సత్యదేవ్ లో హీరో మెటీరియల్ కాదా..?

కొందరు ఆర్టిస్టులను చూస్తే ఓ పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. వాళ్లు ఏ పాత్రైనా చేయగలరు అనిపించుకుంటారు. ఎలాంటి పాత్రలో అయినా అలవోకగా ఒదిగిపోతారు. ఆఫర్స్ రాకో ఇంకే కారణాలో చెప్పలేం కానీ.. తెలుగులో ఇలాంటి ఆర్టిస్టులు తక్కువే. ఆ తక్కువలో ఈ తరంలో ముందు వరుసలో ఉండే పేరు సత్యదేవ్. కెరీర్ లో ఆరంభంలో అతి చిన్న పాత్రలతో పరిచయం అయ్యాడు. ఇంకా చెబితే ఒక్క డైలాగ్ కూడా లేని పాత్రలూ చేశాడు. పూరీ జగన్నాథ్ జ్యోతిలక్ష్మిలో ఓ హీరోలాంటి పాత్రలో నటించిన తర్వాతే అతనికి గుర్తింపు మొదలయ్యింది.

మంచి వాయిస్, హైట్ తో ఆ తర్వాత తక్కువ టైమ్ లోనే తనదైన ముద్ర వేశాడు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో క్రికెటర్ గా చిన్న పాత్రలోనే పెద్ద ఇంపాక్ట్ చూపించాడు. ఇంకేం ఇలాంటి పాత్రలు ఇచ్చిన గుర్తింపుతో అతన్ని హీరోగా మార్చారు కొందరు. తర్వాత బ్లఫ్ మాస్టర్, బ్రోచెవారెవరురా, ఇస్మార్ట్ శంకర్.. ఇలా దూసుకుపోయాడు. అయితే ఏ సినిమాలో నటించినా.. ఏ పాత్ర చేసినా అతన్ని అంతా మెచ్చుకున్నారు. కానీ హీరోగా మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనేది నిజం.

అతను హీరోగా నటించిన రాగల 24గంటల్లో, 47డేస్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, గువ్వా గోరింక, తిమ్మరుసు, స్కైలాబ్, గాడ్సే.. ఇలా ఏ ఒక్కటీ ఆకట్టుకోలేదు. కానీ సరిలేరు నీకెవ్వరులో చేసిన చిన్న పాత్రతో పాటు రీసెంట్ గా వచ్చిన చిరంజీవి గాడ్ ఫాదర్ లోని జై దేవ్ పాత్ర, హిందీ చిత్రం రామ్ సేతులో చేసిన అంజి పాత్ర అద్భుతంగా పండాయి. ఇన్ని సినిమాల్లో హీరోగా నటించినా రాని పేరు ఈ రెండు సినిమాలతో వచ్చిందని ఖచ్చితంగా చెప్పొచ్చు.


ఇక ఇప్పుడు గుర్తుందా శీతాకాలం అనే రొమాంటిక్ మూవీతో రాబోతున్నాడు సత్యదేవ్. ఈ మూవీలో తమన్నా, మేఘా ఆకాశ్, కావ్యశెట్టి హీరోయిన్లు. ఓ కన్నడ చిత్రానికి రీమేక్ గా రూపొందిన ఈ మూవీతో మళ్లీ హీరోగా తన లక్ చెక్ చేసుకోబోతున్నాడు. బట్.. కాస్త సీరియస్ గా ఉన్న తిమ్మరుసు, గాడ్సే లాంటి కథలతోనే మెప్పించలేకపోయిన సత్యదేవ్ రొమాంటిక్ రోల్ లో సూట్ అవుతాడు అనుకోలేం.

అయినా అతని అదృష్టం ఎలా ఉందో కానీ.. కొన్నేళ్ల క్రితం.. సరిగ్గా చెబితే తెలుగులో కెరీర్ ఆరంభించిన దశలో ప్రకాష్‌ రాజ్ ను సైతం ఇలాగే ఎలాంటి పాత్రైనా చేయగల టాలెంటెడ్ అన్నారు. విలన్ గా చేసినా బలే చేశాడ్రా అనిపించుకున్నాడు. ఆ ఇమేజ్ తో అతన్నీ హీరోగా పెట్టి రెండు మూడు సినిమాలు తీసి చేతుల కాల్చుకున్నారు నిర్మాతలు. అయితే ఈ విషయంలో ప్రకాష్ రాజ్ తెలివిని మెచ్చుకోవాలి. నటుడుగా లాంగ్ టర్మ్ ఉండే అవకాశం కాదని హీరోగా ఎందుకు ప్రయోగాలు చేయడం అనుకుని అతనే డ్రాప్ అయ్యాడు. ఈ విషయంలో ఆ తెలివిని చూపించలేకపోతున్నాడు సత్యదేవ్.


సత్యదేవ్ కటౌట్ కు తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లో కూడా ఎన్నో కీలకమైన పాత్రలు చేసే అవకాశం ఉంది. దాన్ని వదులుకుని ఇలా ఇమేజ్ తేని.. తనకు సూట్ కాని హీరో పాత్రలు చేయడం ఎంత వరకూ సబబో అతనే ఆలోచించుకోవాలి.

Related Posts