‘గయ్యాళి’ గుండమ్మ

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్న నటీమణి సూర్యకాంతం. గయ్యాళి అత్తగా వెండితెరపై సూర్యకాంతం మెప్పించిన తీరును వర్ణించడానికి ఒక గ్రంథం సరిపోదు. ఆరేళ్ళ చిన్న వయసులోనే పాడటం, నాట్యం నేర్చుకున్న సూర్యకాంతం.. సినిమాలలో నటించాలనే కోరికతో చెన్నై చేరారు. జెమినీ వారు తీసిన ‘చంద్రలేఖ’ సినిమాలో డ్యాన్సర్ గా సినీ పరిశ్రమకు ప్రవేశించిన సూర్యకాంతంకు.. ‘ధర్మాంగద, నారద నారది, గృహప్రవేశం’ సినిమాలలో సహాయ పాత్రలు లభించాయి.

చిన్న పాత్రలతో చిత్రరంగ ప్రవేశం
గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరు సూర్యకాంతం… అప్పట్లో సూర్యకాంతం అన్న పేరును తమ అమ్మాయిలకు పెట్టుకోవడానికే జనం భయపడేవారు అంటే.. ఆమె అభినయం ఎంతలా జనం మదిని గెలిచిందో ఇట్టే చెప్పేయవచ్చు.

అలా.. మొదట సూర్యకాంతం గయ్యాళీ పాత్రలకు శ్రీకారం చుట్టిన సినిమా ‘సంసారం’. ఈ సినిమా తర్వాత దశాబ్దాలపాటు సూర్యకాంతం తెలుగు చిత్రసీమలో గయ్యాళి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.

సూర్యకాంతం హాస్యంలో వెర్సటాలిటీ
సూర్యకాంతం ప్రత్యేకంగా హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు.. నవ్వు తెప్పిస్తుంది. చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. ఓర చూపులు చూస్తూ.. ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి సూర్యకాంతం చెప్పిన సంభాషణా చాతుర్యం.. అంతలోనే వెక్కిరిస్తూ.. అంతలోనే కల్లబొల్లి కబుర్లతో ఏడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు వెండితెరపై సజీవ శిల్పాలు.

రీప్లేస్ చేయలేని నటి సూర్యకాంతం
తెరపై గయ్యాళిగా అలరించిన సూర్యకాంతం నిజజీవితంలో ఎంతో సున్నిత మనస్కురాలు. ఆమె మంచితనం గురించి ఈ నాటికీ నాటి సినీజనం కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు.

ఎందరో హీరోలను, హీరోయిన్లను రీప్లేస్‌ చేయగలిగారు కానీ.. రీప్లేస్‌ చేయలేని నటి ఎవరైనా ఉన్నారంటే.. ఖచ్చితంగా ఆమె సూర్యకాంతమే. నేడు (అక్టోబర్ 28) సూర్యకాంతం జయంతి.

Related Posts