‘ఖైదీ’ చిత్రానికి 40 ఏళ్లు’

చిరంజీవిని ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత ఖైదీని చేసిన చిత్రం ‘ఖైదీ’. 1983, అక్టోబర్ 28న విడుదలైన ‘ఖైదీ’ ఓ ఫ్రభంజనమే సృష్టించింది. చిరు సినీ కెరీర్ ను మలుపుతిప్పిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో అనతి కాలంలోనే అతను మెగాస్టార్ గా ఎదగడానికి దోహదపడింది.

‘ఖైదీ’ సినిమా కంటే ముందే చిరంజీవికి హిట్స్, సూపర్ హిట్స్ ఉన్నాయి. అప్పటికే ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లైన చిరంజీవి.. 50 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇక హీరోగా ‘న్యాయం కావాలి, ఇంట్లో రామయ్య వీధిల్లో కృష్ణయ్య, శుభలేఖ, అభిలాష’ వంటి విజయాలున్నాయి. అయితే చిరంజీవికి మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరిచిన సినిమా ‘ఖైదీ’.

అసలు సూపర్ స్టార్ కృష్ణ కోసం అనుకున్న కథే ‘ఖైదీ’. కృష్ణ చేయలేకపోయిన ఈ సినిమాని చిరంజీవితో నిర్మించారు సంయుక్త మూవీస్ అధినేతలు ఎమ్.తిరుపతి రెడ్డి, ధనంజయ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి. ఇక.. అప్పటికే చిరంజీవితో పలు సినిమాలు చేసిన కోదండరామిరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. హాలీవుడ్ లో అంతకుముందు సంవత్సరమే ఘన విజయాన్ని సాధించిన సిల్వెస్టరు స్టాలోన్ ‘ఫస్ట్ బ్లడ్’ ప్రేరణతో ‘ఖైదీ’ కథను తీర్చిదిద్దారు పరుచూరి బ్రదర్స్. ‘ఫస్ట్ బ్లడ్’ సినిమాలోని కొన్ని సీన్స్.. కొద్దిమార్పులతో ‘ఖైదీ’లో కనిపిస్తాయి. సినిమాలోని కథానాయకుని ఆహార్యం, రెండవభాగంలో అడవిలో సంఘటనలు ‘ఫస్ట్ బ్లడ్’ను పోలిఉంటాయి.

ఈ సినిమాలో సూర్యంగా చిరంజీవి, మధులతగా మాధవి పాత్రలు శాశ్వతంగా నిలిచిపోయాయి. చక్రవర్తి అందించిన సంగీతం ‘ఖైదీ’ విజయంలో మరో కీలక పాత్ర పోషించింది. ‘రగులుతుంది మొగలిపొద, ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా, గోరంటా పూసింది గొరవంక కూసింది’ గీతాలు ఇప్పటికీ ఎక్కడో ఓ మూల మారుమ్రోగుతూనే ఉంటాయి. వీరభద్రయ్యగా రావు గోపాలరావు, డా.సుజాతగా సుమలత.. ఇంకా రంగనాథ్, చలపతిరావు, నూతన్ ప్రసాద్, రాళ్లపల్లి పోషించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

పారితోషికం పరంగా ఈ సినిమాకి చిరంజీవి లక్షా డబ్బై అయిదు వేలు అందుకున్నాడట. డైరెక్టర్ కోదండరామిరెడ్డి, హీరోయిన్ మాధవి చెరొక నలభై వేలు పుచ్చుకున్నారట. అప్పట్లోనే ఈ సినిమా రూ.8 కోట్లు వసూళ్లు సాధించింది.

‘ఖైదీ’ చిత్రం ఆ తర్వాత కన్నడ, హిందీ భాషల్లో అదే పేరుతో రీమేక్ అయ్యింది. కన్నడలో విష్ణు వర్థన్ హీరో అయితే.. హిందీలో జితేంద్ర హీరోగా నటించాడు. ఈ రెండు భాషల్లోనూ మాధవి హీరోయిన్ గా నటించడం విశేషం. ‘ఖైదీ’ తర్వాత ఇదే పేరుతో చిరంజీవి ఆ తర్వాత ‘ఖైదీ నంబర్ 786, ఖైదీ నంబర్ 150’ సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా విజయాలు సాధించాయి.

Related Posts