విరూపాక్ష రివ్యూ

రివ్యూ : విరూపాక్ష
తారాగణం : సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్, రాజీవ్ కనకాల, సునిల్, అజయ్, బ్రహ్మాజీ, రవికృష్ణ, సాయిచంద్ తదితరులు
ఎడిటింగ్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ : షాందత్ సైనుదీన్
సంగీతం : అజనీష్ లోకనాథ్
స్క్రీన్ ప్లే : సుకుమార్
బ్యానర్స్ : ఎస్.వి.సి.సి అండ్ సుకుమార్ రైటింగ్స్
నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్
దర్శకత్వం : కార్తీక్ దండు

ప్రమాదానికి ముందు వరుస విజయాలతో ఉన్నాడు సాయిధరమ్ తేజ్. యాక్సిడెంట్ తర్వాత అతను హాస్పిటల్ లో ఉండగానే రిపబ్లిక్ విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతకు ముందే మొదలైన సినిమా ఈ విరూపాక్ష. ప్రమాదం వల్ల చాలా ఆలస్యం అయింది. అయినా సినిమాపై అంచనాలు పెంచడంలో మూవీ టీమ్ సక్సెస్ అయింది. టీజర్, ట్రైలర్ తో పాటు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. అటు హీరోయిన్ ఆల్రెడీ లక్కీ బ్యూటీ అనిపించుకుంది. దీంతో విరూపాక్షపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. పైగా సోలో రిలీజ్ కూడా దొరికింది. మరి ఈ అవకాశాన్ని వాడుకుని అంచనాలను అందుకుందా లేదా అనేది చూద్దాం.

కథ :
అది 1979. రుద్రవనం అనే ఊరిలో వరుసగా చిన్న పిల్లలు చనిపోతుంటారు. అందుకు కొత్తగా ఆ ఊరికి వచ్చిన చలపతి(కమల్ కామరాజ్) అతని భార్య చేతబడి చేయడం వల్లే అని గ్రామస్తులు నమ్ముతారు. ఈ కారణంగా ఆ ఇద్దరినీ సజీవ దహనం చేస్తారు. చనిపోతున్న ఆమె పుష్కరం తర్వాత ఈ ఊరు స్మశానం అవుతుందని శాపం పెడుతంది. ఆ పుష్కరం తర్వాత తన అమ్మమ్మగారి ఊరు కూడా అయిన రుద్రవనంకు తల్లితో కలిసి ఓ జాతర కోసం వస్తాడు సూర్య(సాయితేజ్). అక్కడే నందిని(సంయుక్త)ని చూసి ప్రేమలో పడతాడు. తను ఒప్పుకుందా లేదా అనేది ఇంకా తేలకముందే ఆ ఊరి జాతర సందర్భంగా అమ్మవారి గుడిలో ఒక వ్యక్తి చనిపోతాడు. అది అరిష్టంగా భావించిన పూజారి గ్రామానికి అష్ట దిగ్బంధనం చేస్తాడు. అయినా ఆ ఊరిలో ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. మరి ఈ మరణాలకు కారణం ఎవరు..? అష్టదిగ్బంధనం జరిగినా.. ఇది ఎలా జరిగింది..? ఈ మరణాలను సూర్య ఆపాడా లేదా..? అసలు దీని వెనక ఉన్నది ఎవరు అనేది మిగతా కథ.

