జిన్నా మూవీ రివ్యూ….

రివ్యూ :- జిన్నా
తారాగణం :- మంచు విష్ణు, సన్నిలియోన్, పాయల్ రాజ్ పుత్, చమ్మక్ చంద్ర, వెన్నెల కిశోర్, అన్నపూర్ణ, రఘుబాబు తదితరులు
ఎడిటిగ్ :- చోటా కే ప్రసాద్
సినిమాటోగ్రఫీ :- చోటా కే నాయుడు
సంగీతం :- అనూప్ రూబెన్స్
నిర్మాత :- మోహన్ బాబు
దర్శకత్వం :- ఇషాన్ సూర్య

వరుసగా సినిమాలు చేస్తున్నా.. ఎప్పుడో కానీ హిట్ అనే మాట చూడడు మంచు విష్ణు. అయితే తను కామెడీ కథలు ట్రై చేసిన ప్రతిసారీ హిట్ సంగతేమో కానీ.. ఫ్లాప్ అయితే చూడలేదు. అందుకే కొన్ని ఫ్లాపుల తర్వాత ఇప్పుడు జిన్నా అంటూ వచ్చాడు. పైగా సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ వంటి బ్యూటీస్ కూడా ఉండటం, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో జిన్నాపై కొంత అంచనాలు పెరిగాయి. మరి వాటిని ఈ మూవీ ఏ మేరకు అందుకుంది అనేది చూద్దాం.

కథ :-
జిన్నా( విష్ణు) తిరుపతి దగ్గర్లోని రంగంపేట అనే ఊరిలో ఉంటాడు. పెద్దగా చదువుకోని అతను ఓ టెంట్ హౌస్ రన్ చేస్తుంటాడు. ఎప్పటికైనా ఆ ఊరికి సర్పంచ్ కావాలనే ప్రయత్నాల్లో ఉంటూ ఒక వ్యక్తి దగ్గర అప్పులు చేస్తాడు. అతని టెంట్ హౌస్ తీసుకుని ఎవరు పెళ్లి చేసుకున్నా పెళ్లి కొడుకుకు ఏదో ఒకటి అవుతుంది. అయినా తన చిన్నప్పటి ఫ్రెండ్స్ తో కలిసి రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో చిన్నప్పుడు తమతో కలిసి చదువుకున్న ఫ్రెండ్ రేణుక(సన్నిలియోన్) అనే అమ్మాయి అమెరికా నుంచి చాలాయేళ్ల తర్వాత సొంత ఊరికి వస్తుంది. చిన్నప్పటి నుంచీ మూగ, చెవిటి కూడా అయిన రేణుక వచ్చీ రాగానే విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతూ జిన్నాను పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా ఉంటుంది. కానీ జిన్నా మరో అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ తన అప్పులు తీరాలంటే రేణుకను పెళ్లి చేసుకోవడమే మార్గం అని ఓ ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ అమలయ్యే టైమ్ కు అతనికి ఊహించని విషయాలు తెలుస్తాయి. అప్పటి వరకూ తాము రేణుక అనుకుంటోన్న అమ్మాయి అసలు కాదని తెలుస్తుంది. మరి రేణుక ప్లేస్ లో వచ్చిన అమ్మాయి ఎవరు..? ఎందుకు జిన్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. మరి జిన్నా ప్రేమించిన అమ్మాయితో అతని పెళ్లవుతుందా అనేది మిగతా కథ.

