే వెండితెరను దాటి మనసు పొరలను కదిలిస్తాయి. హృదయాన్ని మీటి పరవశాన్ని కలిగిస్తాయి. మనసులోతుల్లోని ఎన్నో జ్ఞాపకాలను తట్టిలేపుతాయి. తొలి ప్రేమ తాలూకూ భావనలను మరోసారి ఉప్పొంగేలా చేస్తాయి. అందుకే ఇలాంటి పాటలు టీనేజ్ నుంచి ఓల్డేజ్ వారి వరకూ కట్టిపడేస్తాయి. ప్రేమలోని తీయదనాన్ని చూడని వారు ఉండరు కదా..? ఈ కారణంగానే బేబీ చిత్రంలోని ఓ రెండు ప్రేమ మేఘాలిలా అనే పాట.. విన్నవారందరినీ జ్ఞాపకాల మేఘాలపై తేలియాడేలా చేస్తోంది. ఒక్కసారి కాదు.. రిపీట్ మోడ్ లో పెట్టి అలా వింటూనే ఉండిపోవాలి అనిపించేలా ఉంది.


‘‘ఇద్దరిది ఒకే ప్రయాణంగా.. ఇద్దరిది ఒకే ప్రపంచంగా.. ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది.. మెల్లగా, మెల్లగా … ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా… ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా..’’ అంటూ తొలి యవ్వన ప్రాయపు హృదయ సవ్వడికి అనుగుణంగా.. సందర్భానికి తగ్గట్టుగా అనంతశ్రీరామ్ రాసిన అందమైన ఈ సాహిత్యం విన్నా కొద్దీ వినాలపిస్తూనే ఉంది.
విజయ్ బుల్గానిన్ స్వరపరచగా.. ఆ ట్యూన్ నేరుగా మనస్సుల్లోకే చొచ్చుకపోయేలా సింగర్ శ్రీరామ్ చంద్ర అద్భుతంగా పాడాడు. అతనికి తోడు చిన్న పిల్లల కోరస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనేలా ఉందంటే అతిశయోక్తి కాదు.
ఇలాంటి పాటలు అరుదుగా వస్తాయి. అవి ఆ సినిమా కథలను చెబుతూన మర్చిపోయిన మన ప్రేమకథలనూ గుర్తు చేస్తాయి. కాసేపు ఆ జ్ఞాపకాల జడిలో తడిసిపోతే తప్ప మళ్లీ మనసు తేలిక కాదు. అలా కావాలంటే మళ్లీ మళ్లీ ఈ పాటను వింటూనే ఉండాలేమో..

Related Posts