2021లో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన కొత్త భామలు వీళ్లే

తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికలకు అవకాశం ఎప్పుడూ వుంటుంది. అందం, అభినయం ఉంటే ఇక్కడ సక్సెస్ అవ్వడంతో పాటు అభిమానుల హాట్ ఫేవరేట్ కూడా అవ్వొచ్చు. కానీ ఈ లిస్టులో చేరడం అంత తేలిక కాదు. ఏటా పదుల సంఖ్యలో కొత్త తారలు తెరపై కనిపించినా అందులో సక్సెస్ అయ్యే హీరోయిన్ల శాతం చాలా తక్కువ. ఈ ఏడాది కూడా పదుల సంఖ్యలో కొత్త కథానాయికలు తెరపైకి వచ్చారు. వాళ్ళలో కొంత మంది ఒక్క సినిమాతోనే పాపులారిటీ తెచ్చుకుని వరుస ఆఫర్లు దక్కించుకుంటుంటే…మరికొందరు ఛాన్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. వారిపై ఓ స్పెషల్ స్టోరీ చూద్దాం.
2021లో టాలీవుడ్లో అడుగుపెట్టిన కొత్త హీరోయిన్లలో కృతి శెట్టి పేరు ముందుగా చెప్పాలి. మొదటి సినిమా ఉప్పెనతో ఒక ఉప్పెనలా దూసుకొచ్చింది. ఫస్ట్ లుక్ రిలీజ్ నుంచే కృతిపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలోని నీకళ్ళు నీలి సముద్రం అనే పాట విడుదలైన తర్వాత యూత్ లో కృతికి ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక సినిమా విడుదలైన తర్వాత యూత్ ఆడియన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది. ఉప్పెన వంద కోట్ల క్లబ్ లో చేరడంతో కృతి గ్లామర్ కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. ఉప్పెన మూవీ ధియేటర్లలోకి రాకముందే కృతిశెట్టికి వరుస ఆఫర్లు వచ్చాయి. నాని శ్యామ్ సింగరాయ్ లో సినిమా ఛాన్స్ వచ్చేటప్పటికీ ఉప్పెన రిలీజ్ కాలేదు. ఉప్పెన రిలీజ్ అయ్యాక ఫుల్ బిజీ అయిపోయింది. నాగార్జున, నాగచైతన్య కాంబోలో వస్తున్న బంగార్రాజు, నితిన్‌ కొత్త సినిమా మాచర్ల నియోజకవర్గం, సుధీర్‌బాబు నటిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న బై లింగ్వల్ ప్రాజెక్టుల్లో కృతిశెట్టే హీరోయిన్. ఇక ఇయర్ ఎండింగ్ లో వచ్చిన శ్యామ్ సింగరాయ్ తో కృతిశెట్టి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక నెక్ట్స్ ఇయర్ నాలుగైదు సినిమాలతో రాబోతుంది కృతిశెట్టి.
రాఘవేంద్రరావు, శ్రీకాంత్ కాంబోలో వచ్చిన పెళ్ళిసందడికి సీక్వెల్ గా ఈ ఏడాది ఓ సినిమా వచ్చింది. అందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో. ఈ చిత్రంతో శ్రీలీల అనే కొత్త హీరోయిన్ టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. కానీ శ్రీలీలకి మాత్రం మంచి పేరు తెచ్చింది. క్యూట్ లుక్స్, బబ్లీ యాక్టింగ్, డ్యాన్సులతో శ్రీలీల ఇండస్ట్రీలో హాట్ ఫేవరేట్ గా మారింది. శ్రీలీలకి ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. రవితేజ ‘ధమాకా’ మూవీలో నటిస్తోంది. ఇది కాకుండా శర్వానంద్‌, నిఖిల్‌ కొత్త సినిమాల్లో శ్రీలీల పేరుని పరిశీలిస్తున్నారు.
హీరోయిన్స్ ని వెదికి పట్టుకోవడంలో పూరి జగన్నాధ్ ది సెపరేట్ స్టైల్. తను ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్లలో చాలా మంది టాప్ పొజిషన్ కి వెళ్ళారు. ఈ ఏడాది కూడా పూరి జగన్నాథ్ ఓ కొత్త హీరోయిన్ ని పరిచయం చేశారు. ఆమె కేతికశర్మ. పూరీ తనయుడు ఆకాష్ నటించిన రొమాంటిక్ సినిమాతో కేతికశర్మ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. టైటిల్ తగ్గట్టే మూవీలో వెరీ రొమాంటిక్ గా కనిపించింది. హాట్ లుక్స్ తో కుర్రకారుకి తెగ నచ్చేసింది. ఈ సినిమా తర్వాత నాగశౌర్య లక్ష్య సినిమాలో కనిపించింది. కానీ కమర్షియల్ గా ఆ రెండు చిత్రాలు సక్సెస్ అవ్వలేదు. ప్రస్తుతం కేతిక చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి.