విశ్లేషణ :-
వెన్ డ్రామా బిగెన్స్ లాజిక్ ఎండ్స్.. అనే సూత్రం సినిమాలకు పర్ఫెక్ట్ గా అప్లై అవుతుంది. ముఖ్యంగా తెలుగు కమర్షియల్ సినిమాలకు. జిన్నా కూడా ఆ కోవలో కనిపించే చిత్రమే. చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్స్ తో మొదలయ్యే కథ.. ఆ తర్వాత ఏమైందీ అనేది తెలియకుండానే పెద్దయ్యాక టెంట్ హౌస్ లో తేలుతుంది. హీరో ఎంట్రీ, ఫైట్, సాంగ్ కామెడీ సీన్స్ అంటూ రెగ్యులర్ ఫార్ములాలో సాగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే సన్నిలియోన్ ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి కథలో కాస్త స్టఫ్ మొదలవుతుంది. అలాగని గొప్పగా ఉందని చెప్పలేం. అలాగే చప్పగానూ ఉండదు. కమర్షియల్ సినిమా ఫార్ములా దాటకుండా సాగిపోతూ ఉంటుంది. ఊరిలో హీరో అప్పుడు, ఎలక్షన్స్, కోట్లకు కోట్లు డబ్బులు అంటూ ఏ మాత్రం లాజిక్ కు అందని సన్నివేశాలు వస్తూ పోతూ ఉంటాయి. తను ప్రేమించింది చిన్నప్పటి స్వాతినే అనే తెలియడంతో పాటు రేణుక పాత్రలో కొత్త కోణం బయటపడటంతో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి కథలో కొంత వేగం కూడా కనిపిస్తుంది. ఊహించదగిన సీన్సే అయినా.. మరీ బోర్ కొట్టవు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం సన్నిలియోన్ పాత్రనే నమ్ముకుని తీశారు. తన గొప్ప నటి కాకపోయినా మంచి నటన అవసరం ఉన్న ఈ పాత్రను తన అంద చందాలతో లాగించేసింది. ఏ మాటకామాట.. ఇద్దరు హీరోయిన్లతోనూ విష్ణు ఓ రేంజ్ లో రొమాన్స్ చేశాడు. ఇద్దరితోనూ అదే స్థాయిలో ఎక్స్ పోజింగ్ కూడా చేయించారు. అప్పటి వరకూ హారర్ టచ్ అనుకున్న సినిమా ప్రీ క్లైమాక్స్ నుంచి కొత్త టర్న్ తీసుకుంటుంది. ఇది కాస్త ఊహించదగిందే అయినా ఆకట్టుకుంటుంది. అలాగే చంద్రముఖిలో జ్యోతిక పాత్రలా కనిపిస్తుంది.

క్లైమాక్స్ లో సన్నిలియోన్ ఫైట్, నటన ఆశ్చర్యపరుస్తాయి. చివరికి అసలు రేణుక ఎవరు అనేది తెలిసిన తర్వాత సన్నిలియోన్ పాత్రపై ఓ క్లారిటీ కనిపిస్తుంది. చివర్లో తను నేను స్వాతిని అంటూ చేసిన హంగామా కూడా మెప్పిస్తుంది. మొత్తంగా బి,సి సెంటర్ ఆడియన్స్ టార్గెట్ గా వచ్చిన ఈ మూవీ సెకండ్ హాఫ్‌ వల్ల నిజంగానే ఆ వర్గం ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉందనే చెప్పాలి.జిన్నా పాత్రలో విష్ణు ఒదిగిపోయాడు. పాత్రను బాగా ఓన్ చేసుకున్నాడు. కానీ టైటిల్ కు ఏ మాత్రం జస్టిఫికేషన్ లేదు. పాయల్ పాత్ర మొదట లైట్ గా కనిపించినా తర్వాత కీలకం అవుతుంది. వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్రల పాత్రల్లాంటివి చాలా సినిమాల్లో చూసి ఉంటాం. అయినా నవ్వించారు. రఘుబాబు, అన్నపూర్ణ కాంబినేషన్ బావుంది. ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ లో సగం వరకూ విష్ణు ఒన్ మేన్ షోలా నడిచినా.. తర్వాత అంతా సన్నీలియోన్ పాత్రే కీలకంగా ఉంది. తను కూడా నటనలో బానే ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తుంది. ఓ రకంగా ఈ సినిమాను కాపాడాల్సింది కూడా ఈ పాత్రే. ఇతర పాత్రలన్నీ రొటీన్ గానే కనిపించినా.. ఎవరికి వారు మంచి నటన చూపించారు.టెక్నికల్ గా అనూప్ రూబెన్స్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపించుకుంటుంది. ఆల్రెడీ చాలా సార్లు విన్న ట్యూన్స్ లా పాటలు కనిపిస్తాయి. ఆర్ఆర్ కూడా జస్ట్ ఓకే అంతే. చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. మాటల్లో మెరుపులు లేవు. డ్యాన్స్ లు బావున్నాయి. సినిమా అంతా ఒకే లొకేషన్ లో సాగినట్టు కనిపించినా.. ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పిస్తాయి. అయితే స్క్రీన్ ప్లే మోహన్ బాబు అని టైటిల్స్ లో వేయడం ఆశ్చర్యపరుస్తుంది.

జిన్నా :- ఆకట్టుకునే రెగ్యులర్ ఎంటర్టైనర్

రేటింగ్ :- 2.5/5

                - యశ్వంత్ బాబు. 

Related Posts