అక్కినేని అఖిల్, సాక్షి వైద్యం జంటగా మమ్మూట్టి ఓ కీలక పాత్రలో నటించిన సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా దాదాపు రెండేళ్లకు పైగానే చిత్రీకరణ చేసుకుంది. చాలా రిలీజ్ డేట్స్ మారిన తర్వాత ఫైనల్ గా ఈ నెల 28న విడుదల కాబోతోంది. ప్యాన్ ఇండియన్ సినిమాగా వస్తోన్న ఈ మూవీ ప్రమోషన్స్ లో దూకుడు పెంచారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా ట్రైలర్ విడుదల చేసింది మూవీ టీమ్. ఇప్పటికే విడుదలైన పాటలేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ట్రైలర్ తో అంచనాలు పెంచొచ్చు అనుకున్నారు. మరి ఈ ట్రైలర్ అంచనాలను పెంచిందా.. ?


ఏజెంట్ అనే టైటిల్ ను బట్టే ఇదో స్పై థ్రిల్లర్ అని అర్థం అవుతుంది. అయితే ఇప్పటి వరకూ వచ్చిన స్పై థ్రిల్లర్స్ లో హీరో మాగ్జిమం చాలా సీరియస్ గా ఉంటాడు. అతనికి అసమాన ప్రతిభ ఉంటుంది. స్టంట్స్ నుంచి లాంగ్వేజెస్ వరకూ ఏదైనా మ్యానేజ్ చేయగలడు. అఫ్ కోర్స్ రొమాన్స్ లోనూ పట్టు ఉంటుంది. నాటి జేమ్స్ బాండ్ నుంచి రీసెంట్ గా తెలుగులో వచ్చిన గూఢచారి వరకూ ఇదే కనిపించింది. బట్ అందుకు భిన్నంగా ఉన్నాడు ఈ ఏజెంట్. ‘రా’లో పనిచేసే ఓ ఆఫీసర్.. దేశంలోనే అత్యంత పెద్దదైన మాఫియా ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతని వల్ల కాక ఓ పిల్ల హీరోను పంపిస్తాడు. ఆ పిల్ల హీరోనే ఏజెంట్. అయితే అతన్ని పవర్ ఫుల్ మేన్ గా కాక ఆ ఆఫీసర్ ఓ కోతిలా పోల్చాడు. ‘సింహం బోనులోకి వెళ్లి తిరిగి రాగలిగేది కోతి మాత్రమే’ అంటాడు. అంటే హీరో అన్నీ కోతి వేషాలు వేస్తాడు. ఏ మాత్రం సీరియస్ నెస్ ఉండదు అనే కదా అర్థం. పైగా అతనికి గన్స్ అంటే ఇష్టం అన్నట్టుగా చూపించారు. అప్పుడెప్పుడో రెండున్నర దశాబ్దాల క్రితం వచ్చిన సిందూరంలో రవితేజ కూడా ఇలా గన్స్ పిచ్చితోనే నక్సలైట్స్ లోకి వెళతాడు. కానీ అతనికి సిద్ధాంతం తెలియదు. అంటే ఇక్కడా ఏజెంట్ కు తన రా గురించి తెలియదు అన్నట్టుగానే చూపించారు. అసలు టైటిల్ కు తగ్గట్టుగా ఈ హీరో క్యారెక్టరైజేషన్ ట్రైలర్ లో అయితే మచ్చుకు కూడా కనిపించలేదు. ఇక హీరోయిన్ ఫేస్ కూడా రిజిస్టర్ కాకుండానే షాట్ లేపేశారు. మమ్మూట్టి రా ఆఫీసర్ గా బాలీవుడ్ నటుడు డినో మోరియో విలన్ గా నటించాడు. ట్రైలర్ లో ఎక్కువగా గన్నుల మోత, కత్తుల వేట, బుల్లెట్ల వర్షం ఉంది. అయితే ఈ తరహా సినిమా రెండేళ్ల క్రితం అయితే ఎలా ఉండేదో కానీ.. ఇప్పటికే గన్నులు చాలా రొటీన్ అయ్యాయి. బుల్లెట్ల వర్షం బోర్ కొచ్చేసింది. సో.. అవి కాకుండా ఏజెంట్ లో కంటెంట్(ట్రైలర్ లో అయితే కనిపించలేదు) కూడా ఉంటే కాసులు వస్తాయి. లేదంటే లాసులు తప్పవు.

, , , ,