విశ్లేషణ :
సూపర్ నేచురల్ థ్రిల్లర్.. ఈ జానర్ కు ఎప్పుడూ ఆడియన్స్ ఉంటారు. భయపడుతూనే ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు కొదవ లేదు. అందుకే ఈ తరహా చిత్రాలు ఎప్పుడు వచ్చినా.. ఎన్ని వచ్చినా కాస్త జాగ్రత్తగా రాసుకుని కథ నుంచి డీవియేట్ కాకుండా చెబితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అలా చూస్తే విరూపాక్ష కూడా సక్సెస్ ఫుల్ మూవీయే అని చెప్పొచ్చు. దర్శకుడు ఎక్కడా కథను దాటలేదు. హీరో చుట్టూ కథను కాకుండా కథ చుట్టూనే హీరోతో పాటు ఇతర పాత్రలను తిప్పాడు. ఇదే ఈ సినిమాకు అతి పెద్ద బలం. అయితే ఇలాంటి సినిమాలను విశ్లేషిస్తే అసలు కథ రివీల్ అవుతుంది. ఇందులో ఒక్క పాయింట్ రివీల్ అయినా కొత్తగా చూసే ప్రేక్షకులు ఆ థ్రిల్ మిస్ అవుతారు. అయినా ఈ కథ గురించి చెప్పకుండా ఉండలేం.
దర్శకుడు ఈ చిత్రాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా డైరెక్ట్ గా కథతోనే మొదలుపెడతాడు. ఆ ఫస్ట్ వచ్చే ఎపిసోడ్ మిస్ అయితే సినిమా అర్థం కాదు. అయితే ఆ సీన్ ఓ రేంజ్ లో ఉంటుంది. వాళ్లు చేసింది తప్పు అనిపిస్తూనే.. దాని తర్వాత ఎలాంటి పర్యవసనాలు ఉంటాయా అనే ఆసక్తీ కలుగుతుంది. వెంటనే 1991కి కథ షిఫ్ట్ అవుతుంది. అంటే మొదటి ఎపిసోడ్ తర్వాత పన్నెండేళ్లకు డైరెక్ట్ గా మళ్లీ కథలోకి వచ్చేస్తాడు. ఆ రుద్రవనం అనే ఊరితో పాటు చుట్టూ పరిసరాలతో కంప్లీట్ గా ఎంగేజ్ చేస్తాడు. ఈ క్రమంలో వచ్చే ప్రేమ, పాటలు కొత్తగా లేకపోయినా ఏవీ బోర్ అనిపించవు. శ్యామల, సోనియా సింగ్, రవికృష్ణ పాత్రల లెంగ్త్ ఎక్కువ అనిపించినా కథను పూర్తిగా మలుపు తిప్పేది వాళ్లే. ఎప్పుడైతే ఆ ఊరిలో జరిగే అన్ నేచురల్ ఇన్సిడెంట్స్ లో హీరోయిన్ వంతు వస్తుందో.. అక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్. ఇంటర్వెల్ తర్వాత నుంచి వరుసగా ఒక్కో సీన్ పరుగులు పెడుతూ వెళుతుంది. మరణాల వెనక కారణాలు వెదుకుతూ సూర్యగా సాయితేజ్ చేసే ఇన్వెస్టిగేషన్.. కన్నడ అపరిచిత, మళయాల శివపురం, తెలుగు అరుంధతిలను గుర్తు చేసినా.. ఈ కథ, కథనం.. దానికోసం సాగే అన్వేషణ వేరే కాబట్టి ఆ చిత్రాలను అనుసరించినట్టు కనిపించదు. ఈ క్రమంలో ఫస్ట్ హాఫ్ లోనే పరిచయం అయిన అజయ్ పాత్ర అదరగొడుతుంది. సెకండ్ హాఫ్ లో హీరోకు సాయం చేసే అఘోరాగా అతని పాత్ర కీలకంగా కనిపిస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి.. క్లైమాక్స్ వరకూ ఎవరూ ఊహించని సన్నివేశాలతో కథనం పరుగులు పెడుతుంది. అయితే ఎవరైనా ఈ చిత్ర కథ చెబుతానంటే అస్సలు వినకుండా చూసేయండి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ తెలుగు సినిమాల నుంచి ఊహించలేం. హీరో అయినా.. దర్శకుడైనా కథను పూర్తిగా సరెండర్ అయితేనే ఇలాంటి సాహసాలు చేస్తారు. మరి సాహసం చేసిన వారికి ఫలితం రాకుండా ఉంటుందా..? అందుకే ఈ విరూపాక్షకు యూనానిమస్ గా హిట్ టాక్ వచ్చేసింది.
చాలా సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. చాలా చోట్ల భయపెడతాడు. మరికొన్ని చోట్ల ఉలిక్కి పడేలా చేస్తారు. నెక్ట్స్ సీన్ ఏంటా అనే క్యూరియాసిటీ కనిపిస్తుంది. రవికృష్ణ పాత్ర ఇచ్చే ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. సో.. థ్రిల్లర్ మూవీస్ కు ఉండాల్సిన ప్రధాన లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి విరూపాక్ష ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది.


