‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్.. డబుల్ డోస్ ఫన్, రొమాన్స్

పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘డీజే టిల్లు’ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో టిల్లుగా ఆన్ స్క్రీన్ పై అమాయకత్వంతో కూడిన క్యారెక్టరైజేషన్.. స్టైల్, రొమాన్స్.. అన్నింటిలోనూ తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ఇప్పుడు ‘డీజే టిల్లు’కి మిన్నగా డబుల్ డోస్ ఫన్, రొమాన్స్ పంచడానికి ‘టిల్లు స్క్వేర్’తో వస్తున్నాడు. లేటెస్ట్ గా ‘టిల్లు స్క్వేర్’ నుంచి వాలెంటైన్స్ డే స్పెషల్ గా ట్రైలర్ రిలీజయ్యింది.

‘డీజే టిల్లు’ తరహాలోనే వినోదాత్మకంగా, టిల్లు శైలి సంభాషణలతో సీక్వెల్ కూడా సాగనుందని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమాలో సిద్ధుకి దీటైన పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించబోతుంది. ఇప్పటివరకూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో మెరిసిన అనుపమ.. ఈ మూవీలో తన బోల్డ్ అవతార్ ని ఆవిష్కరించబోతుంది. మొదటి భాగంలో రాధిక ప్రేమ కారణంగా ఇబ్బందులు కొని తెచ్చుకున్న టిల్లు.. ఇప్పుడు మరోసారి అదే తరహాలో సమస్యల సమూహంలో చిక్కుకున్నట్లుగా ట్రైలర్ లో చూపించారు. అయితే మేకర్స్ కథకి సంబంధించిన విషయాలను ఎక్కువగా వెల్లడించకుండా.. ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించేలా ట్రైలర్ ను వదిలారు.

రామ్ మిరియాల స్వరపరిచిన పాటలు ఇప్పటికే విడుదలై వైరల్ అవుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందిస్తున్నాడు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Related Posts