అన్నదమ్ములు తేలిపోయారు.. కొడుకైనా కొడతాడా..

కొన్ని రోజుల క్రితం ఇది మెగానామ నెల అనుకున్నారు చాలామంది. అంటే ఒక నెల రోజుల్లోనే మూడు మెగా ఫ్యామిలీ మూవీస్ వస్తున్నాయి. ఇక ఫ్యాన్స్ కు పండగే అని దానర్థం. జూలై 28న పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా వచ్చింది. ఈ మూవీపై పెద్దగా అంచనాలు లేవు కానీ.. మామా అల్లుళ్లు కలిసి నటించారు కాబట్టి ఖచ్చితంగా ఏదో మ్యాజిక్ జరుగుతుందని భావించారు. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఇది. పైగా తెలుగు వెర్షన్ కోసం త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. దీని వల్ల సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనే భావించారు. బట్ అలాంటిదేం జరగలేదు. సినిమా పోయింది. అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ ను ఆ పాత్రలో చూసి నిట్టూర్చారు. ఏ మాటకు ఆ మాటే.. పవన్ మాత్రం చాలా రోజుల తర్వాత ఎనర్జిటిక్ అండ్ ఎంటర్టైనింగ్ గా కనిపించాడు.


ఇక నెక్ట్స్ మెగాస్టార్ మూవీ భోళా శంకర్ అనుకున్నారు. ఇదీ వచ్చింది. విశేషం ఏంటంటే.. ఈ మూవీపైన అంచనాలు లేవు. అయినా మెగాస్టార్ కదా.. ఏదైనా చేస్తాడు అనుకున్నారు.కానీ.. ఈ సినిమా ఒప్పుకోవడమే ఆయన చేసిన తప్పు అని ప్రేక్షకులే కాదు.. ఫ్యాన్స్ కూడా బలంగా ఫీలయ్యారు. ఆ రేంజ్ లో నిరాశపరిచింది భోళా శంకర్. అవుట్ డేటెడ్ కథ, కథనాలతో తనూ అవుట్ డేటెడ్ అని చెప్పకనే చెప్పుకున్నాడు దర్శకుడు మెహర్ రమేష్‌. అలా ఈ రెండు సినిమాలూ మెగా ఫ్యాన్స్ కు కొత్త జోష్ఇస్తాయి అనుకుంటే కొండంత నిరాశను నింపాయి. అయితే ఈ రెండు సినిమాలూ రీమేక్ లు. అంచనాలు తగ్గడానికి.. ఆకట్టుకోలేకపోవడానికీ అదే ప్రధాన కారణం అంటే అతిశయోక్తి కాదు.

ఇక మెగానామ నెలలో రాబోతోన్న మరో మెగా హీరో వరుణ్ తేజ్.ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన సినిమా గాండీవధారి అర్జున. ఈ నెల 25న విడుదల కాబోతోంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఓ స్పై థ్రిల్లర్. వరుణ్ కు ఈ పాత్ర ఫస్ట్ టైమ్. కొత్తగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రవీణ్ సత్తారు అంటే స్టైలిష్‌ మేకర్. కొత్త జానర్స్ ను రెగ్యులర్ గా చెబుతుంటాడు. బట్ ఇది ఆల్రెడీ చూసినట్టుగా కనిపిస్తుండటమే ఈ గాండీవధారికి పెద్ద సమస్యగా మారింది. ఈ తరహా కథలకు ఇప్పుడు రేసీ స్క్రీన్ ప్లే ఎంత అవసరమో.. పోలికలు లేని కథలూ అంతే అవసరం. ఏజెంట్, స్పై లు ఏం చేస్తుంటారు అనేది అందరికీ తెలుసు. ఆ తెలిసిన విషయాన్ని తెలివిగా చెప్పడం దర్శకుల తెలివిని సూచిస్తుంది. ఈ విషయంలో ప్రవీణ్ పై పెద్దగా డౌట్స్ లేవు. అయినా ఎందుకో ఈ మూవీ ట్రైలర్ కు ఏ మాత్రం బజ్ రాలేదు. అసలు ఈ సినిమా ఉందా అన్న అనుమానాలూ చాలామందిలో కలుగుతున్నాయి. ఆ స్థాయి లో బజ్ తో కనిపిస్తోంది ఈ చిత్రం. కాకపోతే ఇది స్ట్రెయిట్ మూవీ.

అందుకే వరుణ్ బాబాయ్ బ్రో లా పెదనాన్న భోళాలా కాకుండా కాస్త కొత్తగా ఉంటే ఖచ్చితంగా చూస్తారు. బట్ మెగా హీరోలకు సంబంధించి ఆ రెండు సినిమాల ఫ్లాప్ ఎఫెక్ట్ వరుణ్ తేజ్ గాండీవధారిపై పడుతుందనేది కాదనలేని నిజం. మరి ఈ సమస్యను వరుణ్ మొదటి ఆటకే బ్లాక్ బస్టర్ అనే టాక్ తెచ్చుకుంటే తప్ప అధిగమించలేడు.

Related Posts