అలాగని మైనస్ లే లేవా అంటే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో కథనం అక్కడక్కడా నెమ్మదిగా వెళుతుంది. సాయిచంద్ తో వచ్చే సీన్స్ లో కాస్త అతి కనిపిస్తుంది. పైగా ఇవి చాలా సినిమాల్లో చూసినవి కూడా. సెకండ్ హాఫ్ లో కూడా కొన్నిసార్లు స్క్రీన్ ప్లే స్లో అయినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ లో అజయ్ పాత్ర ఏమైంది అనేది చెప్పలేదు. అలాగే పక్క ఊరి జనాల పాత్ర కేవలం మాస్ ఆడియన్స్ కోసమే అన్నట్టుగా ఉంటుంది తప్ప కన్విన్సింగ్ గా ఉండదు.
నటన పరంగా సాయిధరమ్ తేజ్ ఈ పాత్రను పూర్తిగా ఓన్ చేసుకున్నాడు. తనో స్టార్ అన్న సంగతి మర్చిపోయాడు. 90ల కాలంలో ఓ సాధారణ ధైర్యవంతుడైన యువకుడుగా ఆ పాత్రలో జీవించాడు. ప్రేమకోసం ఏదైనా చేసేందుకు వెనకాడని దీరత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు. ఇది అతని కెరీర్ లోనే ది బెస్ట్ నటన. సినిమా కూడా ఇదే బెస్ట్ అవుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక సంయుక్త మీనన్ ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో నటనకు పెద్దగా స్కోప్ లేదు. ఈ మూవీలో అవకాశం వచ్చింది. అద్భుతంగా ఉపయోగించుకుంది. నందినిగా అదరగొట్టింది. క్లైమాక్స్ లో తనే కీలకం. చాలా మెచ్యూర్డ్ నటన చూపించింది. నందిని పాత్ర సంయుక్తకూ కెరీర్ బెస్ట్ అనే చెప్పొచ్చు. ఇతర పాత్రల్లో అజయ్ అఘోరాగా చాలా బాగా చేశాడు. కమల్ కామరాజ్ పాత్ర చిన్నదే. రవికృష్ణ ఉన్నంత సేపూ ఆకట్టుకున్నాడు. సాయిచంద్ ది రొటీన్ రోల్. సునిల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల తమ పాత్రల్లో ఒదిగిపోయారు. యాంకర్ శ్యామలకు ఓ మంచి పాత్ర దక్కింది. సోనియా సింగ్ సైతం ఆకట్టుకుంటుంది.

ఇక టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉందీ చిత్రం. ప్రధానంగా ఒక గ్రామాన్నే క్రియేట్ చేసిన ఆర్ట్ వర్క్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అది సినిమా కోసం సృష్టించిన ఊరులా కాక నిజమైన గ్రామంలానే కనిపిస్తుంది. అలాంటి సెట్ ను అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు సినిమాటోగ్రాఫర్. లిమిటెడ్ లొకేషన్ అంటే రిపీటెడ్ గా కనిపిస్తాయి. ఆ ఫీల్ రాకుండా బాగా షూట్ చేశారు. లైటింగ్ సైతం అద్భుతం. సంగీతం నెక్ట్స్ లెవల్ లో ఉందని చెప్పాలి. ఇలాంటి సినిమాలకు ఏ మ్యూజిక్ అయితే సెట్ అవుతుందో.. అదే ఇచ్చాడు. పాటలు ఎంత అందంగా ఉన్నాయో.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత భయపెడుతుంది. ఎడిటింగ్ బావుంది. కాస్ట్యూమ్స్ కూడా ఆ కాలానికి తగ్గట్టుగా మెప్పిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే ఎక్కడా రాజీపడినట్టు కనిపించలేదు. చాలా గ్రాండ్ గానే చిత్రీకరించారు.


ఇక దర్శకుడి గురించి చెప్పుకోవాలి. కార్తీక్ కు ఇది రెండో సినిమా. ఫస్ట్ మూవీ భం భం బోలేనాథ్ పెద్దగా ఆడలేదు. అయినా ఈ మూవీతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇది ఖచ్చితంగా దర్శకుడి సినిమా. ఈ మాట చెప్పడం అంత సులువు కాదు. కానీ విరూపాక్షకు చెప్పొచ్చు. హీరో కోసమో.. కమర్షియల్ ఎలిమెంట్స్ అనో ఎక్కడా కథను దాటి వెళ్లలేదు. తను రాసుకున్నది రాసుకున్నట్టుగా చిత్రీకరించాడు. అతనికి సుకుమార్ స్క్రీన్ ప్లే బాగా హెల్ప్ అయింది. మొత్తంగా సుకుమార్ శిష్యులు అంటే మాగ్జిమం గ్యారెంటీ అని మరో దర్శకుడు ప్రూవ్ చేసుకున్నాడు. ఈ దర్శకుడి కోసమైనా విరూపాక్షను చూసేయొచ్చు.
ఫైనల్ గా : థ్రిల్లింగ్ హారర్ ..

రేటింగ్ : 3.25/5

                    - కామళ్ల. బాబురావు.

Related Posts