ఒక్క కన్నుగీటుతో వైరల్ గా మారిన భామ ప్రియ ప్రకాష్ వారియర్. మొదటి సినిమా విడుదల కాకుండానే సోషల్ మీడియాలో ఆమె పేరు సంచలనంగా మారింది. ఆమె నటించిన మలయాళం సినిమా ఓరు అదార్ లవ్ లో వింక్ సీన్ సోషల్ మీడియాని షేక్ చేసింది. సినిమా మాత్రం అట్టర్ ఫ్లాఫ్ అయింది. అయితే ఈ ఏడాది తెలుగులో తెరంగేట్రం చేసింది ప్రియా. నితిన్ చెక్ సినిమాలో నటించింది. అయితే చెక్ మూవీ నిరాశపరిచింది. అలాగే తనకుడు కూడా పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత తేజ సజ్జాతో చేసిన ఇష్క్ మూవీ కూడా ప్రియా ప్రకాష్ కి షాక్ ఇచ్చింది. తెలుగులో మరో ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది.
2021లో సూపర్ హిట్ అయిన సినిమాల్లో జాతి రత్నాలు ఒకటి. ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఫారియా అబ్ధుల్లా. అనుష్క తర్వాత మళ్ళీ అంత పొడుగు వున్న హీరోయిన్ ఈమే. స్వయంగా ప్రభాస్ చేత.. ‘ఈ అమ్మాయి ఎవర్రా బాబు.. నా కంటే ఎత్తుగా వుంది” అని కితాబు అందుకుంది ఫరియా. జాతి రత్నాలు విడుదలైన తర్వాత యూత్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో ”ఇచ్చేయండి సర్.. బెయిల్ ఇచ్చేయండి” అని క్యుట్ గా వాదించే లాయర్ గా వినోదాన్ని పంచింది. ఇప్పుడు బంగార్రాజు సినిమాలో ఓ డ్యాన్స్ నెంబర్ చేసింది. ఫ్యూచర్ లో హీరోయిన్ గా మెప్పించే లక్షణాలు ఆమెలో కనిపిస్తున్నాయంటున్నారు సినీ అబిమానులు.
షాది ముబారక్ సినిమాలో మెరిసిన భామ దృశ్య రఘునాథ్. మొదటి సినిమానే నటనకు స్కోప్ వున్న పాత్ర ఆమెకు దక్కింది. ఇందులో సాగర్ హీరో. కానీ కధనం మొత్తం ఈనె చుట్టూనే తిరుగుతుంది. ఆమె నటన కూడా బావుంది. తుపాకుల సత్యభామ పాత్రలో డీసెంట్ వినోదాన్ని పంచింది. అందంగా కూడా వుంది. భవిష్యత్ లో నటనకు ఆస్కారం వుండే పాత్రలు ఆమెకు వచ్చే ఛాన్స్ వుంది. అలాగే శ్రీసింహా హీరోగా వచ్చిన ‘తెల్లవారితే గురువారం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచమైయింది మిషా నారంగ్. మూవీలో అమాయ‌కంగా, ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హా పాత్రతో మిషా నటన మెప్పిస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో అభినయం బావుంది. సినిమా నిరాశ పరిచినా నిషా నటన మాత్రం ఆకట్టుకుంది.
సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే మూవీతో తెలుగు నాట అడుగుపెట్టింది మీనాక్షి చౌదరి. ఈ సినిమా నిరాశ పరిచినప్పటికీ ఆమె గ్లామర్ ఆకట్టుకుంది. నిజానికి సినిమాల్లోకి రాకముందే మీనాక్షి మోడల్ ప్రపంచంలో పాపులర్. బ్యూటీ మెడల్స్ సొంత చేసుకుంది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ఖిలాడి, అడివి శేష్‌ చేస్తున్న హిట్‌2 మూవీలో నటిస్తోంది. ప్రభాస్‌ క్రేజీ మూవీ సలార్‌ లోనూ మీనాక్షి చౌదరి ఓ కీలక పాత్ర చేస్తుంది. ఇక అమృత అయ్యర్ ఈ ఏడాది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ సినిమా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అర్జున ఫల్గుణతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అమృత. ఈ బ్యూటీకి ఆఫర్లు బాగానే వస్తున్నాయి.
ఈ ఏడాది మరో నట వారసురాలు వెండితెర ఎంట్రీ ఇచ్చింది. అద్భుతం సినిమాతో శివాని రాజశేఖర్ ప్రేక్షకులకు పరిచయమైయింది. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా శివాని నటనకు మంచి మార్కులు పడ్డాయి. శివాని స్క్రీన్ ప్రజన్స్, టైమింగ్ ఆకట్టుకున్నాయి. నటనకు ఆస్కారం వుండే పాత్రలకు బావుంటుందనే నమ్మకాన్ని ఇచ్చింది శివాని. వీరే కాకుండా..అల్లరి నరేష్ నాందిలో నవమి గాయక్, గాలి సంపత్ లో లవ్లీ సింగ్, రాజా విక్రమార్క్ లో తాన్య రవిచంద్రన్, పుష్పక విమానం లో గీత్ సింగ్ .. ఈ ఏడాది టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. వీరంతా కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. సో…ఈ ఏడాది కొత్తగా వచ్చిన హీరోయిన్లలో కొందరు వరుస ఆఫర్లతో దూసుకుపోతుంటే మరికొందరు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.

Related Posts